ఇండో- పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ప్రాంత సహకారంలో ఇరు దేశాలకు గల ఉమ్మడి దార్శనికత ను గురించి భారతదేశం, ఇండోనేషియా లు చర్చించుకున్నాయి. ఈ నెల 29 వ తేదీ నుండి ఈ నెల 30 వ తేదీ వరకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేషియా లో పర్యటించిన సందర్భంగా ఆయన ఇండోనేషియా అధ్యక్షులు, మాన్యులు శ్రీ జోకో విడోడో తో కలిసి ఈ మేరకు చర్చలు జరిపారు.
గతంలో అంటే 2016 డిసెంబర్ 12వ తేదీన ఇండోనేషియా అధ్యక్షులు శ్రీ జోకో వి భారత పర్యటన సందర్భంగా సముద్ర ప్రాంత సహకారానికి సంబంధించి చేసిన ఇరు దేశాల ఉమ్మడి ప్రకటనను తాజాగా గుర్తు చేసుకున్నారు.
సముద్ర పరంగా భారతదేశం, ఇండోనేషియా లు రెండు ఇరుగు పొరుగు దేశాలని, సముద్ర సంబంధమైన ప్రగతితో ముడిపడి వున్నాయని ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు గుర్తు చేసుకున్నారు. సముద్రాల ద్వారా ఇరు దేశాలకు చెందిన నాగరిక సంబంధ బాంధవ్యాలు చాలా లోతుగా అభివృద్ధి చెందాయని, ఈ ప్రాంతంలోను, స్థూలంగా ప్రపంచవ్యాప్తంగాను ఎప్పటికప్పుడు మార్పుకు లోనవుతున్న సముద్రపరమైన పరిస్థితులకు సంబంధించి ఇరు దేశాలు ఒకే రకం ఆలోచనలను పంచుకొంటున్నాయని ఇరు దేశాల నేతలు గుర్తించారు.
ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఇరు దేశాలు వాటి సముద్ర ప్రాంత సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, తద్వారా శాంతిని, సుస్థిరతను తీసుకు రావడానికి, అంతే కాకుండా బలమైన ఆర్థిక వృద్ధిని తీసుకు రావడానికి తమ సంకల్పాన్ని ప్రకటించాయి;
భారతదేశానికి 7,500 కిలోమీటర్ల కోస్తా తీర రేఖ ఉంది. అంతే కాదు 1,380 కి పైగా దీవులు ఉన్నాయి. రెండు మిలియన్ చదరపు కిలో మీటర్ల కు పైగా ప్రత్యేక ఆర్ధిక మండలం ఉంది. వీటన్నిటి కారణంగా ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం కేంద్ర స్థానాన్ని పొందింది. అలాగే ఇండోనేషియా ప్రపంచం లోనే భారీ ద్వీప సమూహ దేశం కూడాను. దానికి 108,000 కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతం ఉంది. అంతే కాదు 17,504 ద్వీపాలు ఉన్నాయి. 6,400,000 చదరపు కి.మీ. సముద్ర ప్రాంతాలు, ప్రత్యేక ఆర్ధిక మండలం ఉన్నాయి. ఈ దేశం హిందూ మహా సముద్రాన్ని, పసిఫిక్ మహా సముద్రాన్ని కలపడంలో ఎంతో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తోంది. ఈ రెండు మహా సముద్రాల ప్రాంతం అంతర్జాతీయ సముద్ర వ్యాపార వాణిజ్యాలకు చాలా ముఖ్యమైంది;
ఇరు దేశాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి వుండాలని నిర్ణయించాయి. అంటే ఐక్య రాజ్య సమితి నియమావళి, సముద్ర చట్టాలకు సంబంధించి 1982 లో చేసుకున్న ఐక్య రాజ్య సమితి ఒప్పందానికి (యుఎన్ సిఎల్ఒఎస్) మరియు 1976 లో చేసుకున్న ఆగ్నేయ ఆసియా స్నేహ, సహకార ఒప్పందానికి (టిఎసి) కట్టుబడి వుండాలని ఇరు దేశాలు నిర్ణయించాయి;
స్వేచ్ఛాయుతమైన, అందరికీ కలుపుకుపోయే, పారదర్శకమైన, నియమ నిబంధనల ఆధారిత, శాంతియుతం, సౌభాగ్యవంతం, సమగ్రమూ అయినటువంటి ఇండో- పసిఫిక్ సాధన ప్రాధాన్యాన్ని ఇరు దేశాల నేతలు మరోసారి చాటారు. ఈ ప్రాంతంలో సౌర్వభౌమత్వాన్ని, సరిహద్దుల సమగ్రతను, అంతర్జాతీయ చట్టాలను ముఖ్యంగా యుఎన్ సిఎల్ ఒఎస్ లాంటి వాటిని గౌరవించుకోవాలి. జల రవాణా మార్గాలలో స్వేచ్ఛ, సముద్ర ఉపరితల విమానయానంలో స్వేచ్ఛ, సుస్థిరమైన అభివృద్ధి, పారదర్శకమైన, స్వేచ్ఛాయుతమైన, పరస్పరం లబ్ధి ని చేకూర్చే వాణిజ్యం, పెట్టుబడుల వ్యవస్థ మొదలైన వాటిని ఇరు దేశాలు గౌరవించుకోవాలి;
యున్ సిఎల్ఒఎస్ తో పాటు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం ఇండో- పసిఫిక్ ప్రాంతం లో శాంతి, స్థిరత్వం, సుస్థిరమైన ఆర్ధిక వృద్ధికోసం సముద్ర రక్షణ, భద్రతల ఆవశ్యకతను, సముద్ర ప్రాంతంలో అభివృద్ధి ని ఇరు దేశాలు గుర్తించాయి.
ఇరు దేశాల మధ్యన సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయి కి ద్వైపాక్షిక సంబంధాలు అభివృద్ధి చెందడాన్ని ఇరు దేశాల నేతల స్వాగతించారు. భద్రతసంబంధ ద్వైపాక్షిక సంప్రదింపులు, త్రైపాక్షిక సంప్రదింపుల కోసం నూతన వ్యవస్థ ల ఏర్పాటు ను స్వాగతించారు. అంతే కాదు శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష ఉపయోగాలు, పరిశోధనలలో సహకరించుకొనే నిమిత్తం విస్తరించిన రక్షణ సహకార ఒప్పందం పైన సంతకాలు జరగడాన్ని స్వాగతించారు;
ఇండియన్ ఓషియన్ రిమ్ అసోషియేషన్ (ఐఒఆర్ఎ) అధ్యక్ష స్థానంలో ఇండోనేషియా, భారతదేశం లు పోషించిన నాయకత్వ పాత్రను ఇరు దేశాలు ప్రశంసించాయి. ఈ అధ్యక్ష స్థానంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో మరింత సహకారంతో ఇరు దేశాలు శాంతి కోసం, సుస్థిరత కోసం, సౌభాగ్యం కోసం పని చేశాయి. ఐఒఆర్ఎ 20వ వార్షికోత్సవ సందర్భంగా 2017 మార్చి నెల లో ఐఒఆర్ఎ నేతల శిఖరాగ్ర సమావేశం జరిగింది. దీని ఫలితంగా జకార్తా కాంకర్డ్ అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందింది. దీని ప్రకారం పైన తెలియజేసినటువంటి విస్తారమైన సహకారం ఇరు దేశాల మధ్యన ఏర్పడింది;
యుఎన్ సిఎల్ఒఎస్ నియంత్రణ ప్రకారం సముద్ర ప్రాంతాలలో స్వేచ్ఛ, పారదర్శకత అనేవి చాలా ముఖ్యం. వాటి ద్వారా అంతర్జాతీయ సమాజంలోను, ఈ ప్రాంతంలోను శాంతిని, స్థిరత్వాన్ని, సౌభాగ్యాన్ని సాధించేందుకు వీలు ఉంటుంది;
ఇండో- పసిఫిక్ ప్రాంతం ఎదుర్కొంటున్న సముద్రపరమైన భద్రత సమస్యలను పరిష్కరించుకోవడం ముఖ్యమని ఇరు దేశాలు గుర్తించాయి. అక్రమంగా ప్రజలను, ఆయుధాలను, మత్తుమందులను, డబ్బును తరలించడం ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలలో కొన్ని. అలాగే అక్రమంగా, ఇష్టానుసారం, అనుమతి లేకుండా చేపల వేట, ఉగ్రవాదుల కదలికలు ఈ ప్రాంతంలో ఇతర సమస్యలుగా ఉన్నాయి.
సంధానాన్ని పెంచడం ద్వారా సౌభాగ్యవంతమైన ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఇరు దేశాల ఉమ్మడి ప్రాధాన్యాలకు ప్రాథమ్యం ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా ప్రాంతీయంగా సౌభాగ్యవంతమైన పరిస్థితులను ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అంతర్జాతీయ నియమాల మీద, సుపరిపాలన మీద, చట్టబద్ధమైన పరిపాలన, పారదర్శకత, ముక్కుసూటిదనం, సమానత్వం, సౌర్వాభౌమత్వాన్ని, ప్రాంతీయ ఐక్యత ను గౌరవించడం మొదలైన వాటి మీద ఆధారడి వీటిని ప్రోత్సహించాలి. ఇందుకుగాను ఆసియాన్- ఇండియా సముద్ర రవాణా ఒప్పందాన్ని వేగవంతంగా అమలు చేయాలని ఇరు దేశాలు అభిలషించాయి;
భారతదేశం యాక్ట్ ఈస్ట్ పాలిసీ ని, ఈ ప్రాంతంలో అందరికీ భద్రత, అభివృద్ధి విధానాన్ని (ఎస్ఎజిఎఆర్) ను అనుసరిస్తోంది. అలాగే ఇండోనేషియా సముద్ర విధానం, గ్లోబల్ మారిటైం ఫల్ క్రమ్ విజన్ ను కలిగి వుంది. వీటి మధ్యన ఏకీభావం, పరస్పర అంతర్గత బంధాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి;
అదే సమయంలో ఆసియాన్ దేశాల కేంద్రీయత, ఐకమత్యానికి ప్రాధాన్యం ఉండాలని స్పష్టం చేశాయి. ఈ ప్రాంతంలో సుస్థిరమైన, అందరినీ కలుపుకుపోయే ఆర్ధిక వృద్ధి, అభివృద్ధి కోసం సముద్ర ఆధారిత ఆర్ధిక వ్యవస్థ ప్రాధాన్యతను ఇరు దేశాలు గుర్తించాయి;
పై వాటిని సాధించడం కోసం ఇండో- పసిఫిక్ ప్రాంతలో సముద్రప్రాంత సహకారానికి సంబంధించిన ఉమ్మడి దార్శనికత వుండాలని ఇరు దేశాల నేతలు అంగీకరించారు. తద్వారా ఇరుదేశాలు తమ ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాయి. అంతే కాదు కలిసికట్టుగా సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వాములుగా సవాళ్లను ఎదుర్కొంటాయి. ఇందుకోసం కింద తెలిపిన అంశాలకు ఇరు దేశాలు సమ్మతి తెలియజేయశాయి :
ఎ. ఇరు దేశాల మధ్యన వాణిజ్యాన్ని, పెట్టుబడుల సహకారాన్ని పెంచాలి.
ఉభయ దేశాల ఆర్ధిక వ్యవస్థలను సుస్థిరంగా అభివృద్ధి చేయడానికిగాను రెండు దేశాల మధ్యన, ఈ ప్రాంతంలో వస్తు రవాణాను, సేవలను, పెట్టుబడులను, సాంకేతికతను భారీ స్థాయిలో పెంచాలి.
భారతదేశానికి చెందిన అండమాన్ మరియు నికోబార్ దీవులకు, ఇండోనేషియాకు చెందిన సుమతెరా ద్వీప ప్రాంతాలకు మధ్యన సంబంధ బాంధవ్యాలను పెంచడానికిగాను అవసరమైన చర్యలను చేపట్టాలి. సంస్థాగతంగా, భౌతికంగా, డిజిటల్ పరంగా, ప్రజల మధ్యన ఈ సంధాన పెంపుదల చోటుచేసుకొంటుంది. తద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, ప్రజల రాకపోకలకు ప్రోత్సహం పెరుగుతుంది. అలాగే ఇండోనేషియా లోని సుమతెరా లోని ప్రాంతాలకు (ఎసెహ్ ను కలుపుకొని) అండమాన్ దీవుల వాణిజ్య మండలికి మధ్యన వ్యాపారపరమైన లింకులకు మార్గం సుగమం అవుతుంది.
ద్వైపాక్షిక సంప్రదింపుల మీద ఆధారపడి ఇరు దేశాల మధ్యన మానవ వనరులను అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేయాలి. ఇది ఇరు దేశాల సముద్ర ప్రాంత భద్రత సామర్థ్యాన్ని నిర్మించడానికి, సహకారం బలోపేతం చేయడానికి అవసరం. మత్స్య పరిశ్రమ ను ప్రోత్సహించడానికి, సాంకేతిక సహకారం ద్వారా సముద్ర జీవ వనరుల నిర్వహణ చేపట్టడానికి ఇది అవసరం. ఇందుకోసం ఇరుదేశాల నిపుణులను ఉపయోగించుకుంటారు. తగిన పరికరాలను, ఆర్ధిక సాయాన్ని అందజేయడం జరుగుతుంది.
సముద్ర ప్రాంత మౌలిక వసతులను అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే సముద్ర ఆధారిత పరిశ్రమలను ముఖ్యంగా మత్స్య, నౌకా నిర్మాణ పరిశ్రమలను ప్రోత్సహించడం జరుగుతుంది.
బి. సముద్ర వనరుల సుస్థిరమైన అభివృద్ధికి ప్రోత్సాహం
సముద్ర జీవ వనరుల సంరక్షణ, శాస్త్ర ఆధారిత నిర్వహణను అధికం చేయాలి:
వాతావరణ మార్పులను ఎదుర్కోవాలి. పర్యావరణాన్ని, సహజ వనరుల సంరక్షణ తప్పనిసరిగా చేపట్టాలి.
అక్రమంగా, నియంత్రణ లేకుండా, సమ్మతి తీసుకోకుండా జరిగే చేపల వేటను నిర్మూలించాలి. మత్స్య పరిశ్రమకు సంబంధించిన నేరాలను గుర్తించాలి. వీటిని నూతనంగా పుట్టుకొస్తున్న నేరాలుగా పరిగణించాలి. ఇవి సముద్ర ప్రాంతాల పర్యావరణ క్షీణతకు కారణమవుతూ ప్రపంచానికి నిత్యం ముప్పును పెంచుతున్నాయి.
సముద్ర ఆధారిత ఆర్ధిక వ్యవస్థ ను ప్రోత్సహించాలి. అందరినీ భాగస్వాములను చేసే ఆర్ధికవృద్ధికి, ఉద్యోగ కల్పనకు ఇది ముఖ్య వనరు.
ఇరు దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారం ద్వారా సముద్రాలలో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టాలి.
సి. ప్రకృతి విపత్తుల నిర్వహణను విస్తరించాలి:
ఈ ప్రాంతంలో ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి వీలుగా సన్నద్ధతను బలోపేతం చేయాలి. ప్రకృతి విపత్తుల నష్ట నివారణ, నిర్వహణను బలోపేతం చేయాలి. ముఖ్యంగా బాధితులకు సాయం చేయడంలో ముందుండాలి.
ఈ ప్రాంతంలో భౌగోళిక పరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడాన్ని, దానికి సంబంధించిన పద్ధతులను, మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుకోవాలి. అంతే కాకుండా ప్రకృతి సంబంధ ప్రమాదాలు, ప్రతిబంధకాలను ముందే తెలుసుకోవడానికి, వాటి గురించి అందరికీ తెలియజేయడానికిగాను ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలి.
ప్రకృతి విపత్తుల నిర్వహణలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయాలి. ఇందుకోసం ఇరు దేశాలకు సంబంధించిన సంస్థల మధ్య ఉమ్మడి కార్యక్రమాలను క్రమం తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. అంతే కాదు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, మానవీయ అవసరాల విషయంలోను వెంటనే స్పందించగలిగే సామర్థ్యాలనుమరింత పెంచుకోవడానికిగాను ఇరు దేశాల మధ్యన శిక్షణా సహకారం వుండాలి.
డి. పర్యాటక రంగాన్ని, సాంస్కృతిక పరమైన పరస్పర మార్పిడిని అభివృద్ధి చేసుకోవాలి:
ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలను పెంచాలి. తద్వారా ప్రాంతీయ ఆర్ధిక వృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది.
కమ్యూనిటీ ఆధారిత పర్యాటకాన్ని, పర్యావరణ పర్యాటకాన్ని సుస్థిరంగా అభివృద్ధి చేయడానికిగాను ప్రోత్సాహం ఇవ్వాలి.
సబంగ్ ద్వీపానికి, పోర్టు బ్లయర్ కు మధ్య సంధానాన్ని మెరుగుపరచడం ద్వారా అండమాన్ సముద్ర పర్యాటకాన్ని రూపొందించే దిశగా పని చేయాలి. అంతే కాదు అండమాన్ లోని హవెలాక్ ద్వీపానికి, సబంగ్ ద్వీపానికి మధ్య కూడా సంధానాన్ని మెరుగుపరచాలి. తద్వారా నౌకా పర్యాటకానికి, క్రూయిజ్ పడవలకు, సముద్ర పరమైన సాహస క్రీడలకు, ఆరోగ్య పర్యాటకానికి ప్రోత్సాహం లభిస్తుంది.
బీరెయున్ లోని అల్- ముస్లిమ్ విశ్వవిద్యాలయం, లొక్సెమావె లోని మాలికుసాలెహ్ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం , ఇంకా పోర్టు బ్లయర్ లోని సంస్థల మధ్య సంస్థాగతమైన లంకెలను ఏర్పాటు చేయాలి. తద్వారా అల్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఇండియా ఇండోనేషియా అధ్యయన కేంద్రాన్నినెలకొల్పుకోవాలి.
ఇ. సముద్ర భద్రత కు ప్రోత్సాహం:
ఆసియాన్ దేశాల ఆధ్వర్యంలోని వ్యవస్థలు నిర్వహిస్తున్న ఇండో- పసిఫిక్ భద్రతను బలోపేతం చేయాలి.
ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న దేశాలు అన్నింటి లో శాంతిని, భద్రతను, సౌభాగ్యాన్ని కలగజేయాలనే లక్ష్యంతో అందిరినీ కలుపుకువెళ్లే పారదర్శకమైన సహకారాన్ని నెలకొల్పాలి.
ప్రస్తుతం అమలులో ఉన్న నావికాదళ సహకారాన్ని బలోపేతం చేయాలి. అంతేకాదు ఇరు దేశాల మధ్య 2002 లో ప్రారంభించిన ద్వైపాక్షిక సమన్వయపూరిత గస్తీని కూడా బలోపేతం చేయాలి. క్రమం తప్పకుండా ద్వైపాక్షిక నావికాదళ కవాతులను నిర్వహించాలి.
ఇండో- పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం అధికం చేయాలి.
ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న సముద్ర సరిహద్దు ఒప్పందాలను ముందుకు తీసుకుపోవాలి. వేగవంతమైన చర్చలకోసం సాంకేతిక పరమైన సమావేశాలకు మద్దతునివ్వాలని మరోసారి ఆకాంక్షించాలి. ఇరు దేశాల మధ్యన సముద్ర సరిహద్దుల పునర్విభజన విషయంలో పరస్పరం ఆమోదిత పరిష్కారం కోసం ఈ సంప్రదింపులు జరగాలి. ఈ సంప్రదింపులు యుఎన్ సిఎల్ ఒఎస్ తోపాటు అంతర్జాతీయ చట్టాలమీద ఆధారపడి ఉండాలి.
సముద్ర భద్రత విషయంలో వ్యూహాత్మక సాంకేతిక సహకారాన్ని అధికం చేసే మార్గాలను వెదకడం కొనసాగించడానికిగాను ఇరు దేశాలకు చెందిన నిపుణుల స్థాయి వారికి ఆ పనిని అప్పగించాలి. సముద్ర ప్రాంతాలపైన సరైన, విస్తరణతో కూడిన చైతన్యాన్ని రూపొందించే పనిని కూడా వీరు చేయాలి.
హైడ్రోగ్రఫి, మెరైన్ కార్టోగ్రఫి రంగాలలో ద్వైపాక్షి క సహకారం కోసం ఇరు దేశాలు కృషి చేయాలి.
సముద్ర భద్రత కు సంబంధించిన సామర్థ్యాన్ని నిర్మించుకోవడానికి సహకారాన్ని ప్రోత్సహించాలి. శోధన, కాపాడడం, కాలుష్య నివారణ మొదలైనవి సాంకేతిక సహకారం ద్వారా చేపట్టాలి. అంతే కాదు నిపుణులను ఇచ్చి పుచ్చుకోవాలి. పరికరాలను, ఆర్ధిక సహాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల ద్వారా తీర ప్రాంత గస్తీ దళాల మధ్యన సహకారాన్ని ప్రోత్సహించాలి. హాట్ లైన్ లు ఏర్పాటు చేసుకోవాలి. సంప్రదింపుల కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా సంప్రదింపుల సమావేశాలను, సమన్వయంతో కూడిన గస్తీని, ఉమ్మడి విన్యాసాలను నిర్వహించుకోవాలి.
ఇండియన్ రిమ్ అసోషియేషన్ ఆర్గనైజేశన్ (ఐఒఆర్ఎ) విధి విధానాలకు లోబడి హిందూ మహాసముద్రంపైన సురక్షితమైన భద్రత కోసం సహకారాన్ని అధికం చేయాలి.
ఎఫ్. ఇరు దేశాలలో విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో సహకారం:
భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ ఆర్ ఒ), నేశనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా (ఎల్ ఎ పిఎఎన్) ల మధ్య సహకారాన్ని ప్రోత్సహించాలి. తద్వారా భూగోళంపైన పర్యావరణాన్ని అంతరిక్షం నుండి పర్యవేక్షించాలి. అంతేకాదు, భూమికి సంబంధించిన రిమోట్ సెన్సింగ్ ను కూడా పర్యవేక్షించాలి.
పరిశోధన, అభివృద్ధి సంస్థలు, విద్యా సంస్థలలో పరిశోధన సంబంధిత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలి. వాటి మధ్య సముద్ర సాంకేతిక ను బదిలీ చేయాలి.