ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈరోజు, ఇటలీ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ మారియో డ్రాగితో ఫోనులో మాట్లాడారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవలి పరిణామాలతో పాటు ప్రపంచ దేశాలపై దాని ప్రభావం గురించి ఇరువురు నాయకులు చర్చించారు.
కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న జరిగిన ఉగ్రదాడిని వారు తీవ్రంగా ఖండించారు. అక్కడ చిక్కుకుపోయిన ప్రజలను సురక్షితంగా స్వదేశానికి రప్పించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు.
ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నుండి ఉత్పన్నమయ్యే మానవతా సంక్షోభం, దీర్ఘకాలిక భద్రతా ఆందోళనలను పరిష్కరించడంలో జి-20 దేశాల కూటమి స్థాయితో సహా అంతర్జాతీయ సహకారం అవసరమని వారు నొక్కి చెప్పారు.
వాతావరణ మార్పు వంటి జి-20 దేశాల కూటమి ఎజెండాలోని ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించారు. సి.ఓ.పి.-26 వంటి రాబోయే ఇతర బహుపాక్షిక ఒప్పందాలపై, తమ అభిప్రాయాలను ఈ సందర్భంగా, ఒకరికొకరు తెలియజేసుకున్నారు.
జి-20 దేశాల కూటమి స్థాయిలో చర్చలను ఫలవంతంగా నడిపించడంలో ఇటలీ నిర్వహిస్తున్న క్రియాశీల నాయకత్వాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ స్థాయి సమస్యలపై, ప్రత్యేకించి ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై తరచుగా కలుసుకోవాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు.