ప్రధాని శ్రీ లోఫ్ వెన్ ఆహ్వానించిన మీదట 2018 ఏప్రిల్ 16వ, 17వ తేదీలలో స్టాక్ హోమ్ లో ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆధికారిక పర్యటన జరిపారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ, ప్రధాని శ్రీ లోఫ్ వెన్ లు ఇరువురూ 17వ తేదీన సమావేశమై 2016 సంవత్సరంలో ముంబయి లో తమ ఉమ్మడి ప్రకటనను గుర్తు చేసుకుంటూ దాని అమలులో ఇప్పటి వరకు జరిగిన పురోగతి ని స్వాగతించారు. ఉభయ దేశాల మధ్య సహకారానికి ప్రస్తుత స్థూల రాజకీయ స్థితిగతుల నేపథ్యం పరిధి లోనే ఆ ఉమ్మడి ప్రకటన అమలు కు వచనబద్ధత ను ప్రకటించారు.
భారతదేశం, స్వీడన్ లు ప్రజాస్వామ్యం, దేశీయ చట్టాల విషయంలో ఉమ్మడి విలువలు కలిగివున్నాయని, మానవ హక్కులు, బహుముఖీనత, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను గౌరవిస్తాయని వారు పేర్కొన్నారు. జల వాయు పరివర్తన, అజెండా 2030, అంతర్జాతీయ శాంతి మరియు భద్రత, మానవ హక్కులు, లైంగిక పరమైన సమానత్వం, మానవీయ విలువలు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి పరస్పర ఆసక్తి గల కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలకు, సహకారానికి కట్టుబడతాయని పునరుద్ఘాటించారు. జల వాయు పరివర్తన పై పోరాటానికి ప్రపంచ స్థాయిలో ప్రయత్నాలను మరింత పెంచాల్సిన అవసరాన్ని నొక్కి ప్రస్తావిస్తూ ప్యారిస్ అగ్రిమెంటుకు ఉమ్మడి కట్టుబాటును కొనసాగించనున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి ప్రకటన పరిధిలో జాతీయ భద్రత సలహాదారుల స్థాయిలో భద్రత విధానంపై చర్చలను కొనసాగించేందుకు ఉభయ వర్గాలు కట్టుబాటు ను ప్రకటించాయి.
ఐక్య రాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ వేదికలపై సన్నిహితంగా సహకరించుకోవాలని ఇద్దరు ప్రధాన మంత్రులు అంగీకరించారు. అజెండా 2030 సాధన కోసం సభ్యత్వ దేశాలకు గట్టి మద్దతు ను ఇవ్వడం లక్ష్యంగా ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి చేపట్టిన సంస్కరణలను కూడా వారు పరిశీలన లోకి తీసుకున్నారు. ఐక్య రాజ్య సమితి భద్రత మండలి లో మరింత అధిక ప్రాతినిధ్యం కల్పించి దానిని మరింత బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా, 21వ శతాబ్ది వాస్తవాలకు అనుగుణంగా స్పందించేదిగా చేసే విధంగా విస్తరించడంతో పాటు సంస్కరించవలసిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (2021-22) లో భారతదేశం తాత్కాలిక సభ్యత్వానికి మద్దతు ఇవ్వడంతో పాటు భారతదేశాన్ని శాశ్వత సభ్యత్వ దేశంగా చేయడం కోసం ఇస్తున్న మద్దతుకు స్వీడన్ ప్రధాని లోఫ్ వెన్ కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రపంచ ఎగుమతుల నియంత్రణ వ్యవస్థ ను బలోపేతం చేయడం, ఆయుధ వ్యాప్తిని నిరోధించడం, నిరాయుధీకరణ లక్ష్యాలుగా సహకారాన్ని విస్తరించుకొనేందుకు ప్రధానమంత్రులిద్దరూ కట్టుబాటును, మద్దతును ప్రకటించడంతో పాటు ఆయా విభాగాల్లో మరింత సన్నిహిత సహకారానికి ఎదురు చూస్తున్నట్టు ప్రకటించారు. ఆస్ట్రేలియా గ్రూపు (ఎజి), వాసెనార్ అరేంజ్ మెంట్ (డబ్ల్యుఎ), క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ (ఎమ్ టిసిఆర్), ఖండాంతర క్షిపణుల వ్యాప్తి నిరోధం పై హేగ్ ప్రవర్తన నియమావళి (హెచ్ సిఒసి) ల వంటి భిన్న ఎగుమతి నియంత్రణ వ్యవస్థలలో భారతదేశం భాగస్వామి కావడాన్ని ప్రధాని శ్రీ లోఫ్ వెన్ ఆహ్వానిస్తూ పరమాణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్ జి)లో భారతదేశం సభ్యత్వానికి మద్దతు ను ప్రకటించారు.
ఉగ్రవాదం నిర్మూలన, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్ వర్క్ లు, ఆర్థిక సహాయ వ్యవస్థలను నిర్మూలించడం, దౌర్జన్యపూరిత తీవ్రవాదం నిరోధం వంటి భిన్న అంశాలలో మరింత ఐక్యత, శక్తివంతమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పడాలని ఉభయ ప్రధానులు పిలుపు నిచ్చారు. మరింత బలం పుంజుకొని ఉగ్రవాదం విసురుతున్న ముప్పును దీటుగా ఎదుర్కోగల విధంగా అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక చట్ట వ్యవస్థ లో తరచు సవరణలు చేయాలని ప్రధానులు నొక్కి చెప్పారు. కాంప్రిహెన్సివ్ కన్ వెన్శన్ ఆన్ ఇంటర్ నేశనల్ టెర్రరిజమ్ (సిసిఐటి) ముసాయిదా కు సత్వరం తుది రూపాన్ని ఇవ్వాలని ఉభయులు పిలుపు ఇచ్చారు.
భారతదేశం, స్వీడన్ లకు చెందిన భిన్న మంత్రిత్వ శాఖలు, సంస్థలు, వ్యక్తుల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఈ దిగువ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు వారు అంగీకారం తెలిపారు:
నూతన ఆవిష్కరణల పంథా
– సుసంపన్నత కు, వృద్ధి కి ఊతాన్ని ఇచ్చే విధంగా పరస్పర సహకారాన్ని పెంచుకోవడం, నూతన ఆవిష్కరణల పంథా లో జల వాయు పరివర్తన, స్థిరమైన అభివృద్ధి సాధన కు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడం కోసం స్థిరమైన భవిష్యత్తు కు బహుళ సంస్థల భాగస్వామ్య వ్యవస్థ ఏర్పాటు కు కృషి చేయాలి.
– స్వీడిష్ పేటెంట్ ల నమోదు కార్యాలయం, భారతదేశ పారిశ్రామిక విధానం మరియు ప్రోత్సాహక శాఖ ల మధ్య కుదిరిన అంగీకారం పరిధిలో మేధో సంపత్తి హక్కుల విభాగంలో చర్చలు నిర్వహించడం, సహకరించుకోవడానికి కృషి చేయాలి.
వాణిజ్యం మరియు పెట్టుబడులు
– రెండు వైపుల నుండి వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, “ఇన్వెస్ట్ ఇండియా” ద్వారా స్వీడన్ పెట్టుబడులు, “బిజినెస్ స్వీడన్’’ ల ద్వారా స్వీడన్ లో భారత పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించేందుకు పెట్టుబడుల రంగంలో పరస్పర సహకారం అందించుకోవాలి.
– స్మార్ట్ సిటీలు, డిజిటైజేషన్, నైపుణ్యాల అభివృద్ధి, రక్షణ విభాగాలలో భారతదేశం-స్వీడన్ వ్యాపార భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఇండియా-స్వీడన్ బిజినెస్ లీడర్ షిప్ రౌండ్ టేబుల్ (ఐఎస్ బిఎల్ ఆర్ టి) చేస్తున్న కృషిని ప్రోత్సహించి బలోపేతం చేయడంతో పాటు ఆయా విభాగాలలో బాంధవ్యాలు, ఆలోచనలు, భాగస్వామ్యాలు పెంపొందించుకోవాలి. సిఫారసులు ముందుకు నడిపించే చర్యలు తీసుకోవాలి.
స్మార్ట్ సిటీస్ మరియు తదుపరి తరం రవాణా వ్యవస్థ
– స్మార్ట్ సిటీల విభాగం లోను ప్రత్యేకించి రవాణా ఆధారిత పట్టణాభివృద్ధి, వాయు కాలుష్యం నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, వ్యర్థ పదార్థాల నుండి ఇంధనం ఉత్పత్తి, వృథా నీటి శుద్ధి, జిల్లా స్థాయిలో శీతలీకరణ మరియు సర్క్యులర్ ఎకానమీ వంటి విభాగాలలో చర్చలను నిర్వహించడానికి, సామర్థ్యాల నిర్మాణానికి కృషి చేయాలి. ఆయా రంగాలలో పరిజ్ఞానాన్ని పరస్పరం అందించుకోవడానికి, సహకారానికి గల అవకాశాలను అన్వేషించాలి.
– ఎలక్ట్రో మొబిలిటీ, నవీకరణ యోగ్య శక్తి విభాగంలో పరిజ్ఞానాన్ని పరస్పరం అందించుకోవడంతో పాటు సహకారానికి గల అవకాశాలను అన్వేషించాలి.
– రైల్వే పాలిసీ అభివృద్ధి, భద్రత, శిక్షణ, నిర్వహణ, రైల్వేల మెయింటెనెన్స్ విభాగాలలో పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంతో పాటు సహకారానికి గల అవకాశాలను అన్వేషించాలి.
స్మార్ట్ , స్థిర మరియు నవీకరణ యోగ్య శక్తి
– స్మార్ట్ మీటరింగ్, డిమాండుకు స్పందించడం, ఇంధన నాణ్యత నిర్వహణ, డిస్ట్రిబ్యూశన్ ఆటోమేశన్, విద్యుత్తు వాహనాలు/ చార్జింగ్ సంబంధ మౌలిక వసతులు, రిన్యూవబుల్ ఇంటిగ్రేశన్ ల వంటి భిన్న సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలోను, ప్రదర్శన లోను పరస్పరం సహకరించుకోవాలి. ఆయా రంగాలలో పరిశోధన, సామర్థ్యాల నిర్మాణ, విధాన సహకారం, వ్యాపార నమూనాలతో సహా మార్కెట్ డిజైన్ వంటి అంశాలలో సహకరించుకోవాలి.
– నవీకరణ యోగ్య శక్తి, ఇంధన సమర్థత అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ఇండియా- స్వీడన్ ఇనవేశన్స్ యాక్సిలరేటర్ వ్యవస్థ ద్వారా సరికొత్త అన్వేషణాత్మక సాంకేతిక పరిజ్ఞానాలలో పరిశోధనలను నిర్వహించి, భాగస్వామ్యాలను విస్తరించుకోవాలి.
మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధి మరియు సాధికారిత
– ఫోర్క్ లిఫ్ట్ డ్రైవర్లు, గిడ్డంగుల మేనేజర్లు, అసెంబ్లీ ఆపరేటర్లు వంటి పరిశ్రమకు అవసరం అయిన ఉద్యోగాలకు అర్హులుగా మహిళలను తీర్చి దిద్దడం లక్ష్యంగా మహారాష్ట్రలోని పుణె లో స్వీడన్, భారత ప్రతినిధులతో చేపట్టిన క్రాఫ్ట్స్ ప్రాజెక్టు వంటి వివిధ ప్రాజెక్టుల ద్వారా మహిళలకు ఉపాధి కల్పన, ఆంత్రప్రన్యోర్ శిప్ అవకాశాలు కల్పించే ఉమ్మడి చర్యలను ప్రోత్సహించాలి.
రక్షణ
– రక్షణ రంగంలో అత్యంత గోప్యంగా ఉంచదగినదిగా గుర్తించిన సమాచారానికి పరస్పర రక్షణ కల్పించడం, పరస్పర మార్పిడికి ద్వైపాక్షిక అంగీకారానికి గల అవకాశాలు అన్వేషించాలి.
– రక్షణ సహకారంలో ఇండో-స్వీడిష్ చర్చలను విస్తరించాలి. 2018-19 లో భారతదేశం, స్వీడన్ లలో భారతదేశం-స్వీడన్ రక్షణ సెమినార్లు ఐఎస్ బిఎల్ ఆర్ టి సహకారంతో నిర్వహించాలి. భారత్ లో రక్షణ ఉత్పత్తి కారిడార్ల పెట్టుబడి అవకాశాలు అధ్యయనం చేయాలి.
– రక్షణ, ఏరోస్పేస్ విభాగాల్లోని ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మేన్యుఫేక్చరర్ లతో (ఒఇఎమ్) చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సరఫరా వ్యవస్థలను అభివృద్ధి పరచడానికి పారిశ్రామిక భాగస్వామ్యాల ఏర్పాటును ప్రోత్సహించాలి.
అంతరిక్షం మరియు శాస్త్ర విజ్ఞానం
– అంతరిక్ష పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, అప్లికేశన్ లలో ద్వైపాక్షిక సహకారం ప్రాధాన్యానికి గుర్తింపు. అర్థ్ అబ్జర్వేశన్, ఖగోళ అన్వేషణ, ఉపగ్రహ భూ స్టేషన్ ల కార్యకలాపాలు వంటి భిన్న విభాగాలలో ఎమ్ఒయూ ల ద్వారా అంతరిక్ష సహకారాన్ని పెంపొందించుకొనేందుకు అంతరిక్ష సంస్థ లను ప్రోత్సహించాలి. ఇందుకు అనుగుణంగా ఇండో- స్వీడిష్ స్పేస్ సెమినార్ ను ఏర్పాటు చేయడంతో పాటు స్వీడన్ కు చెందిన అంతరిక్ష సంస్థలను భారత ప్రతినిధి వర్గం సందర్శించేందుకు అవకాశాన్ని కల్పించాలి.
– భారతదేశం, స్వీడన్ భాగస్వాముల నిర్వహణలో యూరోపియన్ స్పాలేశన్ సోర్స్ (ఇఎస్ ఎస్) ఏర్పాటు అవకాశాలు అన్వేషించాలి.
ఆరోగ్యం మరియు లైఫ్ సైన్స్ లు
– ఆరోగ్య సంరక్షణ మరియు ప్రజారోగ్యం రంగాలలో ప్రస్తుతం గల అవగాహనపూర్వక ఒప్పందం పరిధి లో ఆరోగ్య రంగం లో ప్రాధాన్యతాంశాలుగా గుర్తించిన ఆరోగ్య పరిశోధన, ఫార్మకోవిజిలెన్స్, యాంటి-మైక్రోబియల్ రెసిస్టెన్స్ ల వంటి అంశాలలో సహకారానికి గల అవకాశాలను అన్వేషించాలి.
ఫాలో-అప్
ఈ కార్యాచరణ ప్రణాళిక అమలు తీరును శాస్త్ర మరియు ఆర్థిక వ్యవహారాల ఇండో-స్వీడిష్ జాయింట్ కమిశన్, సంప్రదింపుల విదేశీ కార్యాలయం, ఇతర ద్వైపాక్షిక వేదికలు, ఉమ్మడి వర్కింగ్ గ్రూపు లు పర్యవేక్షిస్తూ ఉంటాయి.