భారతదేశంలో పండుగ పర్యాటకానికి అపారమైన అవకాశాలు: ప్రధాని మోదీ
ఈ దీపావళి సందర్భంగా భారతదేశం యొక్క నారి శక్తి సాధించిన విజయాలను మనమందరం జరుపుకుందాం: ప్రధాని మోదీ
శ్రీ గురు నానక్ దేవ్ జీ ‘సద్భవ్న’ మరియు ‘సమంతా’ సందేశాన్ని ఇచ్చారు: ప్రధాని
‘ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు: ప్రధాని మోదీ
కేవలం ఒక సంవత్సరంలో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ఒక ప్రధాన పర్యాటక హాట్‌స్పాట్‌గా మారింది: ప్రధాని
‘రన్ ఫర్ ఐక్యత’ దేశం యొక్క ఏకత్వాన్ని సూచిస్తుంది: ప్రధాని మోదీ

నా ప్రియ దేశవాసులారా, నమస్కారము. ఈ రోజు దీపావళి. పావన పర్వదినం. మీ అందరికీ దీపావళి సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. మనవాళ్ళు చెప్తారు –

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదామ్ ।

శత్రుబుద్ధివినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే ।

ఎంత ఉత్తమ సందేశము! ఈ శ్లోకంలో ప్రకాశం జీవితం లో సుఖం, ఆరోగ్యం, సమృద్ధి తీసుకొనివస్తుంది, అది విరోధబుద్ధిని నాశనం చేసి సద్బుద్ధి దర్శనం చేయిస్తుంది అని చెప్పారు. అటువంటి దివ్యజ్యోతికి నా ప్రణామములు. మనము ప్రకాశాన్ని విస్తరింపచేయాలని, సానుకూలభావాలను ప్రసరింపజేయాలని, ఇంకా శత్రుభావనలను నశింపజేయాలని ప్రార్థించడం అనే దాని కన్నా ఈ దీపావళిని గుర్తుంచుకోవడానికి మంచి ఆలోచన ఏముంటుంది! నేటికాలంలో ప్రపంచంలో అనేక దేశాలలో దీపావళిని జరుపుకుంటారు. ఇంకా విశేషమేమంటే ఈ పండుగ జరుపుకోవడంలో కేవలం భారతీయ సమాజం మాత్రమే కాక ఇప్పుడు అనేక దేశాల ప్రభుత్వాలు, అక్కడి పౌరులు, అక్కడి సాంఘిక సంస్థలు కూడా పాల్గొని దీపావళిని సంపూర్ణమైన హర్షోల్లాసాలతో జరుపుకుంటారు. ఒకరకంగా అక్కడ ‘భారత్’ ను నెలకొల్పుతారు.

సహచరులారా, ప్రపంచంలో ఫెస్టివల్ టూరిజానికి ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది. మన భారత్ లో దేశీయ పండుగలలో ఫెస్టివల్ జానికి అపారమైన అవకాశాలున్నాయి. హోలీ కానివ్వండి, దీపావళి కానివ్వండి, ఓనమ్ కానివ్వండి, పొంగల్ కానివ్వండి, బిహూ కానివ్వండి ఈ పండుగలను ప్రచారం చేసే ప్రయత్నం మనం చేయాలి. అంతేకాక పండుగల సంబరాలలో ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల ప్రజలను భాగస్వాములను చేయాలి. మనకు ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో విభిన్నమైన పండుగలు ఉంటాయి. ఈ విషయం ఇతరదేశాల ప్రజలకు ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. అందుకే భారత్ లో ఫెస్టివల్ టూరిజం ను ప్రోత్సహించడంలో దేశానికి వెలుపల నివసించే భారతీయుల పాత్ర ముఖ్యమైనది.

నా ప్రియ దేశవాసులారా, క్రితం సారి మన్ కీ బాత్ లో ఈ దీపావళికి కొత్తగా ఏదైనా చేద్దామని మనం నిశ్చయించాము. నేను చెప్పాను – రండి, మనమంతా ఈ దీపావళికి భారతీయ నారీశక్తి ని, వారి సాధనలను సెలబ్రేట్ చేసుకుందాము అని. అంటే భారతీయ లక్ష్మీపూజ.  ఇలా చెప్పాక చూస్తూండగానే సామాజికమాధ్యమాలలో లెక్కలేనన్ని స్ఫూర్తిదాయకమైన కథలు వరుసగట్టాయి. వరంగల్ లోని కోడిపాక రమేశ్, మా అమ్మ నా శక్తి అని నమో యాప్ లో వ్రాశారు 1990 లో మా నాన్నగారు మరణించాక, మా అమ్మ తన ఐదుగురు కొడుకుల బాధ్యత తీసుకుంది. ఈనాడు మా అన్నదమ్ములం మంచి ప్రొఫెషన్ లలో ఉన్నాము. మా అమ్మ మాకు దైవం. సర్వస్వం. ఆమె నిజంగా భారతీయ లక్ష్మి.

రమేశ్ గారూ, మీ తల్లి గారికి నా ప్రణామములు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే గీతికాస్వామి అంటున్నారు, ఒక బస్ కండక్టర్ కూతురు మేజర్ ఖుష్ బూ కన్వర్ వారి దృష్టిలో ‘భారతీయ లక్ష్మి’ అని. వారు అస్సాం రైఫిల్స్ యొక్క ఆల్ ఉమన్ శాఖ కు నేతృత్వం వహించారు.  కవితా తివారీ గారికి వారి శక్తి వారి కూతురు భారతీయ లక్ష్మి. తన కూతురు మంచి పెయింటింగ్స్ వేస్తుందని వారికి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆమె CLAT పరీక్షలో మంచి రాంక్ తెచ్చుకుంది. మేఘా జైన్ రాస్తున్నారు, 92 ఏండ్ల ఒక వృద్ధమహిళ ఎన్నో ఏళ్ళనుంచి గ్వాలియర్ రైల్వేస్టేషంలో ప్రయాణీకులకు ఉచితంగా త్రాగునీరు అందిస్తోంది. మేఘాజీ ఈ భారతీయ లక్ష్మి యొక్క వినమ్రత, కరుణ వల్ల ఎంతో స్ఫూర్తి పొందారు. ఇటువంటి ఎన్నో కథలను ప్రజలు షేర్ చేస్తున్నారు. మీరు తప్పక చదవండి, స్ఫూర్తి పొందండి. మీరు కూడా మీ చుట్టుపక్కల ఇటువంటి విషయాలను షేర్ చేయండి. ఈ అందరు భారతీయ లక్ష్ములకు నా ఆదరపూర్వక ప్రణామములు.

నా ప్రియ దేశవాసులారా, 17 వశతాబ్దంలో సుప్రసిద్ధ కవయిత్రి సాంచి హొన్నమ్మ ఆకాలంలో కన్నడ భాషలో ఒక కవిత వ్రాశారు. ఆ భావాలు, ఆ పదాలు, భారతీయ లక్ష్ములందరికీ, ఇప్పుడు మనం చెప్పుకున్నవారందరికీ పునాది అక్కడే రచింపబడిందనుకుంటాను. ఎంత గొప్ప పదాలు, ఎంత గొప్ప భావాలు, ఎంత ఉత్తమమైన ఆలోచనలు, కన్నడలో కవిత ఇలా ఉంది.

 

 

ಪೆಣ್ಣಿಂದ ಪೆರ್ಮೆಗೊಂಡನು ಹಿಮವಂತನು
ಪೆಣ್ಣಿಂದ ಭೃಗು ಪೆರ್ಚಿದನು
ಪೆಣ್ಣಿಂದ ಜನಕರಾಯನು ಜಸವಡೆದನು

పెణ్ణింద పెర్మె గొండను హిమవంతను

పెణ్ణింద భృగు పెర్చిదను

పెణ్ణింద జనకరాయను జసవడెదను

అనగా హిమవంతుడు అంటే పర్వత రాజు తన కూతురు పార్వతి వల్ల, భృగు మహర్షి తన కూతురు లక్ష్మి వల్ల, జనకమహారాజు తన కూతురు సీత వల్ల ప్రసిద్ధులైనారు అని. మన పుత్రికలు మన గౌరవం. ఈ పుత్రికల మాహాత్మ్యం వల్లనే మన సమాజానికి బలమైన గుర్తింపు, ఉజ్జ్వల భవిష్యత్తు.

నా ప్రియ దేశవాసులారా, 12 నవంబర్ 2019 నాడు ప్రపంచమంతటా శ్రీ గురునానక్ దేవ్ గారి 550 వ ప్రకాశోత్సవము జరుపుకుంటారు. గురునానక్ ప్రభావం భారత్ లోనే కాదు, ప్రపంచమంతటా ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో మన సిక్కు సోదరసోదరీమణులు నివసిస్తున్నారు. వారు గురునానక్ దేవ్ గారి ఆదర్శాలకు పూర్తిగా అంకితమైనవారు. నేను వైంకూవర్ (Vancouver), టెహరాన్ గురుద్వారాలకు నేను చేసిన యాత్రను ఎప్పుడూ మరువలేను. శ్రీ గురునానక్ దేవ్ గారి గురించి నేను మీకు ఎంతో చెప్పగలను, కానీ దానికి మన్ కీ బాత్ యొక్క అనేక ఎపిసోడ్ లు కావలసి వస్తాయి. వారు సేవను సర్వోచ్చ స్థానంలో నిలిపారు. గురునానక్ దేవ్ గారు నిస్వార్థ భావంతో చేసిన సేవ అమూల్యమైనదని నమ్మేవారు. వారు అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీ గురునానక్ దేవ్ గారు తమ సందేశాన్ని ప్రపంచంలోని దూరదేశాల వరకూ ప్రసరింపచేశారు. తమ కాలంలో అధికంగా యాత్రలు చేసేవారిలో వారొకరు. అనేక ప్రాంతాలకు వెళ్ళారు, వెళ్ళినచోటల్లా తమ నిరాడంబరత, వినమ్రత, సరళత లతో అందరి మనసులను గెలుచుకున్నారు.గురునానక్ దేవ్ అనేక ముఖ్యమైన ధార్మిక యాత్రలను చేశారు. వాటిని ‘ఉదాసీ’ అంటారు. సద్భావన, సమానత సందేశాలను తీసుకొని వారు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అన్ని దిక్కులకూ వెళ్ళారు, ప్రతి చోటా ప్రజలతో, సాధువులతో, ఋషులతో కలిశారు. అస్సాం యొక్క సుప్రసిద్ధ సాధువు శంకర్ దేవ్ కూడా వారితో స్ఫూర్తి పొందారని నమ్ముతారు. వారు పవిత్ర హరిద్వార్ యాత్ర చేశారు. కాశీలో గురుబాగ్ గురుద్వారా ఒక పవిత్ర స్థలం. శ్రీ గురునానక్ దేవ్ అక్కడ బస చేశారని చెప్తారు. వారు బౌద్ధ ధర్మానికి చెందిన ‘రాజ్ గిర్’, ‘గయ’ వంటి ధార్మిక స్థలాలకు కూడా వెళ్ళారు. దక్షిణాన గురునానక్ దేవ్ శ్రీలంక వరకూ యాత్ర చేశారు.

కర్ణాటకలోని బీదర్ యాత్రాసమయంలో గురునానక్ దేవ్ అక్కడి నీటి సమస్యను పరిష్కరించారు. బీదర్ లో ‘గురునానక్ దేవ్ జీరా సాహెబ్’ పేరుతో ఒక ప్రసిద్ధ స్థలముంది. అది వారి సంస్మరణార్థం వారికే సమర్పింపబడింది. ఒక ‘ఉదాసీ’ కాలంలో  గురునానక్ దేవ్ ఉత్తరాన కాశ్మీర్ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలను దర్శించారు. దీనివల్ల సిక్ఖు అనుచరులకు, కాశ్మీర్ కు బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. గురునానక్ దేవ్ గారు టిబెట్ కూడా వెళ్ళారు. అక్కడి ప్రజలు వారిని ‘గురువు’గా విశ్వసించారు. వారు ఉజ్బెకిస్తాన్ యాత్ర చేశారు ,అక్కడ కూడా పూజ్యులే. ఒక ‘ఉదాసీ’ లో వారు ఇస్లామిక్ దేశాలకు కూడా పెద్ద ఎత్తున యాత్రలు చేశారు. వాటిలో సౌదీ అరేబియా, ఇరాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉన్నాయి. వారు లక్షలాది ప్రజల మనసుల్లో కొలువై ఉన్నారు. ఆ ప్రజలంతా పూర్తి భక్తి శ్రద్ధలతో వారి ఉపదేశాలను అనుసరించారు, నేటికీ అనుసరిస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే దాదాపు 85 దేశాల రాయబారులు/ప్రతినిధులు దిల్లీ నుంచి అమృత్ సర్ వెళ్ళారు. అక్కడ అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించారు, గురునానక్ దేవ్ గారి 550 వ ప్రకాశోత్సవానికి హాజరైనారు. అక్కడ ఈ అందరు ప్రతినిధులు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేయడమే కాదు, సిక్ఖు సంప్రదాయాలు, సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశం పొందారు. ఆ తర్వాత అనేక మంది ప్రతినిధులు సామాజిక మాధ్యమాలలో అక్కడి ఫోటోలను పంచుకున్నారు. గొప్ప గౌరవపూర్వకమైన తమ అనుభవాలను గురించి కూడా రాశారు. గురునానక్ దేవ్ గారి 550 వ ప్రకాశోత్సవం వారి ఆలోచనలను, ఆదర్శాలను మన జీవనంలోకి తెచ్చుకోవడానికి ఎక్కువ స్ఫూర్తిని కలిగించాలని నా అభిలాష. మళ్ళీ ఒకసారి నేను శిరసు వంచి గురునానక్ దేవ్ గారికి ప్రణామాలు చేస్తున్నాను.

నా ప్రియ సోదరసోదరీమణులారా, అక్టోబర్ 31 మీకందరికీ తప్పక గుర్తు ఉంటుందని నా నమ్మకం. ఆరోజు ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి. వారు దేశాన్ని ఒకతాటిపైకి తీసుకొచ్చిన మహానాయకుడు. సర్దార్ పటేల్ ప్రజలను ఒక్కటి చేసే అద్భుత శక్తిని కలిగి ఉండడమే కాదు, భిన్నాభిప్రాయాలు కలిగిన వారితో కూడా సాంగత్యం కలిగి ఉండేవారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా లోతుగా పరిశీలించేవారు, పరీక్షించేవారు. వారు సరైన అర్థంలో వారిని ‘మ్యాన్ ఆఫ్ డీటైల్’ అనవచ్చు. వారు సంఘటితం చేసే నేర్పు కలిగిన నిపుణులు. ప్రణాళికలు తయారుచేయడంలో, రణనీతి తయారుచేయడంలో వారు నైపుణ్యం కలిగినవారు. సర్దార్ సాహెబ్ కార్యశైలి గురించి చదివితే, వింటే వారి ప్లానింగ్ ఎంత బలంగా ఉంటుందో తెలుస్తుంది. 1921 లో అహ్మదాబాద్ లో కాంగ్రెస్ సమావేశం లో పాల్గొనడానికి దేశమంతటి నుంచి వేల సంఖ్యలో ప్రతినిధులు రావలసి ఉంది. సమావేశపు ఏర్పాట్ల బాద్యతలన్నీ సర్దార్ పటేల్ పైన ఉండేవి. ఆ సందర్భాన్ని వారు పట్టణంలో నీటి సరఫరా యొక్క నెట్ వర్క్ ని మెరుగు పరచడానికి కూడా వినియోగించుకున్నారు. ఎవరికీ నీటి కొరత రాకుండా ఉండేలా ఏర్పాటు చేశారు. ఇంతే కాదు, సమావేశ స్థలంలో ఏ యొక్క ప్రతినిధి యొక్క వస్తువులు, చెప్పులు దొంగతనం కాకుండా ఉండేలా వారేం ఏర్పాటు చేశారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్య పోతారు. వారు రైతులతో సంప్రదించి, ఖాదీ సంచులను తయారు చేయించారు. రైతులు సంచులు తయారుచేసి, ప్రతినిధులకు అమ్మారు. ఈ సంచులలో చెప్పులు పెట్టుకొని తమతో పాటు ఉంచుకున్నప్పుడు ప్రతినిధులకు చెప్పులు పోతాయేమోనన్న ఆందోళణ పోయింది. అదే సమయంలో ఖాదీ విక్రయం కూడా మెరుగు పడింది. రాజ్యాంగ సభలో ఉల్లేఖనీయ పాత్ర వహించినందుకు సర్దార్ పటేల్ కు మన దేశం ఎప్పుడూ ఋణపడి ఉంటుంది.  కులం, సంప్రదాయం ఆధారంగా ఏర్పడే భేదభావాలకు అవకాశం ఉండని విధంగా వారు ప్రాథమిక హక్కులను నిర్ధారించే ముఖ్యమైన పని చేశారు.

సహచరులారా, భారత ప్రథమ హోం శాఖ మంత్రిగా సర్దార్ వల్లభభాయి పటేల్ సంస్థానాలను విలీనం చేసే ఒక గొప్ప భగీరథ, చారిత్రాత్మక కార్యం నిర్వహించారని మనకందరికీ తెలుసు. ప్రతి సంఘటన మీద దృష్టి ఉంచడం వారి ప్రత్యేకత. ఒకవైపు వారి దృష్టి హైదరాబాద్, జూనాగఢ్, ఇంకా ఇతర రాష్ట్రాలమీద ఉన్నా, ఇంకోవైపు సుదూర దక్షిణంలోని లక్షద్వీప్ మీద కూడా ఉండింది. నిజానికి సర్దార్ వల్లభభాయి పటేల్ చేసిన దేశం యొక్క ఏకీకరణ గురించి ఎప్పుడు మాట్లాడినా కొన్ని ముఖ్య ప్రాంతాల లో వారి పాత్ర గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. లక్షద్వీప్ వంటి చిన్న ప్రాంతం విషయంలో కూడా వారు ముఖ్య పాత్ర నిర్వహించారు. ఈ మాటను ప్రజలు గుర్తు చేసుకోవడం అరుదు.  లక్షద్వీప్ అనేది కొన్ని ద్వీపాల సమూహమని మీకు బాగా తెలుసు. అది భారత్ లో అన్నిటికన్నా అందమైన ప్రాంతాల్లో ఒకటి. 1947 లో భారత్ విభజన తర్వాత మన పొరుగు దేశపు దృష్టి లక్షద్వీప్ మీద ఉంది. తన జెండా తో సహా ఒక ఓడను కూడా పంపింది. సర్దార్ పటేల్ కు ఈ వార్త తెలిసిన వెంటనే ఏమాత్రం సమయం వృథా చేయకుండా వారు కఠిన చర్యలు చేపట్టారు. మొదలియార్ సోదరులు, ఆర్కాట్ రామస్వామి మొదలియార్ మరియు ఆర్కాట్ లక్ష్మణస్వామి మొదలియార్ తో చెప్పారు – ట్రావెన్ కోర్ ప్రజలతో కలిసి ఉద్యమం చేసి జెండా ఎగరేయమని చెప్పారు. లక్షద్వీప్ లో మొదట త్రివర్ణ పతాకం ఎగరాలి. వారి ఆదేశంతో వెంటనే అక్కడ త్రివర్ణ పతాకం ఎగరవేశారు, లక్షద్వీప్ ను ఆక్రమించే పొరుగువారి కుట్రలనన్నిటినీ భగ్నం చేశారు.  ఆ తర్వాత మొదలియార్ సోదరులను లక్షద్వీప్ అభివృద్ధి కొరకు సకలప్రయత్నాలను చేయమని వారు కోరారు. నేడు లక్షద్వీప్ భారతదేశ ప్రగతికి తన ముఖ్య పాత్రను నిర్వహిస్తోంది. ఇది ఒక ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతం కూడా. ఈ అందమైన ద్వీపాలను, సముద్రతీరాలను మీరంతా సందర్శిస్తారని నేను విశ్వసిస్తాను.

నా ప్రియ దేశవాసులారా, 31 అక్టోబర్ 2018 న సర్దార్ పటేల్ స్మృత్యర్థం తయారైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఏకతామూర్తి దేశానికీ ప్రపంచానికీ అంకితం చేయబడింది. ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా ఎత్తైన విగ్రహం. అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కన్నా ఇది రెండింతలు ఎత్తైనది. ప్రపంచంలో అన్నిటికన్న ఎత్తైన విగ్రహం ప్రతి హిందూస్తానీకి గర్వకారణం. ప్రతి హిందూస్తానీ గర్వంతో తలెత్తుకొనే విషయం. ఒక సంవత్సరంలోగా 26 లక్షలకు పైగా పర్యాటకులు ఈ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ దర్శనార్థం వచ్చారని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఈ లెక్కన ప్రతిరోజూ సగటున ఎనిమిదిన్నర వేల మంది ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ యొక్క వైభవాన్ని దర్శించారు. సర్దార్ వల్లభభాయి పటేల్ పట్ల వారి మనసులోని నమ్మకాన్ని, భక్తిని ప్రకటించారు,  అంతేకాక అక్కడ ఇప్పుడు కాక్టస్ గార్డెన్, బటర్ ఫ్లై గార్డెన్, జంగిల్ సఫారీ, చిల్డ్రన్  న్యూట్రిషన్ పార్క్ , ఏకతా నర్సరీ వంటి అనేక ఆకర్షణీయ కేంద్రాలు క్రమంగా వృద్ధి చెందుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేయూతగా ఉన్నాయి. ప్రజలకు రోజురోజుకూ కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పర్యాటకుల సౌకర్యార్థం అక్కడి అనేక గ్రామాల ప్రజలు తమ తమ ఇళ్ళల్లో హోమ్ స్టే సౌకర్యమూ కల్పిస్తున్నారు. హోమ్ స్టే సౌకర్యాలు కల్పించే ప్రజలకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా ఇప్పించబడుతున్నది. అక్కడి ప్రజలు ఇప్పుడు డ్రాగన్ పండ్ల సేద్యం కూడా ప్రారంభించారు. త్వరలోనే అక్కడి ప్రజలకు ఇది ముఖ్య ఉపాధి అవుతుందని నేను నమ్ముతున్నాను.

సహచరులారా, దేశం కోసం, అన్ని రాష్ట్రాల కోసం, పర్యాటక పరిశ్రమ కోసం, ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఒక అధ్యయనాంశం అవుతుంది. ఒక సంవత్సర కాలంలోపలే ఒక ప్రాంతం విశ్వప్రసిద్ధ పర్యాటక క్షేత్రం గా ఎలా వృద్ధి చెందుతుందో దీనికి మనమే సాక్షి. అక్కడికి దేశవిదేశాల నుంచి ప్రజలు వస్తారు. రవాణా, వసతి, గైడ్స్, ఎకోఫ్రెండ్లీ వ్యవస్థలు ఒకదాని తర్వాత ఒకటి అనేక వ్యవస్థలు వాటంతటవే వృద్ధి చెందుతున్నాయి. గొప్ప ఆర్థిక వృద్ధి జరుగుతున్నది. పర్యాటకుల అవసరాలకనుగుణంగా ప్రజలు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం తన పాత్ర నిర్వహిస్తోంది. సహచరులారా! ఈమధ్య టైమ్ మాగజైన్ ప్రపంచంలోని 100 ముఖ్యమైన టూరిస్ట్ డెస్టినేషన్ లలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ కి ముఖ్యస్థానం ఇచ్చారన్న విషయం పట్ల ఏ హిందూస్తానీ గర్వ పడకుండా ఉండగలడు! మీరంతా మీ అమూల్యమైన సమయంలో కొంత సమయం వెచ్చించి ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని చూడడానికి వెళ్తారని నేను ఆశిస్తున్నాను.  పర్యటన, యాత్ర చేయాలనుకున్న ప్రతి హిందూస్తానీ భారత్ లోని కనీసం 15 టూరిస్ట్ డెస్టినేషన్స్ కు కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ ఒక రాత్రి ఉండాలని నా విన్నపం ఎప్పటికీ ఉంటుంది.

సహచరులారా, 2014 నుంచి ప్రతి సంవత్సరమూ అక్టోబర్ 31 న ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ గా జరుపుకుంటున్నామని మీకు తెలుసు. ఈ రోజు మనము మన దేశం యొక్క ఐక్యత, అఖండత భద్రత ఎట్టి పరిస్థితులలోనూ రక్షించాలనే సందేశాన్నిస్తుంది.  31 అక్టోబర్ ప్రతీసారిలాగే రన్ ఫర్ యూనిటీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో సమాజంలోని ప్రతి వర్గంలోని ప్రజలు పాల్గొంటారు. రన్ ఫర్ యూనిటీ ఈ దేశం ఒక్కటి అనే మాటకు ప్రతీక. ఒకే దిశ వైపు పయనిస్తుంది. ఒకే లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తుంది. ఒకే లక్ష్యం – ఒకే భారత్ శ్రేష్ఠ భారత్.

గత ఐదేళ్ళనుంచి చూస్తున్నాము – దిల్లీ నే కాకుండా హిందూస్తాన్ యొక్క వందల పట్టణాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో, రాజధానులలో, జిల్లాకేంద్రాలలో, చిన్న టైర్ 2 టైర్ 3 పట్టణాల్లో కూడా చాలా ఎక్కువ సంఖ్యలో స్త్రీ పురుషులు నగరవాసులు, గ్రామవాసులు, పిల్లలు, యువతీయువకులు, వృద్ధులు, దివ్యాంగులు, అందరూ పెద్ద సంఖ్యలో కలుస్తున్నారు. ఏదైమైనా నేటి కాలంలో ప్రజలలో మారథాన్ మీద ఒక ఆసక్తి , పట్టుదల చూస్తూనే ఉన్నాము. రన్ ఫర్ యూనిటీ కూడా ఒక ఇలాంటి విశిష్టమైన అవకాశం. పరుగు మనసు, మెదడు శరీరాలకు లాభదాయకమైనది. దీంట్లో పరుగూ ఉంది, ఫిట్ ఇండియా భావాన్ని చరితార్థం చేస్తుంది, దాంతో పాటే ఒకే భారత్ – శ్రేష్ఠ భారత్ ఈ ఉద్దేశాన్ని కూడా మనం అలవరచుకుంటాము. అందుకే కేవలం శరీరం మాత్రం కాదు, మనసు, సంస్కారం కూడా భారత్ యొక్క ఐక్యత కోసం, భారత్ ను నూతన శిఖరాలకు చేర్చడం కోసం. అందుకే మీరు ఏ పట్టణంలో ఉన్నారో అక్కడ మీ చుట్టుపక్కల రన్ ఫర్ యూనిటీ గురించి తెలుసుకోగలరు. దీనికోసం ఒక పోర్టల్ లాంచ్ చేయబడింది. runforunity.gov.in ఈ పోర్టల్ లో దేశమంతటా ఎక్కడ రన్ ఫర్ యూనిటీ ఏర్పాటు అవుతుందో ఆ వివరాలు ఉన్నాయి. మీరంతా 31 అక్టోబర్ నాడు భారత్ ఐక్యత కోసం, మీ మీ ఫిట్ నెస్ కోసం కూడా తప్పకుండా పరుగులో పాల్గొంటారని నేను నమ్ముతున్నాను.

నా ప్రియ దేశవాసులారా, సర్దార్ పటేల్ దేశాన్ని ఐక్యతా సూత్రంలో కూర్చారు. ఐక్యతా మంత్రం మన జీవన సంస్కారం వంటిది. భారత్ వంటి వైవిధ్యాలతో కూడిన దేశంలో మనం ప్రతి స్థాయిలో, ప్రతి మార్గంలో, ప్రతి మలుపులో, ప్రతి మజిలీలో ఐక్యతా మంత్రానికి బలం చేకూరుస్తూ ఉండాలి. నా ప్రియ దేశవాసులారా, దేశం యొక్క ఐక్యత పరస్పర సద్భావన ను పరిపుష్టి చేసేందుకు మన సమాజం ఎల్లప్పుడూ ఎంతో చొరవతో, జాగరూకతతో ఉంది. మనం మన చుట్టుపక్కల చూస్తే చాలు, ఇలాంటి ఉదాహరణలు ఎన్నో దొరుకుతాయి. ఆ ఉదాహరణల్లో పరస్పర సద్భావం పెంచేందుకు నిరంతరం పని చేసే వారు కనిపిస్తారు. కానీ చాలాసార్లు సమాజం యొక్క ప్రయత్నాలు, దాని పాత్ర స్మృతిపథం నుంచి కనుమరుగవుతూ ఉంటాయి

 సహచరులారా, 2010 సెప్టెంబర్లో రామజన్మభూమి మీద అలహాబాద్ హైకోర్ట్ లో తీర్పు రావడం నాకు గుర్తు ఉంది. ఆ రోజులను కొంచెం గుర్తు చేసుకోండి. ఎలాంటి వాతావరణం ఉంది! రకరకాల మనుష్యులు మైదానంలోకి వచ్చేశారు. ఎలాంటి స్వార్ధపరులు ఆ పరిస్థితులను తమ తమ పద్ధతులలో తమ లాభానికనుగుణంగా మలచుకోడానికి ప్రయత్నించారు! వాతావరణంలో ఉద్రిక్తత పెంచడానికి ఎన్నెన్ని రకాల మాటలు మాట్లాడేవారు! భిన్న భిన్న స్వరాలలో మంటలు పెంచడానికి ప్రయత్నాలు చేశారు. కొందరు నినాదాలవాళ్ళు, గొప్పలకు పోయేవాళ్ళు కేవలం తాము ప్రసిద్ధులు కావడానికి ఏమేం మాట్లాడారో వాళ్ళకే తెలీదు. ఎలాంటి బాధ్యతారహితమైన మాటలు మాట్లాడారో మనకంతా గుర్తుంది. కానీ ఇదంతా ఐదురోజులు, ఏడు రోజులు, పది రోజులు జరుగుతూ ఉంది, కానీ తీర్పు రాగానే, ఒక ఆనందదాయకమైన, ఆశ్చర్యకరమైన మార్పు దేశం చూసింది. ఒక వైపు రెండు వారాల వరకూ ఉద్రిక్తత పెంచడం కోసం ఇదంతా జరిగింది, కానీ రామజన్మభూమి మీద తీర్పు రాగానే ప్రభుత్వము, రాజకీయపక్షాలు, సాంఘిక సంస్థలు, పౌర సమాజం అన్ని సంప్రదాయాల ప్రతినిధులు, సాధు, సంత్ లు అందరూ సమతుల్యమైన సంయమనంతో ప్రకటనలు చేశారు. వాతావరణంలో ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం. కానీ నాకు ఆ రోజులు ఇప్పటికీ బాగా గుర్తు. ఎప్పుడు ఆరోజును గుర్తు చేసుకున్నా మనసుకు ఆనందం కలుగుతుంది. న్యాయస్థానం యొక్క గరిమ గౌరవపూర్వకంగా సమ్మానించబడింది. ఎక్కడకూడా ఉద్రిక్తతను, వేడిని పెంచే అవకాశం రానివ్వలేదు. ఈ మాటలు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. ఇవి మనకు బలాన్నిస్తాయి. ఆరోజులు ఆ క్షణాలు, మనకు కర్తవ్యబోధ చేస్తాయి. ఐక్యతా స్వరం దేశానికి ఎంత శక్తి ఇస్తుంది అనేదానికి ఇది ఉదాహరణ.

నా ప్రియ దేశవాసులారా, 31 అక్టోబర్ మన దేశం యొక్క మాజీ ప్రధాని శ్రీమతి ఇందిర గారి హత్య జరిగినరోజు. దేశానికి ఒక పెద్ద దెబ్బ తగిలిన రోజు. నేను వారికి కూడా నేడు నా శ్రద్ధాంజలి సమర్పించుకుంటున్నాను.

నా ప్రియ దేశవాసులారా, నేడు ఇంటింటి కథ ఒకటి దూర తీరాలకు వినిపిస్తుందంటే, ప్రతి గ్రామం యొక్క కథ వినిపిస్తుందంటే, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ, తూర్పు నుంచి పడమర వరకూ హిందూస్థాన్ లోని మూలమూలలా ఒక కథ వినిపిస్తుందంటే అది స్వచ్ఛత కథ. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం స్వచ్ఛతకు సంబంధించి తన సంతోషకరమైన అనుభవాలను చెప్పాలనుకుంటారు. ఎందుకంటే స్వచ్చతా ప్రయత్నాలు నూట ముప్ఫై కోట్ల హిందూస్తానీలవి. వీటి ఫలితాలు కూడా నూటముప్ఫై కోట్ల హిందూస్థానీలవి. ఒక సంతోషకరమైన రోమాంచితం చేసే అనుభవమొకటి ఉంది. నేను విన్నాను. మీకూ వినిపించాలనుకుంటున్నాను. మీరు ఊహించండి – విశ్వంలో అన్నిటికన్నా ఎత్తైన యుద్ధ క్షేత్రం, వాతావరణం మైనస్ 50-60 డిగ్రీల లోకి వెళ్ళేచోట, గాలిలో ఆక్సిజన్ కూడా నామమాత్రంగా ఉండేచోట, ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో ఇన్ని సవాళ్ళమధ్య ఉండడం పరాక్రమం కన్నా తక్కువేమీ కాదు, అటువంటి కఠిన పరిస్థితులలో మన వీర సైనికులు రొమ్ము విరుచుకొని దేశ సరిహద్దులను రక్షించడమే కాక అక్కడ స్వచ్ఛ సియాచిన్ ఉద్యమం కూడా చేస్తున్నారు. భారతీయ సైన్యం యొక్క ఈ అద్భుత నిబద్ధత కై నేను దేశవాసుల తరఫున వారికి ప్రశంసలు అందజేస్తున్నాను. కృతజ్ఞత ప్రకటిస్తున్నాను. అక్కడ ఎంత చలి ఉంటుందంటే డీకంపోజ్ కావడమే కష్టం. అందులో చెత్తాచెదారాన్ని వేరుచేయడమే కాదు, ఆ ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప పని. అందులో, గ్లేసియర్ చుట్టుపక్కల 130టన్నులకు పైన చెత్తను తొలగించడం, అదీ అక్కడి సున్నితమైన జీవావరణ వ్యవస్థ! ఎంత పెద్ద సేవ అది!  అది కూడా అరుదైన జాతి మంచు చిరుతపులులు నివసించే ఎకోసిస్టమ్ ఉన్న ప్రదేశం! అక్కడ సియాచిన్ జాతి గొర్రెలు, గోధుమ రంగు ఎలుగుబంట్లు వంటి అరుదైన జంతువులు ఉండే ప్రదేశం. ఈ సియాచిన్ నదుల స్వచ్చమైన నీటి మూలాలు, గ్లేసియర్ లు అని మనకందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ స్వచ్ఛతా ఉద్యమం చేసే పని అంటే ప్రజలకు ఇక్కడి నుంచి క్రింది ప్రాంతాలకు పారే నీటిని స్వచ్ఛంగా అందించటం ద్వారా చేయడం. దాంతో పాటు నుబ్రా, ష్యోక్ వంటి నదీజలాలను ఉపయోగిస్తారు.

నా ప్రియ దేశవాసులారా, పండుగ మనందరి జీవితాలలో ఒక కొత్త చైతన్యాన్ని మేల్కొలిపే పర్వంగా ఉంటుంది.  ఇంకా దీపావళి అంటే ముఖ్యంగా ఏదో కొత్తవస్తువు కొనడం, ప్రతీ కుటుంబంలో ఎక్కువ తక్కువ జరుగుతూనే ఉంటుంది. మనము స్థానికంగా లభించే వస్తువులనే కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలని నేను ఒకసారి చెప్పాను. మనకు అవసరమైన వస్తువులు మన గ్రామంలో దొరుకుతుంటే వాటికోసం మనము తాలూకాకు వెళ్ళవలసిన పని లేదు. తాలూకా పట్టణంలో దొరుకుతున్నవాటి కోసం జిల్లా కేంద్రం వరకూ వెళ్ళక్కరలేదు. ఎంత ఎక్కువగా మనం స్థానిక వస్తువులను కొంటామో, ‘గాంధీ 150’ అంతగా గొప్పగా జరిగినట్టు అనుకోవచ్చు. నా విన్నపం ఏమిటంటే మన తయారీదార్లు చేత్తో చేసినవి, మన ఖాదీ వారు నేసినవి కొంతైనా మనం కొనాలి. ఈ దీపావళికి కూడా ముందే మీరు చాలా కొనేసి ఉంటారు గానీ, కొందరు దీపావళి తర్వాతైతే కొద్దిగా తక్కువ ధరలకు దొరుకుతుంది అని ఆలోచించే వారు ఉంటారు. కాబట్టి ఇంకా దీపావళి తర్వాత కొనుగోళ్ళు చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. కాబట్టి దీపావళి శుభాకాంక్షలతో పాటు నేను విన్నపం చేస్తున్నాను. రండి మనం లోకల్ వి కొనాలన్న నియమం పెట్టుకుందాం. స్థానిక వస్తువులను కొందాం. చూడండి, మహాత్మా గాంధీ కలలను నిజం చేయడంలో మనము ముఖ్య పాత్ర పోషించినట్లవుతుంది. నేను మరొక్కసారి ఈ దీపావళి పండుగ సందర్భంగా మీకు అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దీపావళి కి మనము రకరకాల టపాకాయలు వాడుతాము. కానీ అప్పుడప్పుడూ అజాగ్రత్తవలన నిప్పు అంటుకుంటుంది. ఎక్కడైనా గాయాలవుతుంటాయి. మీకందరికీ నా విన్నపం ఏమిటంటే మీరు జాగ్రత్తగానూ ఉండండి, పండుగను ఉత్సాహంగానూ జరుపుకోండి. నా అనేకానేక శుభాకాంక్షలు.

అనేకానేక ధన్యవాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.