భారతదేశం, రష్యా ల నాయకులమైన మేము, మా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవం నేపథ్యంలో ఈ సంయుక్త ప్రకటనను చేస్తున్నాం. రెండు గొప్ప శక్తుల మధ్య విశ్వాసపూరితమైనటువంటి పరస్పర విశేష అనుబంధంతో కూడిన ప్రత్యేకమైన, విశిష్టమైన వ్యూహాత్మక భాగస్వామ్యం మాది. రాజకీయ సంబంధాలు, భద్రత, వాణిజ్యం- ఆర్థిక వ్యవస్థ, సైన్యం, విదేశాంగ విధానాలు, సాంకేతిక రంగాలు సహా ఇంధన, శాస్త్ర, సాంస్కృతిక, మానవ ఆదాన ప్రదానాలతో మా బంధం అన్ని రంగాల్లోనూ సహకారాత్మకం. రెండు దేశాల జాతీయ ప్రయోజనాలకు ప్రోత్సాహమిస్తూ మరింత శాంతియుతమైన, క్రమబద్ధమైన ప్రపంచ ఏర్పాటుకు దోహదపడుతుంది. మా ద్వైపాక్షిక సంబంధాలు ఒక దేశం పట్ల మరొక దేశానికి లోతైన అవగాహనతోను, గౌరవంతోను కూడుకొన్నవి. ఆర్థిక, సామాజిక అభివృద్ధితో పాటు విదేశాంగ విధానంలోనూ మా ప్రాధాన్యాలలో ఏకరూపత గోచరిస్తుంది. శాంతి, భద్రతలకు భరోసా, సాంస్కృతిక- నాగరికతా వైవిధ్యంతో మానవాళి మధ్య ఐక్యతను బలోపేతం చేసే అంతర్జాతీయ నిర్మాణంలో ఇలాంటి విధానాల వైపే మేం మొగ్గుచూపుతాం. మొత్తంమీద భారత- రష్యా సంబంధాలు కాలపరీక్షకు నిలిచి, బాహ్య ప్రభావాలకు అతీతమని నిరూపించుకున్నాయి.
భారత స్వాతంత్ర్య పోరాటానికి స్థిరమైన మద్దతివ్వడమేగాక దేశం స్వయం సమృద్ధం కావడంలోనూ రష్యా ఎంతగానో తోడ్పడింది. ఉభయ దేశాలూ 1971 ఆగస్టులో శాంతి, మైత్రి, సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. రెండు వైపుల నుండీ సార్వభౌమత్వానికి, ప్రయోజనాలకు గౌరవంతో పాటు మంచి పొరుగుదనం, శాంతియుత సహజీవనం వంటి పరస్పర సంబంధాల ప్రాథమిక సూత్రాలను ఈ ఒప్పందం మరింత ప్రస్ఫుటం చేసింది. రెండు దశాబ్దాల అనంతరం.. 1993 జనవరిలో స్నేహ సహకారాలపై కొత్త ఒప్పందంలోనూ నాటి సూత్రాలు అనుల్లంఘనీయమని భారతదేశం, రష్యాలు పునరుద్ఘాటించాయి. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, రష్యన్ ఫెడరేషన్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై 2000 అక్టోబర్ 3 నాటి సంయుక్త ప్రకటన రెండు దేశాల స్నేహబంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది. అంతర్జాతీయ శాంతి భద్రతలకు భరోసాను ఇవ్వడంలో సమన్వయ మార్గానుసరణ ఇందులో అత్యంత ప్రధానమైంది. అలాగే కీలకమైన అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యల పరిష్కారంతో పాటు ఆర్థిక, సాంస్కృతిక, విద్యా, ఇతర రంగాలలో సన్నిహిత సహకారానికి బాటలు పరిచింది. అటుపైన 2010 డిసెంబరు 21న ఈ బంధం ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యంగా వికసించి మరింత ఎత్తుకు ఎదిగింది.
భారత-రష్యా సంబంధాల పురోగమనం మరింత సమగ్రం కావడమే రెండు దేశాల విదేశాంగ విధానంలో అగ్ర ప్రాథమ్యం గల అంశం. వివిధ రంగాల్లో సహకార విస్తరణ పరిధి విస్తృతి దిశగా భారీ కార్యారంభ చర్యలను ఇకముందు కూడా కొనసాగిస్తాం. మా ద్వైపాక్షిక కార్యక్రమాన్ని మరింత ఫలితం రాబట్టగలిగేదిగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాం. ఇంధన రంగంలో భారత- రష్యా ఆర్థిక వ్యవస్థలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య ‘‘ఇంధన సేతువు’’ నిర్మాణానికి కృషి చేయడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను ఇంధన సహకారంలో అన్ని అంశాలకూ విస్తరిస్తాం. పరమాణు, హైడ్రోకార్బన్, జల, నవీకరణ యోగ్య శక్తి వనరులు వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి.
అంతర్జాతీయ విపణిలో సమగ్ర భాగంగా మారిన పర్యావరణ హితకర, ఆర్థికంగా సమర్థమైన రీతులలో సహజవాయువు విస్తృత వినియోగం యొక్క అవసరాన్ని భారతదేశం, రష్యా లు గుర్తించాయి. దీనివల్ల హరితవాయు ఉద్గారాలు అత్యంత గణనీయంగా తగ్గిపోతాయి కాబట్టి వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందం నిబంధనలను పాటించడంలోనూ ఇది తోడ్పడుతుంది. అంతేగాక సుస్థిర ఆర్థిక వృద్ధి సాధనకు దోహదకారి అవుతుంది. శాంతియుత ప్రయోజనాల కోసం పరమాణు శక్తి వినియోగంలో సహకారం కూడా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక ముఖ్యాంశమైంది. ఇది భారత ఇంధన భద్రతకు తోడ్పడటంతో పాటు విస్తృత శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన సంబంధ సహకారానికి ఊతమిస్తుంది. రెండు వైపులా సంయుక్త కృషితో మా శాంతియుత పరమాణు భాగస్వామ్యంలో స్థిరమైన, ప్రస్ఫుటమైన అనేక విజయాలను అందుకోవడం సాధ్యమైంది. భారత్‌లోని కుడన్ కుళం లో గల న్యూక్లియర్ పవర్ ప్లాంటు లోని ఉత్పాదక కేంద్రాలను ముందుకు తీసుకుపోవడం ద్వారా దేశంలో అతి పెద్ద శక్తి కేంద్రంగా అది రూపుదిద్దుకోవడం కూడా ఇందులో భాగమే. కుడన్ కుళం పరమాణు శక్తి కేంద్రంలోని 5వ, 6వ యూనిట్లకు సంబంధించి జనరల్ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంటు- క్రెడిట్ ప్రోటోకాల్ తుది రూపును దిద్దుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇక అణు శక్తిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించడంపై సహకార బలోపేతం దిశగా వ్యూహాత్మక దృష్టికి సంబంధించి 2014 డిసెంబరు 11న రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అమలుకు మేం కృషి చేస్తాం. పరమాణు శక్తి, పరమాణు ఇంధన చక్రం, పరమాణు శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించి విస్తృత అంశాలలో భారత-రష్యా సహకారానికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది.
పరమాణు శక్తి రంగంలో భారత,రష్యా ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి అనుగుణంగా భారతదేశంలో ఆధునిక పరమాణు ఉత్పాదక సామర్థ్యాల అభివృద్ధికి అవకాశాలు మెరుగుయ్యాయి. భారతదేశం, రష్యా లు 2015 డిసెంబరు 24న సంతకాలు చేసిన ‘భారతదేశంలో స్థాన నిర్ణయంపై కార్యాచరణ ప్రణాళిక’ సత్వర అమలు, తద్వారా పరమాణు పరిశ్రమలు సన్నిహిత, సుస్థిర సంయుక్త కార్యకలాపాలు నిర్వహించేలా చూసేందుకు రెండు దేశాలూ కట్టుబడి ఉన్నాయి.
రష్యన్ ఫెడరేషన్ లోని ఆర్కిటిక్ నిక్షేప ప్రాంతంలో హైడ్రోకార్బన్ ల అన్వేషణ కోసం సంయుక్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మేం ఆసక్తితో ఉన్నాం. అగాధ జలనిధి అన్వేషణ క్షేత్రంలో పరస్పర ప్రయోజనకర సహకార సామర్థ్యాన్ని జోడించేందుకు సంయుక్త వ్యూహాలను అభివృద్ధి చేస్తాం. అలాగే హైడ్రోకార్బన్ వనరులు, బహుళ ఖనిజ గుళికల అభివృద్ధితో పాటు పరస్పర ప్రయోజనకర సహకారాభివృద్ధికి సముద్ర పరిశోధన, శిక్షణ క్షేత్రంలో గల బలాలను వినియోగించుకుంటాం.
భారతదేశంలోని ప్రస్తుత విద్యుత్ ఉత్పాదన కేంద్రాల అధునికీకరణ, కొత్త కేంద్రాల నిర్మాణం కోసం రెండు దేశాల్లోని ఇంధన కంపెనీల మధ్య సహకారాన్ని మేం ఆశిస్తున్నాం. సాంకేతికత, భిన్న భౌగోళిక ప్రాంతాలు- వాతావరణ పరిస్థితుల మధ్య పని అనుభవం, ఇంధన సామర్థ్య పరిజ్ఞాన వినియోగంతో పరిశుభ్రమైన, పర్యావరణమైత్రీపూర్వకమైన, ఇంధన వనరుల లభ్యత యొక్క సృష్టి దిశగా రెండు దేశాలలో సంయుక్త ప్రాజెక్టులు రూపొందించేందుకు మేం కృషి చేస్తాం. వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ సహా వస్తుసేవలకు సంబంధించి వైవిధ్యభరిత పెట్టుబడులు మా ప్రధాన ఆర్థిక లక్ష్యాలలో ఒక భాగం. ప్రత్యేకించి.. ద్వైపాక్షిక వాణిజ్యంలో అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తుల వాటాను పెంచడం, పారిశ్రామిక సహకారానికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడం ఇందులో భాగంగా ఉన్నాయి. అదేవిధంగా పారిశ్రామికీకరణకు తగిన పర్యావరణాన్ని మెరుగుపరచడం, రెండు దేశాల మధ్య బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాల్లో సహకారం కూడా ప్రధానమైనవే. వ్యూహాత్మక భాగస్వామ్య తదుపరి దశలో భాగంగా మూడో ప్రపంచ దేశాలలో పరస్పర ప్రయోజనకర సంయుక్త ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా సాంకేతిక, ఆర్థిక, శాస్త్రపరమైన సహకారాన్ని అందిస్తాం. మా ద్వైపాక్షిక వాణిజ్యం ఇతర దేశాల కరెన్సీపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు వీలుగా భారత-రష్యాల మధ్య వాణిజ్య లావాదేవీలను తమ సొంత (జాతీయ) కరెన్సీలతో పరిష్కరించుకునే కృషిని సమన్వయం చేసుకుంటాం. భారతీయ రిజర్వు బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ రష్యా లు వివరించిన ప్రకారం.. జాతీయ కరెన్సీలలో స్వీకరణ, చెల్లింపుల దిశగా ప్రస్తుత ఆచరణీయ పథకాలు, యంత్రాంగాలను వినియోగించుకునేలా మా వ్యాపారవేత్తలను సంయుక్తంగా ప్రోత్సహిస్తాం.
రాజకీయ స్థితిగతులకు అతీతంగా, విపణి భాగస్వాములకు పారదర్శకంగా పనిచేసే పరపతి మూల్యాంకన పరిశ్రమకు రూపునివ్వడంతో మా ప్రపంచ స్థాయిని సమన్వయం చేసుకుంటాం. ఇందులో భాగంగా పరపతి మూల్యాంకనానికి సంబంధించి మా చట్టాల సమన్వయానికి గల అవకాశాలను అన్వేషించేందుకు సాగే కృషిని ప్రోత్సహిస్తాం. అలాగే మా స్థానిక పరపతి మూల్యాంకన సంస్థల రేటింగ్‌కు గుర్తింపు ఇస్తాం. ప్రాంతీయ స్థాయిలో ఆర్థిక సహకారం అభివృద్ధికి గల ప్రాముఖ్యాన్ని మేం గుర్తించాం. ఐరోపా-ఆసియా ఆర్థిక సమాఖ్య, గణతంత్ర భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై త్వరగా సంప్రదింపులు ప్రారంభించేందుకు పరిస్థితులు సానుకూలం చేస్తాం. శాంతి, ప్రగతి, సౌభాగ్యం కోసం ప్రాంతీయ అనుసంధానం అవసరంపై ప్రస్ఫుటమైన హేతుబద్ధతను మేం అభినందిస్తున్నాం. అనుసంధానం బలపడాలని మేం నమ్ముతున్నాం. సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవమిస్తూ అన్నిపక్షాల మధ్య సంభాషణలు, ఏకాభిప్రాయం దానికి ప్రాతిపదిక కావాలని భావిస్తున్నాం. పారదర్శకత, స్థిరత్వం, బాధ్యతలే రష్యా, భారత్ పక్షాలకు మార్గదర్శకాలు.. అలాగే హరిత కారిడార్ అమలు దిశగా అంతర్జాతీయ నార్త్-సౌత్ రవాణా కారిడార్‌కు మౌలిక సదుపాయాల కల్పనలో తమ కట్టుబాటును రెండు పక్షాలూ పునరుద్ఘాటిస్తున్నాయి.
తాజా శాస్త్ర పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రాతిపదికగా విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి రెండు దేశాలూ కట్టుబడి ఉన్నాయన్న వాస్తవం మాకు తెలుసు. తదనుగుణంగా రూపకల్పన, అభివృద్ధి, తయారీలో సహకారాన్ని విస్తరించడంద్వారా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఉత్పత్తులను విదేశీ విపణులలోకి తెస్తాం. అంతరిక్ష పరిజ్ఞానం, విమానయానం, కొత్త ఉత్పత్తులు, వ్యవసాయం, సమాచార-వర్తమాన సాంకేతికతలు, వైద్యం, ఔషధాలు, రోబోటిక్స్, సూక్ష్మ సాంకేతికత, సూపర్ కంప్యూటింగ్ పరిజ్ఞానం, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, భౌతిక శాస్త్రాలు వంటి రంగాల్లో శాస్త్రీయ సహకారాన్ని కూడా బలోపేతం చేస్తాం. రెండు దేశాల మధ్య అత్యాధునిక సాంకేతికతలకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ నియామకాన్ని మేం స్వాగతిస్తున్నాం.
మౌలిక సదుపాయాల ఆధునికీకరణ దిశగా సంయుక్త కృషిని ముమ్మరం చేసేందుకు మేం ఉమ్మడిగా పనిచేస్తాం. పట్టణీకరణ సవాళ్లపై స్పందించే మార్గాలను సంయుక్తంగా అన్వేషిస్తాం. ఆహార భద్రత, జల వనరుల- అటవీ వనరుల సంరక్షణ సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. చిన్న పరిశ్రమలు, మధ్యతరహా పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి కోసం ఆర్థిక సంస్కరణలు, జాతీయ కార్యక్రమాల అమలులో అనుభవాలను పంచుకుంటాం.
వజ్రాల పరిశ్రమకు సంబంధించి రెండు దేశాల ప్రస్తుత బలాలు, వనరుల సంపూర్ణ వినియోగం లక్ష్యంగా సహకార సామర్థ్యం అభివృద్ధికిగల మరిన్ని అవకాశాలను సృష్టికి కలిసి పనిచేస్తాం. వజ్రాల పరిశ్రమ లోకి రహస్య కృత్రిమ రాళ్ల ప్రవేశాన్ని అడ్డుకునే ఉమ్మడి చర్యలను ముమ్మరం చేయడంతో పాటు వజ్రాల కోసం సాధారణ మార్కెటింగ్ కార్యక్రమాల రూపకల్పనకు మద్దతిస్తాం.
హైస్పీడ్ రైలు వ్యవస్థలు, రవాణా లక్షిత కారిడార్లు, రైలు రవాణా సమర్థ నిర్వహణ కోసం కొత్త సాంకేతికతల అమలుకు సంయుక్తంగా పనిచేస్తాం. ఈ మేరకు రైలు మార్గాలు- రహదారి మార్గాల రంగంలో ఒకరి సామర్థ్యం ద్వారా మరొకరు లబ్ధి పొందే విధంగా ఉమ్మడి రూపకల్పన, సాంకేతికతల ఆదానప్రదానం, సిబ్బంది శిక్షణ తదితర చర్యలు చేపడతాం.
వ్యవసాయ, ఆహార పదార్థాలకు రెండు దేశాల్లో పరస్పర విపణుల అందుబాటు కోసం కలిసి పనిచేస్తాం. వ్యవసాయం, ఆహార తయారీ రంగాల్లో ప్రస్తుత సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి పరిశోధన-అభివృద్ధి ద్వారా సంయుక్త వ్యూహాలు రూపొందిస్తాం. వ్యవసాయం, ఉత్పత్తి, పంటల సేకరణ, శుద్ధి తదితరాల నుంచి విపణి వ్యూహాలదాకా అన్ని అంశాలూ ఇందులో భాగంగా ఉంటాయి. రెండు దేశాల్లో వనరుల సమర్థ వినియోగానికి అనువైన సంయుక్త ప్రాజెక్టుల అన్వేషణకు సంయుక్తంగా పనిచేస్తాం. ఆ మేరకు సహజ వనరుల గరిష్ఠ, పర్యావరణహిత వినియోగానికి వీలుగా గనులు-లోహాన్వేషణ రంగం కోసం కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడం, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞాన వినియోగంద్వారా సహజ వనరుల సమర్థ వాడకానికి ఉమ్మడి ప్రాజెక్టుల అన్వేషణలో మేం కలిసి పనిచేస్తాం.
భారతదేశం 2020కల్లా మూడో అతి పెద్ద విమానయాన విపణిగా ఆవిర్భవిస్తుందని మేం గుర్తించాం. ఇలా సృష్టించబడే గిరాకీకి అనుగుణంగా భారతదేశంలో ఉమ్మడిగా విమానాల తయారీ కోసం సంయుక్త సంస్థల ఏర్పాటు, మూడో ప్రపంచ దేశాలకు విక్రయంలో సహకార బలోపేతం దిశగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాంతీయ అనుసంధానత పథకం ఒక అవకాశం కల్పిస్తుంది. మా ద్వైపాక్షిక రక్షణ సహకార బంధం బలమైన పరస్పర విశ్వాసంతో ఏర్పడింది. రష్యా తన ఆధునిక సైనిక సాంకేతికతలను భారతదేశానికి ఎగుమతి చేస్తుంది. సైనిక సామగ్రి, విడి పరికరాల సంయుక్త తయారీ, సహోత్పత్తి, సహాభివృద్ధి ద్వారా ఈ సహకారాన్ని మరింత ఉన్నతస్థాయికి పెంచి, ముమ్మరం చేస్తాం. సైనిక-సాంకేతిక సహకారంపై ప్రస్తుత ఒప్పందాల కింద రెండు దేశాలకూగల బాధ్యతలకు అనుగుణంగా భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాల అనువర్తనం, ఆదాన ప్రదానంపై ఆధారపడటం పెరుగుతున్న పరిస్థితుల్లో ఇది అవశ్యం.
సైన్యం నుంచి సైన్యానికి సహకారం ప్రమాణాత్మకంగా మరింత ఉన్నత స్థాయికి చేరేటట్లుగా మేం కలసి పనిచేస్తాం. భూతల, సముద్ర సైనిక విన్యాసాలను క్రమం తప్పకుండా నిర్వహించడంతోపాటు పరస్పర సైనిక శిక్షణ సంస్థల్లో శిక్షణను కూడా కొనసాగిస్తాం. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రప్రథమంగా ‘‘ఇంద్ర-2017’’ పేరిట త్రివిధ దళాల సైనిక కసరత్తును ఈ ఏడాది మీరంతా చూడబోతున్నారు.
సమాజ హితం కోసం తగు సాంకేతికతలను వినియోగించడం దృష్ట్యా అంతరిక్ష పరిశోధనలోనూ ద్వైపాక్షిక సహకారానికి చాలా అవకాశాలున్నాయి.
ప్రకృతి విపత్తుల నిరోధం, స్పందన విషయంలో సంయుక్తంగా పనిచేయడాన్ని మేం కొనసాగిస్తాం.
రష్యా సుదూర తూర్పు ప్రాంతంపై ప్రత్యేక దృష్టితో మా ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య సహకారాన్ని మరింతగా ప్రోత్సహించడాన్ని మరింత చురుకైన రీతిలో ముమ్మరం చేయాలని నిర్ణయించుకున్నాం.
ఈ 21వ శతాబ్దంలో దేశాల మధ్య సంబంధాలు సహజ, అనివార్య పరిణామ ప్రక్రియకు లోనవుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ అంతర్జాతీయ సంబంధాలలో బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థను ఏర్పరచాలని భారతదేశం, రష్యా భావిస్తున్నాయి. దీనికి సంబంధించి అంతర్జాతీయ చట్ట సూత్రావళి, ఐక్యరాజ్యసమితి లోని ప్రపంచ రాజకీయ సమన్వయ కేంద్ర ప్రధాన పాత్రల ఆధారంగా అంతర్జాతీయ సంబంధాల వ్యవస్థ ప్రజాస్వామ్యీకరణ దిశగా సహకారాన్ని విస్తృతం చేస్తాం. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు అవసరమని మేం విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా భద్రతా మండలి సమకాలీన వాస్తవికతలకు మరింత ప్రాతినిధ్యం వహించేదిగా, ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులపై మరింత సమర్థంగా స్పందించేదిగా ఉండాల్సిన అవసరం ఉందని మేం నమ్ముతున్నాం. భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం భారతదేశం అభ్యర్థిత్వానికి రష్యా తన మద్దతును పునరుద్ఘాటించింది. శాంతిని పటిష్టపరచడంతో పాటు భౌగోళిక-ప్రాంతీయ సుస్థిరత, భద్రతల కల్పన కోసం అంతర్జాతీయ కృషిలో సమర్థంగా నిమగ్నంకాగల సానుకూల అంతర్జాతీయ అజెండా పురోగతికి మేం మద్దతిస్తాం. అలాగే అది సవాళ్లను, ముప్పులను ఎదుర్కొనేదిగానూ, సంక్షోభాల పరిష్కారంలో న్యాయమైన, సమన్వయ విధానాలను చురుగ్గా ప్రోత్సహించేదిగానూ ఉండాలి.
ప్రపంచ రాజకీయ, ఆర్థిక, ద్రవ్య, సామాజిక సంస్థలలో ప్రజాస్వామ్యీకరణ, సంస్కరణలను ప్రోత్సహించేందుకు మేం కృషి చేస్తాం. తద్వారా అంతర్జాతీయ సమాజంలోని సభ్యులందరి ప్రయోజనాలకూ మెరుగైన స్థానం కల్పించేందుకు అవి దోహదపడతాయి.
వివిధ దేశాల ప్రధాన ఆందోళనలను, సహేతుక ప్రయోజనాలను విస్మరించడాన్ని, ఏకపక్ష వాద ఉపాయాలను లేదా సార్వభౌమత్వానికి గౌరవ లోపాన్ని మేం వ్యతిరేకిస్తాం. ప్రత్యేకించి రాజకీయ, ఆర్థిక ఆంక్షలను ఒత్తిడి పెంచే ఏకపక్ష మార్గంగా ప్రయోగించడాన్ని మేం అంగీకరించబోం. బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) కూటమితో ఫలవంతమైన సహకారాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నాం. ఆ విధమైన మా సంయుక్త కృషి ద్వారా అది అంతర్జాతీయ వ్యవహారాల్లో తన అధికారిక, ప్రభావవంతమైన పాత్రను స్థిరంగా పెంపొందించుకుంటుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ), జి20, షాంఘై సహకార సంస్థ (ఎస్ సిఒ), రష్యా-ఇండియా-చైనా సహకార సంస్థ వంటి బహుళపక్ష వేదికలు, సంస్థల మధ్య సహకారం పెంపొందించడాన్ని మేం కొనసాగిస్తాం.
షాంఘై సహకార సంస్థలో భారతదేశానికి పూర్తి సభ్యత్వం లభించడం శాంతి, సుస్థిరతలు నెలకొనేలా చేయడంలో ఆ సంస్థ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచగలుగుతుంది. దాంతోపాటు యూరేషియా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి, సౌభాగ్యాలను సాధించడమే గాక సంస్థ అంతర్జాతీయ హోదాను సైతం మెరుగుపరుస్తుంది.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అన్ని దేశాల సహేతుక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూ భాగస్వామ్య సూత్రాల ప్రాతిపదికన ఈ ప్రాంతంలో సార్వత్రిక, అత్యంత సమతుల, సమ్మిళిత భద్రతా స్వరూప ఆవిష్కరణ దిశగా కృషికి మా చేయూతను కొనసాగిస్తాం. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు చట్రానికి అనుగుణంగా సహేతుక చర్చల పురోగమనానికి తోడ్పటం కూడా ఇందులో అంతర్భాగంగా ఉంటుంది.
మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలలో శాంతి, సుస్థిరతల పునరుద్ధరణకు ఎదురవుతున్న సవాళ్లపైనా మా వైఖరుల సమన్వయ కృషిని మేం ముందుకు తీసుకెళ్తాం. అలాగే మాస్కో చర్చల సందర్భంగా ఆమోదించిన చట్రంతో పాటు నిర్దేశిత జాతీయ సార్వభౌమత్వ సూత్రాల ఆధారంగా సిరియా సంక్షోభ పరిష్కారం, ఆఫ్ఘనిస్థాన్‌లో జాతీయ సమన్వయ సాధనకు తోడ్పడతాం. అంతేకాకుండా ఆయా దేశాలు తమంతట తాము పరివర్తన చెందటానికి ప్రోత్సాహమిస్తూ వాటి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం నివారణకూ కృషి చేస్తాం. జన హనన ఆయుధాల విస్తరణను నిరోధించడంలో భారత, రష్యాలు ఉమ్మడి బాధ్యతకు కట్టుబడి ఉన్నాయి. బహుళపక్ష ఎగుమతి నియంత్రణ వ్యవస్థలో భారత్ భాగస్వామ్యం వాటి విస్తరణకు తోడ్పడగలదని రష్యా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో పరమాణు సరఫరాదారుల కూటమి , ‘వాసెనార్ ఒప్పందం’లో సభ్యత్వానికి భారతదేశం దరఖాస్తును రష్యా స్వాగతించింది. ఆ మేరకు భారతదేశానికి ఎగుమతి నియంత్రణ వ్యవస్థలో సత్వర సభ్యత్వంపై తన బలమైన మద్దతును పునరుద్ఘాటించింది.
అన్ని రూపాలు, చర్యలతో కూడిన ఉగ్రవాదాన్ని మేం బలంగా ఖండిస్తున్నాం. సైద్ధాంతిక, మతపరమైన, రాజకీయ, వర్ణ, జాతి లేదా ఏ ఇతర కారణాలమీద ఆధారపడిన ఎలాంటి తీవ్రవాద చర్యలైనా సమర్థనీయం కాదని స్పష్టం చేస్తున్నాం. శాంతిభద్రతల నిర్వహణకు ముప్పుగా పరిణమించిన అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరాట కృషిని సంయుక్తంగా కొనసాగిస్తాం. ఈ ముప్పు అనూహ్యంగా విస్తరించడంపై అంతర్జాతీయ సమాజం మొత్తం నుంచి సమష్టి, నిర్ణయాత్మక ప్రతిస్పందన అవసరమని, ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలు, ఐక్య రాజ్య సమితి అధికార పత్రం సూత్రావళి ప్రకారం ద్వంద్వ ప్రమాణాలకు, పక్షపాత సమర్థనకు వీల్లేదని మేం విశ్వసిస్తున్నాం. ఉగ్రవాద సమూహాలను, వాటి ఆర్థిక వనరులను విచ్ఛిన్నం చేయడంతో పాటు సరిహద్దుల ఆవలి ఉగ్రవాద సంచారాన్ని నిలిపివేయాలని మేం అన్ని దేశాలనూ కోరుతున్నాం. ఈ బెడద నిర్మూలన దిశగా ప్రపంచ ఉగ్రవాద నిరోధక విధానం, చట్ట చట్రం బలోపేతానికి సంబంధించిన ‘‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం’’ పై చర్చలను త్వరగా ముగించాలని పిలుపునిస్తున్నాం.
సమాచార-వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో భద్రత కల్పనకు ఉమ్మడి విధానాలను పంచుకుంటూ దేశాల బాధ్యతాయుత వైఖరిని నిర్దేశించే సార్వత్రిక నిబంధనలు, ప్రమాణాలు, సూత్రాల రూపకల్పనకు మేం కలిసి పనిచేస్తాం. ప్రజాస్వామ్యీకరణ, బహుళపక్ష భాగస్వామ్యత్వంపై ఓ నమూనా ఆధారంగా అంతర్జాతీయ ఇంటర్ నెట్ పాలన సూత్రల్లో దేశాలకు ప్రాధాన్యమివ్వాలని మేం భావిస్తున్నాం. సమాచార-వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో భద్రతకు సంబంధించి సహకారంపై భారత-రష్యా అంతర్ ప్రభుత్వ ఒప్పందం ప్రాతిపదికగా ద్వైపాక్షిక పరస్పర చర్యలను సక్రియాత్మకం చేయాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం. భారత-రష్యా ప్రజల మధ్య అత్యున్నత పరస్పర ఆసక్తులు, సానుభూతి, గౌరవాలను పరిగణనలోకి తీసుకుంటూ సంస్కృతి, క్రీడారంగాలతోపాటు వార్షిక వేడుకల నిర్వహణ- ఆదాన ప్రదానాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచేందుకు మావంతు కృషి చేస్తాం. ఇందులో భాగంగా భారత్-రష్యాల మధ్య 70వ దౌత్యసంబంధ ఏర్పాటు వార్షికోత్సవాలను పురస్కరించుకుని రెండు దేశాల్లోని వివిధ నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించడాన్ని మేం స్వాగతిస్తున్నాం.
విద్యారంగంలో ద్వైపాక్షిక సహకారం అనేక గొప్ప అవకాశాలు కల్పిస్తుంది. ఈ రంగంలో సహకార బలోపేతానికి మేం కలిసి కృషి చేస్తాం. తదనుగుణంగా విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల మధ్య ప్రత్యక్ష సంబంధాలను ప్రోత్సహిస్తాం. రెండు దేశాల విద్యార్థులకు సహాయం కూడా అందిస్తాం. ఇక శాస్త్ర-సాంకేతిక రంగాల్లో మా ద్వైపాక్షిక సహకారం కూడా అనేక గొప్ప అవకాశాలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పు, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్ర ఇంధనం, సైబర్ భద్రత, ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం, సముద్ర జీవశాస్త్రం వంటి వాటిపై ఎదురయ్యే అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనడంలో ఉమ్మడి కృషికి కట్టుబడి ఉన్నాం. శాస్త్ర ఆవిష్కరణలు, ఉమ్మడి ప్రయోజన ప్రాధాన్యాంశాల అన్వేషణ తదితర మార్గాల్లో ఈ కృషి సాగుతుంది. విజ్ఞాన కేంద్రాల నెట్‌వర్క్‌ల సృష్టితో పాటు ఆవిష్కరణలకు దారితీసే సాంకేతికతలు సహా సమాజాభివృద్ధిని వేగిరపరచే మేధో అనుసంధానం, శాస్త్ర కారిడార్ల ఏర్పాటుకు మేం కలిసి పనిచేస్తున్నాం.
వీసా నిబంధనల సడలింపుసహా ప్రజల మధ్య ముఖాముఖి సంబంధాలను, పర్యాటకాభివృద్ధిని కూడా ప్రోత్సహించాలని మేం నిర్ణయించుకున్నాం.
రెండు దేశాల మధ్య బలమైన స్నేహం, ఐక్యతతో కూడిన పరస్పర ప్రయోజనకర భాగస్వామ్యం తదితరాలకు భారతదేశం, రష్యా లు ఆదర్శంగా నిలవడమన్నది ఇకపైనా కొనసాగుతుందని మేం విశ్వసిస్తున్నాం. భారతదేశం, రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యానికి గల అపార సామర్థ్యాన్ని ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిపై భాగస్వామ్య దృష్టి ఆధారంగా మరింత ముందుకు నడపడంలో మేం విజయవంతం కాగలమని, తద్వారా రెండు దేశాలతో పాటు యావత్తు అంతర్జాతీయ సమాజానికీ లబ్ధి చేకూరుతుందని విశ్వసిస్తున్నాం.