గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ గారు, కేంద్ర మంత్రిమండలి లో నా సహచరులు అమిత్ శాహ్ గారు, హర్ దీప్ సింగ్ పురీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ గారు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అహమదాబాద్ కు, సూరత్ కు చెందిన నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, నమస్కారం.
ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినాన అహమదాబాద్ నివాసులకు, సూరత్ నివాసులకు ఎంతో ముఖ్యమైన కానుక అందుతోంది. దేశం లో రెండు ప్రధాన వాణిజ్య కేంద్రాలు అయిన అహమదాబాద్, సూరత్ లలో మెట్రో నిర్మాణం ఆ నగరాల లో సంధానాన్ని మరింత పటిష్ఠపరచే పని ని పూర్తి చేయనుంది. కేవడియా కు కొత్త రైలుమార్గాలను, కొత్త రైళ్లను ఆదివారం ప్రారంభించడం జరిగింది. ఆధునిక జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఇప్పుడు అహమదాబాద్ నుంచి కేవడియా కు ప్రయాణించనుంది. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలను, అభినందనలను తెలియచేస్తున్నాను.
సోదర సోదరీమణులారా,
ఇవాళ 17,000 కోట్ల రూపాయలకు పైబడిన పెట్టుబడి తో మౌలిక సదుపాయాల పనులు ప్రారంభం అయ్యాయి. కరోనా కష్ట కాలం లో సైతం దేశం మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిరంతరాయం గా కృషి చేస్తున్నట్టు ఈ 17,000 కోట్ల రూపాయల పెట్టుబడి నిరూపిస్తోంది. గత కొద్ది రోజుల్లో వేలాది కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు లు ప్రారంభం కావడమో, లేదా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కావడమో జరిగింది.
మిత్రులారా,
అహమదాబాద్, సూరత్.. ఈ రెండూ ఒక్క గుజరాత్ కే కాక యావత్తు భారతదేశం స్వయంసంవృద్ధి కి అండ గా నిలచే నగరాలే. అహమదాబాద్ లో మెట్రో ప్రారంభమైన అద్భుత క్షణం నాకు గుర్తుంది. ప్రజలు ఇళ్ల కప్పుల పై నిలబడి ఆ ఘట్టాన్ని వీక్షించారు. ఆ వేళ లో ప్రజల ముఖాలలో కనిపించిన ఆనందాన్ని ఏ ఒక్కరైనా మరచిపోవడం చాలా కష్టం. అలాగే అహమదాబాద్ కల లు, గుర్తింపు సైతం మెట్రో తో ముడిపడ్డ సంగతి ని నేను గమనించాను. ఈ రోజు న అహమదాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. అహమదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లో ఇప్పుడు మోటేరా స్టేడియమ్ నుంచి మహాత్మ మందిర్ వరకు ఒక కారిడార్ ఏర్పాటు అవుతుం. రెండో కారిడార్ ద్వారా జిఎన్ఎల్ యు, గిఫ్ట్ సిటీ లు ఒకదానితో మరొకటి జోడింపబడతాయి. దీని తాలూకు ప్రయోజనం నగరం లోని లక్షలాది నివాసులకు అందుతుంది.
మిత్రులారా,
అహమదాబాద్ తరువాత గుజరాత్ లో రెండో పెద్ద నగరం అయిన సూరత్ కు ఇప్పుడు మెట్రో వంటి ఆధునిక ప్రజారవాణా వ్యవస్థ అందుబాటు లోకి వస్తోంది. సూరత్ లోని ఈ మెట్రో నెట్ వర్క్ మొత్తం నగరం లోని కీలక వ్యాపార కేంద్రాలన్నింటినీ కలుపుతుంది. ఒక కారిడార్ సర్ థనా ను డ్రీమ్ సిటీ తో సంధానిస్తే మరో కారిడార్ భేసన్ ను సరోలి లైన్ తో సంధానిస్తుంది. రాబోయే సంవత్సరాల అవసరాలను కూడా దృష్టి లో పెట్టుకొని నిర్మాణం కావడం ఈ మెట్రో ప్రాజెక్టు ల ప్రత్యేకత. అంటే ఈ రోజు న పెడుతున్న పెట్టుబడులు మన నగరాల్లో రానున్న ఎన్నో సంవత్సరాల పాటు మెరుగైన వసతులు అందుబాటులో ఉంచుతాయి.
సోదర సోదరీ మణులారా,
దేశం లో మెట్రో నెట్ వర్క్ ల విస్తరణ తీరుతెన్నులే గతంలోని ప్రభుత్వాలకు, మా ప్రభుత్వానికి మధ్య గల తేడా ఏమిటో స్పష్టంగా వివరిస్తాయి. 2014వ సంవత్సరానికి ముందు 10-12 సంవత్సరాల కాల వ్యవధి లో కేవలం 225 కిలోమీటర్ల నిడివి గల మెట్రో మార్గాలు ప్రారంభం కాగా గత ఆరేళ్లలోనే 450 కిలోమీటర్ల కు పైగా మెట్రో లైన్ లు అందుబాటు లోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలోని 27 నగరాల్లో 1000 కిలోమీటర్లకు పైగా నూతన మెట్రో నెట్ వర్క్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
మిత్రులారా,
ఒకప్పుడు దేశం లో మెట్రో నిర్మాణం పై ఆధునిక ఆలోచనా ధోరణి గాని, చక్కని విధానం గాని లేవు. ఆ కారణంగానే విభిన్న సాంకేతిక పరిజ్ఞానాలతో మెట్రో నెట్ వర్క్ లు ఏర్పడ్డాయి. భిన్న నగరాల్లోని వ్యవస్థ లు భిన్నం గా ఉన్నాయి. పైగా నగరాల్లోని ఇతర రవాణా వ్యవస్థల కు, మెట్రో కు మధ్య సమన్వయం లేదు. ఈ రోజు న మేం నగరాల్లోని విభిన్న రవాణా వ్యవస్థలను సంఘటితం చేస్తున్నాం. అంటే బస్సులు, మెట్రో, సాధారణ రైళ్లు దేనికది వేర్వేరు వ్యవస్థలు గా పని చేయడం కాకుండా ఒక దానికి మరొకటి బలం గా నిలుస్తాయి. నేను అహమదాబాద్ సందర్శించిన సమయం లో నేశనల్ కామన్ మొబిలిటీ కార్డు ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది భవిష్యత్తు లో రవాణా వ్యవస్థలు మరింత సంఘటితం కావడానికి దోహదపడుతుంది.
మిత్రులారా,
నగరాల తక్షణ అవసరాలేమిటి, రాబోయే 10-20 సంవత్సరాల కాల వ్యవధి లో ఎలాంటి అవసరాలు ఏర్పడతాయి అనే ముందు చూపు తో మేం పని చేయడం ప్రారంభించాం. ఉదాహరణ కు సూరత్, గాంధీనగర్ లనే పరిశీలిద్దాం. రెండు దశాబ్దాల క్రితం, సూరత్ నగరం ఆ నగర అభివృద్ధి కంటే ప్లేగ్ వంటి మహమ్మారి కారణంగానే వార్తలలోకెక్కింది. అయితే సూరత్ నివాసులలో అందరినీ అక్కున చేర్చుకొనే స్వాభావిక గుణం ఏదయితే ఉందో, అది స్థితులను మార్చివేయడాన్ని మొదలుపెట్టింది. మేం ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యాపార సంస్థ ను అక్కున చేర్చుకొనే సూరత్ స్ఫూర్తి ని బలపర్చాం. ఈ రోజు న జనాభా పరం గా దేశం లో ఎనిమిదో పెద్ద నగరం అయిన సూరత్ ప్రపంచం లోనే త్వరిత గతి న విస్తరిస్తున్న నాలుగో పెద్ద నగరం గా కూడా గుర్తింపు పొందింది. ప్రపంచం లోని ప్రతి 10 వజ్రాలలో 9 వజ్రాలను సూరత్ లో సానబట్టడం జరుగుతోంది. ఈ రోజు న దేశం లో మొత్తం మనిషి తయారుచేసే వస్త్రాలలో 40 శాతం, మనుషులే నేసే ఫైబర్ లో 30 శాతం ఉత్పత్తి మన సూరత్ లో జరుగుతోంది. ఇవాళ సూరత్ దేశం లో అన్ని నగరాల కంటే పరిశుభ్రమైనటువంటి నగరాలలో రోండో నగరం గా ఉంది.
సోదర సోదరీమణులారా,
మెరుగైన ప్రణాళిక, సమ్మిళిత ఆలోచనా ధోరణి తోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. గతంలో సూరత్ లో 20 శాతం జనాభా మురికివాడల్లో నివసించే వారు. పేదలకు పక్కా ఇళ్లను కేటాయించిన తరువాత ఇప్పుడు మురికివాడలలో నివసించే వారి సంఖ్య ఆరు శాతాని కి తగ్గింది. నగరం లో రద్దీ ని తగ్గించేందుకు కూడా మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ సహా అనేక చర్యలను తీసుకోవడమైంది. ఈ రోజు న సూరత్ లో 100కి పైగా ఫ్లై ఓవర్ లు ఉన్నాయి. వాటిలో 80 ఫ్లై ఓవర్ లు గత 20 సంవత్సరాల కాలం లో నిర్మించగా, ప్రస్తుతం 8 నిర్మాణం లో ఉన్నాయి. అలాగే మురుగు నీటి శుద్ధి ప్లాంటు ల సామర్థ్యాన్ని కూడా పెంచడం జరిగింది. ఈ రోజు న సూరత్ లో 12కి పైగా మురుగునీటి శుద్ధి ప్లాంటులు ఉన్నాయి. ఈ రోజు న సూరత్ ఒక్క మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ద్వారానే 100 కోట్ల రూపాయలకు పైబడి ఆదాయాన్ని సంపాదిస్తోంది. గత కొద్ది సంవత్సరాల కాలం లో సూరత్ లో ఆధునిక ఆస్పత్రుల నిర్మాణం కూడా జరిగింది. ఈ చర్యలన్నీ జీవన సౌలభ్యాన్ని పెంచాయి. ఈ రోజు న సూరత్ ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’’ కు చక్కని ఉదాహరణ గా మారింది. పూర్వాంచల్, ఒడిశా, ఝార్ ఖండ్, పశ్చిమ బంగాల్, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సంపూర్ణ కలల తో ఇక్కడకు రావడం వల్ల సూరత్ బుల్లి భారత్ గా అభివృద్ధి చెందింది. శ్రమించే తత్వం గల మన ప్రజలు అంకిత భావంతో పని చేస్తున్నారు. సూరత్ ను అభివృద్ధి లో కొత్త శిఖరాలకు చేర్చడం లక్ష్యం గా ఈ రోజు న ఈ ప్రజలంతా కృషి చేస్తున్నారు.
మిత్రులారా,
అదే విధం గా గతం లో గాంధీనగర్ గుర్తింపు ఏమిటి? అది రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వోద్యోగుల ఆవాస ప్రదేశం గా, సోమరితనం విలసిల్లే ప్రాంతం గా ప్రాచుర్యం లో ఉండేది. అయితే గాంధీనగర్ కు గల ఈ గుర్తింపు కొన్ని సంవత్సరాలు గా మారుతూ వచ్చింది. ఇప్పుడు గాంధీనగర్ లో ఎక్కడకు వెళ్లినా ఉత్సాహం చిందులు వేసే యువత ను, వారి కలలను మనం గమనిస్తాం. ఇప్పుడు గాంధీనగర్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఐఐటి గాంధీనగర్, గుజరాత్ జాతీయ న్యాయ విద్యాలయం, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం, రక్షా శక్తి విశ్వవిద్యాలయం, నిఫ్ట్ ల వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. పండిత్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేశన్, ధీరూభాయి అంబానీ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేశన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి), బాయిసెగ్ (భాస్కరాచార్య ఇన్స్ టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేశన్స్ ఎండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ వంటి సంస్థ లు ఉన్నాయి. అంత తక్కువ కాలంలోనే లెక్కలేనన్ని సంస్థ లు వచ్చాయి. భారత భవిష్యత్తు ను తీర్చి దిద్దుతున్నాయి. విద్యారంగాన్ని మార్చడంలో ఇలాంటి సంస్థలే కాదు, పలు కంపెనీలు తమ కేంపస్ లను ఏర్పాటు చేసి అహమదాబాద్ యువత కు ఉపాధి అవకాశాలు ఇవ్వజూపుతున్నాయి. అలాగే గాంధీనగర్ లో మహాత్మ మందిర్ కాన్ఫరెన్స్ టూరిజంకు ఉత్తేజం కల్పిస్తోంది. ఇప్పుడు వృత్తి నిపుణులు, దౌత్యవేత్తలు, మేధావులు, నాయకులు కూడా సదస్సుల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వస్తున్నారు. ఇది కూడా నగరానికి కొత్త గుర్తింపు, దిశ అందిస్తోంది. ఈ రోజు విద్యాసంస్థలు, ఆధునిక రైల్వే స్టేషన్లు గాంధీనగర్ కు ప్రత్యేక ఆకర్షణ. గిఫ్ట్ సిటీ, ఆధునిక మౌలిక వసతుల ప్రాజెక్టుల తో గాంధీనగర్ ఆశల కు ఊపిరులు పోసే చలనశీల నగరం గా మారింది.
మిత్రులారా,
గాంధీనగర్ తో పాటు అహమదాబాద్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకు రాగల అనేక ప్రాజెక్టు లు అమలు జరుగుతున్నాయి. సాబర్ మతీ రివర్ ఫ్రంట్ కావచ్చు, కాంకరియా లేక్ ఫ్రంట్ కావచ్చు, వాటర్ ఏరోడ్రోమ్ కావచ్చు, బస్ ర్యాపిడ్ ట్రాంజిట్ వ్యవస్థ కావచ్చు, మోటేరా లో గల ప్రపంచం లోకెల్లా అతి పెద్దదైన స్టేడియమ్ కావచ్చు, సర్ ఖేజ్ లో ఆరు లేన్ ల గాంధీనగర్ హైవే కావచ్చు.. అనేకానేక ప్రాజెక్టులు గడచిన సంవత్సరాలలో నిర్మాణం అయ్యాయి. మరో విధంగా చెప్పాలంటే అహమదాబాద్ పౌరాణికతను పరిరక్షించుకొంటూనే ఆధునికత ను కూడా సంతరించుకొన్న నగరం గా తీర్చిదిద్దడం జరుగుతోంది. భారతదేశం లో తొలి ‘‘ప్రపంచ వారసత్వ నగరం’’ గా అహమదాబాద్ ను ప్రకటించడమైంది. అహమదాబాద్ లోని ధోలేరా లో కొత్త విమానాశ్రయం కూడా నిర్మాణం కానుంది. ఈ విమానాశ్రయాన్ని అహమదాబాద్ తో కలపడం కోసం అహమదాబాద్-ధోలేరా మోనోరైల్ కు కూడా ఇటీవలే స్వీకృతిని ఇవ్వడమైంది. ఇదే విధంగా అహమదాబాద్ ను, సూరత్ ను దేశ ఆర్థిక రాజధాని ముంబయి తో కలిపే బులెట్ ట్రయిన్ ప్రాజెక్టు పనులు కూడా పురోగమిస్తున్నాయి.