ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు.
ప్రధాన మంత్రి పుట్టిన రోజు సందర్భం లో రష్యా అధ్యక్షుడు ఆయన కు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి గాను శ్రీ పుతిన్ కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు.
భారతదేశాని కి, రష్యా కు మధ్య ఏర్పడ్డ ‘ప్రత్యేకమైన, విశేషాధికారాలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ మరింత బలపరచాలన్న దృఢ దీక్ష ను ఇద్దరు నేతలూ పునరుద్ఘాటించారు. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సైతం ద్వైపాక్షిక చర్చల్లో పురోగతి చోటుచేసుకొంటున్నందుకు వారు హర్షాన్ని వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి ఇటీవల మాస్కో ను సందర్శించడం ఫలప్రదం గా ముగిసిన సంగతిని నేతలిద్దరూ ఈ సందర్భం లో ప్రస్తావించారు.
ఎస్‌సిఒ కు, బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) కు ఈ ఏడాది లో కూడా రష్యా విజయవంతంగా అధ్యక్షత వహిస్తున్నందుకుగాను ప్రెసిడెంట్ శ్రీ పుతిన్ కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం లోనే జరగనున్న ఎస్‌సిఒ, బ్రిక్స్ శిఖర సమ్మేళనాల తో పాటు భారతదేశం నిర్వహించనున్న కౌన్సిల్ ఆఫ్ ఎస్‌సిఒ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశం లో కూడా పాల్గొనాలని తాను ఆసక్తి గా ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు.
భారతదేశం తో ద్వైపాక్షిక సంబంధాల ను పటిష్టం చేసుకోవడానికి అధ్యక్షుడు శ్రీ పుతిన్ వ్యక్తిగతంగా నిబద్ధత ను చాటుతున్నందుకు ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇరుపక్షాల కు వీలైన సమయం లో తదుపరి ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడాని కి భారతదేశానికి విచ్చేయనున్న అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు స్వాగతం పలకడం కోసం తాను వేచిఉన్నానని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు.