అఫ్ గానిస్తాన్ లో లాలందర్ (శహ్ తూత్) ఆనకట్ట నిర్మాణాని కి ఉద్దేశించిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాల కార్యక్రమాన్ని మంగళవారం నాడు విటిసి మాధ్యమం ద్వారా నిర్వహించడమైంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అఫ్ గానిస్తాన్ అధ్యక్షుడు మాన్యశ్రీ డాక్టర్ మొహమ్మద్ అశ్‌రఫ్ ఘనీ ల సమక్షం లో ఈ ఎమ్ఒయు పై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హనీఫ్ అత్‌మర్ లు సంతకాలు చేశారు.
2. భారతదేశానికి, అఫ్ గానిస్తాన్ కు మధ్య ఏర్పడ్డ నూతన అభివృద్ధి భాగస్వామ్యం లో ఒక భాగం గా ఈ ప్రాజెక్టు ఉంది. కాబుల్ సిటీ సురక్షిత తాగునీటి అవసరాల ను తీర్చడానికి, చుట్టుపక్కల ప్రాంతాల కు సేద్యపు నీటి ని అందించడానికి, ఇప్పటికే అమలవుతున్న సాగునీటి, మురికినీటి నెట్ వర్క్ లను నిలబెట్టడానికి, వరద సహాయ ప్రయాసలకు, ఆ ప్రాంతం లో నిర్వహణ ప్రయాసలకు తోడ్పాటును అందించడానికి, అంతే కాకుండా ఆ ప్రాంతం లో విద్యుత్తు సరఫరా కు కూడా శహ్‌తూత్ ఆనకట్ట దోహదపడనుంది.
3. భారతదేశం, అఫ్ గానిస్తాన్ మైత్రి వారధి (సల్ మా ఆనకట్ట) తరువాత అఫ్ గానిస్తాన్ లో భారతదేశం నిర్మిస్తున్న రెండో ప్రధానమైన ఆనకట్ట ఈ ప్రాజెక్టే. సల్ మా డామ్ ను ప్రధాన మంత్రి, అధ్యక్షుడు.. ఇరువురు 2016వ సంవత్సరం జూన్ లో ప్రారంభించారు. శహ్ తూత్ ఆనకట్ట తాలూకు ఎమ్ఒయు పై సంతకాలు జరగడం అఫ్ గానిస్తాన్ సామాజిక, ఆర్థిక అభివృద్ధి కి భారతదేశం వైపు నుంచి బలమైన దీర్ఘకాలిక నిబద్ధత కు, రెండు దేశాల మధ్య చిరకాల భాగస్వామ్యానికి అద్ధం పడుతున్నది. అఫ్ గానిస్తాన్ తో మా అభివృద్ధియుత సహకారం లో ఓ భాగం గా, అఫ్ గానిస్తాన్ లోని 34 ప్రాంతాల లో 400 లకు పైగా ప్రాజెక్టుల ను భారతదేశం పూర్తి చేసింది.
4. ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, భారతదేశాని కి అఫ్ గానిస్తాన్ కు మధ్య నెలకొన్న నాగరకత పరమైన సంబంధాన్ని గురించి ప్రముఖం గా ప్రస్తావించారు. ఒక శాంతియుతమైనటువంటి, ఐక్యమైనటువంటి, స్థిరమైనటువంటి, సమృద్ధమైన, అన్ని వర్గాలను కలుపుకుపోయేటటువంటి అఫ్ గానిస్తాన్ కు భారతదేశం తన సమర్ధన ను కొనసాగించగలదంటూ హామీ ని ఇచ్చారు.