భారత రత్న ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి ముని మనుమరాళ్ళు ఎస్.ఐశ్వర్య మరియు ఎస్.సౌందర్య లు వారి తల్లితండ్రులు శ్రీ వి. శ్రీనివాసన్ మరియు శ్రీమతి గీత శ్రీనివాసన్ లతో పాటు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఈ రోజు కలుసుకొన్నారు.
ఈ సందర్భంగా కుమారి ఎస్. ఐశ్వర్య మరియు కుమారి ఎస్. సౌందర్య లు ‘‘మైత్రీమ్ భజతా..’’ ను కొద్దిసేపు ఆలాపించారు. ఇది ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి 1966 అక్టోబరు లో ఐక్య రాజ్య సమితి లో పాడిన ఆశీర్వాద గీతం.
ఈ ఆశీర్వాద గీతాన్ని కంచి కి చెందిన ఆచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి సంస్కృత భాషలో రచించారు.
ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి ఐక్య రాజ్య సమితిలో ఇచ్చిన కచేరీ అనంతర కాలంలో అనేక కచేరీలలో కూడా పాడిన ఈ కీర్తన, ప్రపంచ శాంతిని మరియు సార్వజనిక స్నేహాన్ని ఆకాంక్షిస్తూ సాగి ‘‘శ్రేయో భూయాత్ సకల జననమ్’’ అనే పదాలతో ముగుస్తుంది. ఈ మాటలకు.. మానవ జాతిలో దయ మరియు సంతోషం వెల్లివిరియును గాక.. అని అర్థం.