ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2019 ఫిబ్రవరి 12వ తేదీన హర్యానాలోని కురుక్షేత్రను సందర్శిస్తున్నారు. మహిళా సర్పంచుల జాతీయ సదస్సు స్వచ్ఛశక్తి 2019లో ఆయన పాల్గొని స్వచ్ఛశక్తి 2019 అవార్డులు బహూకరిస్తారు. ప్రధానమంత్రి స్వచ్ఛ సుందర్ శౌచాలయం పేరిట ఒక ప్రదర్శనను కూడా ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. హర్యానాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి శంకుస్థాపనలు చేస్తారు.
స్వచ్ఛ భారత్ ఉద్యమంలో మహిళలు ప్రదర్శించిన నాయకత్వ బాధ్యతలు వెలుగులోకి తేవడం కోసం జరుగుతున్న జాతీయ కార్యక్రమం స్వచ్ఛశక్తి 2019. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మహిళా సర్పంచులు, పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మహిళా సాధికారతకు చేపట్టిన స్వచ్ఛ శక్తి కార్యక్రమంలో ఈ ఏడాది 15 వేల మంది మహిళలు పాల్గొంటారని అంచనా.
హర్యానా ప్రభుత్వ సహకారంతో మంచినీటి మంత్రిత్వ శాఖ స్వచ్ఛ శక్తి 2019ని నిర్వహిస్తోంది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో గ్రామీణ స్థాయిలో అత్యుత్తమ ప్రమాణాల గురించి ఇందులో పరస్పరం పంచుకుంటారు. స్వచ్ఛభారత్ తో పాటుగా స్వచ్ఛ సుందర్ శౌచాలయ్ (పరిశుభ్రమైన,స్వచ్ఛ మరుగుదొడ్డి) సాధించిన విజయాలు తెలియచేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ప్రపంచ ప్రచారోద్యమంలో ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం ఇదే ప్రథమం.
నేపథ్యం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గుజరాత్ లోని గాంధీనగర్ లో స్వచ్ఛశక్తి కార్యక్రమం 2017 సంవత్సరంలో తొలిసారిగా నిర్వహించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున స్వచ్ఛ శక్తి 2017 పేరిట జరిగిన ఆ సమావేశంలో 6వేల మంది మహిళా సర్పంచులు పాల్గొన్నారు. వారిని ప్రధానమంత్రి సత్కరించారు.
స్వచ్ఛశక్తి-2018 పేరిట రెండో స్వచ్ఛశక్తి కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో నిర్వహించారు. 8 వేల మంది మహిళా సర్పంచులు, 3 వేల మంది స్వచ్ఛగ్రాహీలు, స్వచ్ఛభారత్ కార్యక్రమానికి అపారసేవలందించిన భిన్న రంగాలకు చెందిన మహిళా చాంపియన్లు పాల్గొన్నారు.
ఇప్పుడు స్వచ్ఛశక్తి మూడో సదస్సును కురుక్షేత్రలో నిర్వహిస్తున్నారు. స్వచ్ఛభారత ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో గ్రామీణ స్థాయిలో మహిళలు, గ్రామీణ మహిళా చాంపియన్లు పరివర్తన శక్తులుగా ఏ విధంగా వ్యవహరించారనేందుకు ఇది చక్కని ఉదాహరణ. 2019 అక్టోబర్ రెండో తేదీ నాటికి భారతదేశాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా మార్చడం లక్ష్యంగా ప్రధానంత్రి శ్రీ నరేంద్రమోదీ 2014 అక్టోబర్ రెండో తేదీన ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహణలో జరుగుతున్న కార్యకలాపాల్లో ఈ సదస్సు కూడా ఒకటి.