ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 23వ, 24వ తేదీలలో రిపబ్లిక్ ఆఫ్ రవాండా లో, ఈ నెల 24వ, 25వ తేదీలలో రిపబ్లిక్ ఆఫ్ యుగాండా లో మరియు ఈ నెల 25వ తేదీ మొదలుకొని 27వ తేదీ వరకు రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా లో ఆధికారిక పర్యటనలను చేపట్టనున్నారు. భారతదేశ ప్రధాన మంత్రి ఒకరు రవాండా లో జరపనున్న ఒకటో పర్యటన ఇది. అలాగే, యుగాండా లో మన ప్రధాన మంత్రి పర్యటించడం 20 కి పైగా సంవత్సరాల కాలంలో ఇదే తొలి సారి. బిఆర్ఐసిఎస్ శిఖర సమ్మేళనం సందర్భంగా ఆయన దక్షిణాఫ్రికా పర్యటన చోటు చేసుకొంటోంది.
రవాండా మరియు యుగాండా లో ప్రధాన మంత్రి పాలుపంచుకొనే ఆధికారిక కార్యక్రమాలలో ఆయా దేశాల అధ్యక్షుల తో జరిపే ద్వైపాక్షిక సమావేశాలు, ప్రతినిధివర్గ స్థాయి చర్చల తో పాటు వ్యాపార సముదాయం ఇంకా అక్కడ నివసిస్తున్న భారతీయ సముదాయాలతో సమావేశం కూడా ఒక భాగంగా ఉండనున్నాయి. ప్రధాన మంత్రి రవాండా లో జెన్ సైడ్ మెమోరియల్ ను సందర్శిస్తారు. అంతేకాక అధ్యక్షులు శ్రీ పాల్ కగామే స్వయంగా చొరవ తీసుకొని ప్రవేశపెట్టినటువంటి జాతీయ సామాజిక పరిరక్షణ పథకం ‘‘గిరింకా’’ (ఒక్కొక్క కుటుంబానికి ఒక గోవు)కు సంబంధించిన ఒక కార్యక్రమం లో కూడా ప్రధాన మంత్రి పాలుపంచుకొంటారు. ప్రధాన మంత్రి యుగాండా లో యుగాండా పార్లమెంటును ఉద్దేశించి కీలకోపన్యాసం చేయనున్నారు. యుగాండా పార్లమెంటు ను ఉద్దేశించి భారతదేశ ప్రధాన మంత్రి ప్రసంగించనుండడం ఇదే ప్రథమం కానుంది.
దక్షిణ ఆఫ్రికా లో ప్రధాన మంత్రి దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుల వారి తో ద్వైపాక్షిక సమావేశంలో పాలుపంచుకొంటారు. అలాగే, బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) శిఖర సమ్మేళనం లోను, బ్రిక్స్ కు సంబంధించినటువంటి ఇతర సమావేశాలలోను ఆయన పాల్గొంటారు. బ్రిక్స్ సమావేశాలలో పాల్గొనే దేశాల నేతలతో ముఖాముఖి సమావేశాల ప్రణాళిక కూడా సిద్ధమైంది.
ఆఫ్రికా తో భారతదేశం సన్నిహితమైన, ఆదరపూర్వకమైన మరియు స్నేహశీల మైన సంబంధాలను కొనసాగిస్తోంది. ఈ సంబంధాలు పెద్ద సంఖ్య లో ఉన్న భారత ప్రవాసీ సముదాయం యొక్క బలమైన అభివృద్ధి కారక భాగస్వామ్యం తో మరింత పటిష్టంగా మారుతున్నాయి. రక్షణ, వ్యాపారం, సంస్కృతి, వ్యవసాయం, ఇంకా పాడి సంబంధ సహకారం వంటి రంగాలలో అనేక ఒప్పందాలపైన మరియు ఎమ్ఒయు లపైన ఈ పర్యటన కాలంలో సంతకాలు జరుగనున్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా ఆఫ్రికా దేశాలతో వేరు వేరు రంగాలలో మన అనుబంధం చెప్పుకోదగ్గ స్థాయిలో ముమ్మరం అయింది. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఆఫ్రికా కు దాదాపుగా 23 సార్లు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి మరియు ప్రధాన మంత్రి స్థాయి పర్యటనలు చోటుచేసుకొన్నాయి. భారతదేశ విదేశాంగ విధానంలో ఆఫ్రికా కు అగ్రతాంబూలం ఇవ్వడమైంది. ఆఫ్రికా ఖండం తో మన సంబంధాలను రవాండా, యుగాండా, ఇంకా దక్షిణ ఆఫ్రికా లలో ప్రధాన మంత్రి పర్యటన మరింత బలోపేతం చేయగలుగుతుంది.