కొత్త సంవత్సరం ఆరంభ దినం కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పలువురు ప్రముఖుల తో టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు. వారి లో కింగ్ డమ్ ఆఫ్ భూటాన్ యొక్క రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్చుక్, భూటాన్ ప్రధాని డాక్టర్ లాయెన్‌చెన్ (డాక్టర్) లోటే శెరింగ్, శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ గోటాబాయా రాజపక్ష, శ్రీ లంక ప్రధాని శ్రీ మహీంద రాజపక్ష, మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా మరియు నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ లు ఉన్నారు.
ఈ నేతలందరి కీ ప్రధాన మంత్రి భారతదేశం ప్రజల పక్షాన మరియు తన తరఫు న నూతన సంవత్సర శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. భారతదేశం ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానాన్ని అమలుపరచడానికి, అలాగే భారతదేశ మిత్ర దేశాలు మరియు ఈ ప్రాంతం లోని తన భాగస్వామ్య దేశాల యొక్క ఉమ్మడి శాంతి కి, భద్రత కు, సమృద్ధి కి మరియు పురోగతి కి కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.
భూటాన్ రాజు తో తాను జరిపిన సంభాషణ క్రమం లో ప్రధాన మంత్రి తాను గడచిన సంవత్సరం లో భూటాన్ కు మరియు భారతదేశాని కి మధ్య ప్రత్యేక సంబంధాల ను మరింత గా పటిష్టపరచేందుకు దారితీసినటువంటి ముఖ్య కార్యసాధనల ను గురించి ప్రముఖం గా ప్రస్తావించారు. భూటాన్ ను తాను ఇదివరకు సందర్శించిన విషయాన్ని, అప్పట్లో అక్కడి ప్రజలు తన పట్ల కనబరచిన ప్రేమ ను, వాత్సల్యాన్ని ప్రధాన మంత్రి ఆత్మీయం గా గుర్తు కు తెచ్చుకున్నారు. ఉభయ దేశాల మధ్య యువజన సమూహాల రాక పోక లు మరింత పెరగవలసిన ఆవశ్యకత ఉందని కూడా ఆయన నొక్కి వక్కాణించారు. రాజు త్వరలోనే భారతదేశాన్ని సందర్శించనుండగా ఆ సందర్భం కోసం తాను వేచి వున్నట్లు కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
శ్రీ లంక అధ్యక్షుడు గోటాబాయా రాజపక్ష ప్రధాన మంత్రి కి ఆత్మీయ శుభాకాంక్షలు తన తరఫు నుండి అందజేశారు. శ్రీ లంక మరియు భారతదేశం వాటి మధ్య గల స్నేహ పూర్వక సంబంధాల ను 2020వ సంవత్సరం లో ఇతోధికం గా పెంపొందించుకొంటాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ దిశ గా కలసికట్టు గా సన్నిహితం గా కృషి చేయాలన్న తమ వచన బద్ధత ను నేతలు ఇరువురూ పునరుద్ఘాటించారు.
శ్రీ లంక ప్రధాని శ్రీ మహింద రాజపక్ష తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, శ్రీ లంక తో గల సన్నిహితమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి సహకారాన్ని మరింత గా విస్తరింప చేసుకోవాలని భారతదేశానికి ఉన్నటువంటి వచన బద్ధత ను గురించి పునరుద్ఘాటించారు. ప్రధాని శ్రీ రాజపక్ష తన వైపు నుండి ఆత్మీయ శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తూ ఇరు దేశాల మధ్య సంబంధాల ను మరింత పెంపొందింపచేసుకోవడం పట్ల ఎనలేని కుతూహలాన్ని వెలిబుచ్చారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ మాల్దీవ్స్ అధ్యక్షుని కి శుభాకాంక్షలు తెలిపారు. మాల్దీవ్స్ ప్రజలు అభివృద్ధి కై చేసే అన్ని ప్రయత్నాలు సఫలం కావాలని ప్రధాన మంత్రి కోరుకొన్నారు. ప్రధాన మంత్రి శుభాకాంక్షల కు ప్రతి గా అధ్యక్షుడు శ్రీ సోలిహ్ తన వైపు నుండి ఆత్మీయ ఆకాంక్షల ను తెలిపారు. భారతదేశం తో ఇప్పటికే నెలకొన్న ద్వైపాక్షిక సహకారాన్ని మరింత గా పెంచుకొనేందుకు మరియు కలసి పని చేసేందుకు నూతన రంగాల ను అన్వేషించాలని తాను ఎంతగానో అభిలషిస్తున్నట్లు శ్రీ సోలిహ్ పేర్కొన్నారు.
బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆమె రానున్న మూడు సంవత్సరాల పాటు అవామీ లీగ్ అధ్యక్ష పదవి కి తిరిగి ఎన్నిక అయినందుకు అభినందనల ను తెలియజేశారు. భారతదేశాని కి బాంగ్లాదేశ్ పూర్వ హై కమిషనర్ గా వ్యవహరించిన సయ్యద్ మువాజెమ్ అలీ అకాల మరణం పట్ల ప్రధాన మంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 2019వ సంవత్సరం లో భారతదేశం- బాంగ్లాదేశ్ సంబంధాల లో నమోదైన పురోగతి ని ప్రధాన మంత్రి వివరించారు. త్వరలో రానున్న బంగబంధు శత జయంతి, బాంగ్లాదేశ్ విముక్తి కి 50 సంవత్సరాలు కావడం మరియు బాంగ్లాదేశ్ తో ద్వైపాక్షిక దౌత్య సంబంధాల ను నెలకొల్పుకోవడం వంటి పరిణామాలు భారతదేశం- బాంగ్లాదేశ్ సన్నిహిత సంబంధాల లో ఇతోధిక పురోగతి లో ముఖ్యమైన మైలురాళ్ళ వలె నిలచాయని ఆయన అన్నారు.
ప్రధాని శ్రీ ఓలీ తో ప్రధాన మంత్రి శ్రీ మోదీ తాను జరిపిన సంభాషణ లో భాగం గా, 2019వ సంవత్సరం లో అనేక ప్రాజెక్టులు పూర్తి కావడం తో భారతదేశం- నేపాల్ సంబంధాలలో సాధ్యపడ్డ పురోగతి పట్ల తన సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఆయన ప్రత్యేకించి భారతదేశం లోని మోతిహారీ – నేపాల్ లోని అమ్ లేఖ్ గంజ్ పెట్రోలియమ్ ఉత్పత్తుల గొట్టపు మార్గం నిర్మాణం పనులు రికార్డు కాలం లో పూర్తి అయ్యాయన్నారు. బిరాట్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ను, అలాగే, నేపాల్ లో హౌసింగ్ రీ కనస్ట్రక్షన్ ప్రాజెక్టు ను వీలయినంత త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించుకోవాలని ఇరువురు నేతలూ అంగీకరించారు.