ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వికసిత భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి తెలంగాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మిజోరంలలో
వికసిత్ భారత్ సంకల్పయాత్రను ప్రారంభించారు. అస్సాంలోని గౌహతికి చెందిన గృహిణి శ్రీమతి కల్యాణి రాజ్బోంగ్సి ఒక స్వయం సహాయక బృందాన్ని నడుపుతున్నారు. ఆమె ఆ ప్రాంత స్థాయి ఫెడరేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు.
అస్సాం గౌరవ్ పురస్కార్ లభించిన ఆమె విజయగాధను ప్రధానమంత్రి , విని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, కల్యాణీజీ పేరులోనే ప్రజా సంక్షేమం (కల్యాణ్) ఉందని అన్నారు.
ఆమె ఆర్ధికంగా ఎదిగిన తీరు గురించి కూడా వివరించారు. మొదట తాను రెండు వేల రూపాయల పెట్టుబడితో పుట్టగొడుగుల యూనిట్ నెలకొల్పానని, ఆ తర్వాత
అస్సాం ప్రభుత్వం ఇచ్చిన 15,000 రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీని తర్వాత,200 మంది మహిళలతో ఆ ప్రాంత స్థాయి ఫెడరేషన్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఆమె కు పిఎంఎఫ్ఎంఇ (ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్) కింద కూడా ఆర్థిక సహాయం లభించింది. ఆమె వెయ్యిమంది వెండర్లకు పి.ఎం.స్వనిధి గురించి వివరించి వారిని ప్రోత్సహించినందుకు ఆమెకు అస్సాం గౌరవ్ పురస్కార్ లభించింది.
విబిఎస్ వై వాహనం, మోడీకి గారంటీ కీ గాడి కి తమ ప్రాంతంలో స్వాగతం చెప్పేందుకు ఆమె నాయకత్వం వహించారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సక్రమంగా సద్వినియోగం చేసుకునేలా చేసేందుకు ఆమె ప్రజలను ప్రోత్సహించారు.
సామాజిక సేవ, వ్యాపార దక్షతలను కొనసాగించాల్సిందిగా ప్రధానమంత్రి ఆమెకు సూచించారు. ‘‘మహిళలకు స్వావలంబన లభిస్తే , సమాజం ఎంత గొప్పగా ప్రయోజనం పొందుతుందో తెలుసుకునేందుకు
మీరు సాక్ష్యం’’ అని ప్రధానమంత్రి ఆమె సేవలను కొనియాడారు.