యువర్ ఎక్స్ లెన్సీ ఆసియాన్ అధ్యక్షులు, ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్,
యువర్ మెజెస్టీ,
శ్రేష్ఠులారా,
ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతుండటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మన భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నేడు రజత జయంతిని నిర్వహించుకొంటున్నప్పటికీ మన సామూహిక పయనం వేల ఏళ్ల నాటిది.
ఆసియాన్ దేశాధినేతలకు భారతదేశం అయిదేళ్ల వ్యవధిలో రెండో సారి ఆతిథ్యాన్ని ఇవ్వడం ఒక ప్రత్యేక గౌరవం. అలాగే రేపటి మా గణతంత్ర దిన వేడుకలలో మీరంతా మా గౌరవనీయ అతిథులుగా పాల్గొనబోతున్నారు. ఈ హర్షదాయక వేడుకలకు ఆసియాన్ భాగస్వామ్య దేశాలకు చెందిన నా సోదరులు మరియు సోదరీమణుల హాజరు అపూర్వం.
మీరు ఇలా సామూహికంగా ఈ వేడుకలకు రావడం 125 కోట్ల మంది నా దేశ వాసుల హృదయాలను పులకింపజేసే అంశం.
ఇది మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ప్రస్ఫుటం చేస్తూ భారతదేశం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి కేంద్రక స్థానాన్నిచ్చింది.
మన సాంస్కృతికపరమైన, నాగరకతపరమైన పరస్పర బంధం మన మధ్య స్నేహాన్ని పరిపోషించింది. ఆసియాన్ దేశాలతో పాటు భారత ఉపఖండంలో మన విలువైన ఉమ్మడి వారసత్వానికి భారత పురాతన ఇతిహాసమైన ‘రామాయణం’ నేటికీ స్ఫూర్తిప్రదాతగా నిలుస్తోంది.
ఈ మహా ఇతిహాసం ద్వారా మన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వ సంపదను చాటుతూ ఆసియాన్ దేశాల కళాబృందాలతో మేము ఇక్కడ రామాయణ ఉత్సవాన్ని కూడా నిర్వహించాం. మరో ప్రధానమైన బౌద్ధ మతం కూడా మన మధ్య సన్నిహిత సంధానానికి దోహదం చేస్తోంది. అలాగే ఆగ్నేయ ఆసియా లోని చాలా ప్రాంతాలలో అనుసరించే ఇస్లాం కూడా అనేక శతాబ్దాల భారత చరిత్ర తో ముడిపడి ఉంది. ఇటువంటి మన ఉమ్మడి వారసత్వాన్ని చాటే విధంగా మనం సంయుక్తంగా స్మారక తపాలా బిళ్లలను కూడా ఆవిష్కరించాం.
మాననీయులైన ఆసియాన్ అధ్యక్షులు, దేశాధినేతలారా,
భారత్‌తో పాటు ఆసియాన్ దేశాలలో ఏడాది పాటు సంయుక్తంగా నిర్వహించిన సంస్మరణాత్మక కార్యక్రమాలకు ఈ శిఖరాగ్ర సదస్సు ఓ గొప్ప ముగింపు. ఇప్పటి దాకా సాగిన మన పయనాన్ని సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్తు మార్గ నిర్దేశానికి ఇది విలువైన అవకాశాన్ని కల్పించింది. మన మధ్య స్వేచ్ఛగా, స్నేహపూర్వకంగా సాగిన చర్చ ఈ లక్ష్యానికి ఎంతగానో దోహదపడినట్లు నేను విశ్వసిస్తున్నాను.
మాననీయులైన ఆసియాన్ అధ్యక్షులు, దేశాధినేతలారా!
మన మధ్య 1992 నుండి ప్రారంభమైన అంశాలవారీ చర్చల స్థాయి నుండి మన వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ స్థాయికి చేరుకొంది. తదనుగుణంగా నేడు వార్షిక శిఖరాగ్ర సమావేశాలకు అదనంగా 30 అంశాలవారీ చర్చల యంత్రాంగాలు, ఏడు మంత్రిత్వ స్థాయి సమాలోచనా వేదికలు రూపుదిద్దుకొన్నాయి. ఆసియాన్- ఇండియా భాగస్వామ్య లక్ష్యాల సాధనలో భాగంగా శాంతి, ప్రగతి, పరస్పర శ్రేయస్సు దిశగా పంచవర్ష కార్యాచరణ ప్రణాళికల అమలు ద్వారా మనం అద్భుతంగా ముందంజను వేశాం.
అలాగే 2016-2020 కాలానికి సంబంధించిన మూడో పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక కూడా అమోఘంగా పురోగమిస్తోంది. ఆ మేరకు ఆసియాన్-భారత సహకార నిధి, ఆసియాన్- ఇండియాసైన్స్ అండ్ టెక్నాలజీ ఫండ్, ఆసియాన్- ఇండియా గ్రీన్ ఫండ్ ల ద్వారా అనేక సామర్థ్య నిర్మాణ పథకాలను చేపట్టాం.
మాననీయులైన ఆసియాన్ అధ్యక్షులు, దేశాధినేతలారా!
శాంతి, సౌభాగ్యాల కోసం మహా సముద్రాలు, సముద్రాలకు సంబంధించి నిబంధన ఆధారిత క్రమం ఉండాలన్న ఆసియాన్ దేశాల దృక్పథంతో భారతదేశం ఏకీభవిస్తోంది. తదనుగుణంగా అంతర్జాతీయ చట్టానికి తగు గౌరవం ఉండాలి… ప్రత్యేకించి ఐక్య రాజ్య సమితి సముద్ర ఒడంబడిక చట్టం (UNCLOS) ఇందులో కీలకం.
మన పరస్పర సముద్ర సంబంధ అంశాలలో ఆచరణాత్మక సహకారాన్ని, సంయుక్త కృషిని మరింత ముమ్మరం చేయడానికి ఆసియాన్‌తో కలసి పనిచేసేందుకు మేం నిబద్ధతతో ఉన్నాం.
దీనికి సంబంధించి ముగింపు భేటీలో చర్చించే అవకాశం మనకు లభించింది. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో వృద్ధి-ప్రగతి వైపు దృష్టి సారించాల్సిన కీలకాంశాలలో ఇదీ ఒకటి. మన సమ్మానోత్సవ కార్యకలాపాల్లో భాగంగా ఆద్యంతం సాగిన చర్చల్లో సముద్ర సంబంధాంశాల్లో సహకారం సమగ్ర భాగంగా ఉందన్నది వాస్తవం.
ఆసియాన్-ఇండియా కనెక్టివిటీ సమిట్, నీలి ఆర్థిక వ్యవస్థపై కార్యశాల సహా క్రమబద్ధ చర్చల యంత్రాంగాల భేటీలలోనూ ఈ ఇతివృత్తమే ప్రతిధ్వనించింది.
మన మధ్య సముద్ర సహకారానికి సంబంధించి మానవతావాద-విపత్తు సహాయక కార్యకలాపాలు, భద్రతలో సహకారం, సముద్రయాన స్వేచ్ఛ కీలకంగా దృష్టి సారించవలసినటువంటి అంశాలు. ఆసియాన్‌తో భారతదేశానికి శతాబ్దాలుగా గల భూ, గగన, సముద్ర, సాంస్కృతిక, నాగరికతా, పరస్పర ప్రజా సంబంధాలకు అనుసంధాన సదస్సు ఓ ధ్రువీకరణ.
మాననీయులైన ఆసియాన్ అధ్యక్షులు, దేశాధినేతలారా!
సమాచార- సంసర్గ సాంకేతిక పరిజ్ఞానం (ICT) మన మధ్య అంకాత్మక (డిజిటల్) అనుసంధానాన్ని కల్పించి మన బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
ప్రాంతీయ ఉన్నత సామర్థ్య ఆప్టిక్ నెట్‌వర్క్, జాతీయ గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ల ద్వారా మారుమూల ప్రాంతాలను డిజిటలీకరణతో సంధానించడంలో సహకారాన్ని కూడా ఇందులో జోడించవచ్చు.
గ్రామీణ అనుసంధానంపై ప్రయోగాత్మక పథకాన్ని చేపట్టేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది. తద్వారా కంబోడియా, లావో పిడిఆర్, మయన్మార్, వియత్నాంలలో డిజిటల్ గ్రామాలను సృష్టించవచ్చు. ఈ పథకం విజయవంతమైతే దీనిని ఇతర ఆసియాన్ దేశాలకూ విస్తరింపజేయవచ్చు.
అలాగే టెలికం- నెట్‌వర్కింగ్ సాంకేతిక పరిజ్ఞానంలోనూ శిక్షణ ఇవ్వడానికి భారతదేశం సుముఖతను వ్యక్తం చేస్తోంది. ఆసియాన్ దేశాల్లోని సమాచార- సంసర్గ సాంకేతిక వృత్తి నిపుణుల కోసం విధానాలు, నియంత్రణ, సాంకేతికాభివృద్ధిలో ఉత్తమ పద్ధతులను పంచుకోవచ్చు.
ఆర్థిక అంశాలలో మన మధ్య అవగాహన, సహకార విస్తృతి దిశగా అంకాత్మక సమ్మేళనం, పెట్టుబడులకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చలకు నేను ఈ సందర్భంగా ప్రతిపాదిస్తున్నాను. ఉగ్రవాదానికి నిధుల ఊపిరి నిలిపివేయడంలో సంయుక్త పోరాటం కూడా మనం సామూహికంగా దృష్టి సారించవలసినటువంటి మరో ముఖ్యాంశం.
మాననీయులైన ఆసియాన్ అధ్యక్షులు, దేశాధినేతలారా!
మన మధ్య వాణిజ్యం గడచిన పాతికేళ్లలో 25 రెట్లు పెరిగి 70 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. ఆసియాన్ దేశాల నుండి, భారతదేశం నుండి పెట్టుబడులు ఉత్తేజకరంగా వృద్ధి చెందుతున్నాయి.
వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవడంలో ఆసియాన్ దేశాలతో కలసి పనిచేయడాన్ని మేం కొనసాగిస్తాం. అలాగే మన వ్యాపార సమాజాల మధ్య సమాలోచనలకూ వేదిక కల్పిస్తాం.
ఇటీవల నిర్వహించిన వాణిజ్య-పెట్టుబడుల ప్రదర్శన, ఆసియాన్-ఇండియా బిజినస్ కౌన్సిల్ మీటింగ్, బిజ్‌నెట్ సదస్సు, స్టార్ట్- అప్ ఫెస్టివల్, హ్యాకథన్, ఐసిటి ఎక్స్ పో ల వంటివి ప్రోత్సాహకర ఫలితాలిచ్చాయి.
మన కంపెనీలు.. ప్రత్యేకించి జౌళి, దుస్తులు, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తి ఆధారిత వస్తువులు, ఎలక్ట్రానిక్స్ రంగాలలో ప్రాంతీయ విలువ శృంఖలాలుగా రూపొందడానికి మన ప్రాజెక్టు అభివృద్ధి నిధి, సత్వర ప్రభావ ప్రాజెక్టులు ఎంతగానో తోడ్పడతాయన్నది నా విశ్వాసం.
మాననీయులైన ఆసియాన్ అధ్యక్షులు, దేశాధినేతలారా!
వందల ఏళ్లుగా ప్రజల మధ్య పరస్పర సంబంధాలు మన సన్నిహిత సంబంధాలకు పునాదిగా ఉన్నాయి.
ఆగ్నేయ ఆసియాలో భారతీయులు విస్తృత స్థాయిలో స్థిరపడ్డారు. స్థానిక సమాజాలు వారిని ఆదరంగా అక్కున చేర్చుకున్నాయి.
ఈ నెల ఆరంభంలో సింగపూర్ లో నిర్వహించిన ‘ఆసియాన్- ఇండియా ప్రవాసీ భారతీయ దివస్’ మన మధ్య సన్నిహిత సంబంధాలను ప్రోది చేయడంలో వారి తోడ్పాటును గుర్తించింది.
అదే సమయంలో న్యూ ఢిల్లీ లో నిర్వహించిన భారత వారసత్వ పార్లమెంటు సభ్యులు- మేయర్ల తొలి సదస్సుకు ఆసియాన్ దేశాల నుండి కూడా అత్యధిక ప్రాతినిధ్యం స్పష్టమైంది.
మన చారిత్రక బంధాలను పటిష్ఠం చేసుకొనే దిశగా 2019ని ఆసియాన్-భారత పర్యాటక సంవత్సరంగా మనం ప్రకటిద్దామని నేను ప్రతిపాదిస్తున్నాను. అలాగే పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు మనం ప్రత్యక్ష, పరోక్ష వారసత్వ సర్క్యూట్ లను కూడా ఏర్పాటు చేయవచ్చు.
మన ప్రాంతం నుండి యాత్రికులను, పర్యాటకులను ఆకర్షించడంలో బౌద్ధ పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు కూడా ఒక ముఖ్యమైన భాగం కాలదని నా విశ్వాసం
మాననీయులైన ఆసియాన్ అధ్యక్షులు, దేశాధినేతలారా!
చారిత్రక నిర్మాణాల పునరుద్ధరణ పనుల్లో భారతదేశం పాలుపంచుకోవడం మన నాగరకతా బంధాల పటిష్ఠానికి ఒక నిదర్శనం.
ఆ మేరకు కంబోడియా, మయన్మార్, లావో పిడిఆర్, వియత్నాం లలో పురాతన ఆలయాల సంరక్షణ పనుల నిర్వహణలో భారతదేశం తన వంతు పాత్రను పోషించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
ఆసియాన్-భారత ప్రదర్శనశాల (మ్యూజియం)ల నెట్‌వర్క్‌తో ఒక వాస్తవిక సమాచార పోర్టల్ ఏర్పాటుతో ఉమ్మడి వారసత్వానికి మరింత ఊతం లభిస్తుంది.
సంస్మరణాత్మక కార్యక్రమాలపైన ముఖ్యంగా దృష్టి సారించడం మన యువతరం శక్తికి, మన భవిష్యత్తుకు ఒక తిరుగులేని నిదర్శనం. యువ సదస్సు, చిత్రకారుల సమ్మేళనం, సంగీతోత్సవం, యువతకు డిజిటల్ వాణిజ్యంపై అవగాహన కోసం నిర్వహించిన అంకురోత్సవం తదితరాలు ఇందుకోసమే నిర్దేశించబడ్డాయి. తదనుగుణంగా వారిలో మరింత ఉత్తేజం నింపుతూ జనవరి 24న యువ పురస్కార ప్రదానం కూడా చేశాం.
ఆసియాన్ దేశాల నుండి ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనల కోసం భారతదేశం లోని ప్రతిష్ఠాత్మక విద్యా- పరిశోధన సంస్థలకు వచ్చే విద్యార్థులు, పరిశోధకులకు 1000 ఫెలోషిప్పులు మంజూరు చేస్తున్నామని ప్రకటించడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
మన ప్రాంతంలోని యువతకు మరింత సాధికారితను కల్పించడమే ఈ ప్రకటన లక్ష్యం. దీంతో పాటు ఆసియాన్ హైవే వృత్తి నిపుణులకు భారత హైవే ఇంజనీర్ల అకాడమీలో నిర్దిష్ట శిక్షణ కోర్సులు నిర్వహించడానికీ భారత్ సుముఖంగా ఉంది.
అంతేకాకుండా అంతర-విశ్వవిద్యాలయ ఆదాన ప్రదానాల కోసం విశ్వవిద్యాలయ నెట్‌వర్క్ ఏర్పాటుకు నేను ప్రతిపాదిస్తున్నాను.
మాననీయులైన ఆసియాన్ అధ్యక్షులు, దేశాధినేతలారా!
చివరగా… ఈ సంస్మరణాత్మక శిఖర సమ్మేళనం లో పాల్గొనాలన్న నా ఆహ్వానాన్ని సహృదయంతో అంగీకరించి మాతో కలసి ఇందులో పాలుపంచుకున్నందుకు మీలో ప్రతి ఒక్కరికీ మా ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇక ఈ సదస్సుకు సహాధ్యక్షత వహించిన, 2018 ఆసియాన్ చైర్మన్ పదవిలో ఉన్నటువంటి సింగపూర్ గణతంత్ర రాజ్యం తరఫున కీలకోపన్యాసం ఇవ్వాల్సిందిగా ఆ దేశ ప్రధాని, మాననీయులు శ్రీ లీ సీన్ లూంగ్ ను ఆహ్వానిస్తున్నాను.