ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం పనితీరును అనేక అంతర్జాతీయ సంస్థలు విశేషంగా ప్రశంసించాయి. భారతదేశంలో పరివర్తన రథచక్రాలను కదిలించిన విధానాలను వేనోళ్ల కొనియాడాయి
భారతదేశం 2014-15 సంవత్సరంలో సాధించిన వృద్ధి 5.6 శాతం మాత్రమే కాగా, 2015-16లో అసాధారణ స్థాయిలో 6.4 శాతంతో వృద్ధి చెందగలదని ప్రపంచ బ్యాంకు ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేగాక దీన్ని తాము ‘మోదీ లాభాంశం’ (the Modi dividend)గా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ విధానాల వల్ల పెట్టుబడులు జోరు అందుకొనే సమయం ఆసన్నమైందని, చమురు ధరల క్షీణత మరొక పక్క నుండి తోడ్పడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు శ్రీ జిమ్ యాంగ్ కిమ్ కూడా ఈ సానుకూల భావనను ప్రతిధ్వనింపజేశారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ "బలమైన దార్శనిక నాయకత్వం" దేశ ప్రజలకు ఆర్థిక సార్వజనీనత దిశగా భారతదేశం "అసాధారణ కృషి" చేసేందుకు పురిగొల్పిందని ఆయన చెప్పారు. అలాగే ఆర్థిక సార్వజనీనతలో భాగంగా జన్ ధన్ యోజన ద్వారా భారతదేశ ప్రభుత్వం చేస్తున్నకృషిని కూడా ఆయన కొనియాడారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆర్థిక సంస్కరణలను చేపట్టడంతోపాటు చమురు ధరల్లో క్షీణతవల్ల భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించిన వేగవంతమైన వృద్ధి సాధించి చివరకు చైనాను అధిగమించగలదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) సూచించింది. పెట్టుబడిదారులలో నమ్మకం పెరగడానికి సంస్కరణలు దోహదపడుతున్నట్లు కూడా ఐఎమ్ఎఫ్ పేర్కొంది.
భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను శక్తిమంతమైన, సుస్థిర, సమ్మిళిత వృద్ధిపథంలో నిలుపుతాయని ఒఇసిడి అభిప్రాయపడింది. ప్రధాన మంత్రి సంస్కరణాభిలాషను ఈ ప్రకటన మరోసారి ప్రస్ఫుటం చేస్తోంది.
ప్రపంచవ్యాప్త ఆదరణగల అగ్రశ్రేణి సంస్థ మూడీస్ భారతదేశం రేటింగ్ అంచనాలను అంతకుముందున్న “సానుకూల” దశ నుంచి “సుస్థిర” దశకు మార్చి స్థాయి పెంచింది. ఇది పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని మరోసారి ఇనుమడింపజేసి, ప్రధాన మంత్రి, ఆయన బృందం చేపట్టిన సంస్కరణలకు కితాబిచ్చింది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు-భవిష్యత్తుపై ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన మధ్యంతర వార్షిక తాజా నివేదికలో భారతదేశం వృద్ధిపై ఇదే విధమైన ఆశావహ స్పందనను వ్యక్తం చేసింది. ఈ మేరకు దేశంలో ఈ ఏడాది, వచ్చే ఏడాది వృద్ధి 7 శాతంగా నమోదు కాగలదని అంచనా వేసింది.
ఆ విధంగా ప్రధాన మంత్రి సంస్కరణోత్సాహం, సంస్కరణల రథం వేగం పుంజుకోవడం వల్లనూ, తదనుగుణంగా దేశ ప్రతిష్ఠను పెంచుతూ ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలు వెలువడిన కారణంగానూ ప్రపంచం దృష్టి ఇప్పుడు భారతదేశం వైపు మళ్లింది