భారత స్వాతంత్ర్య సంగ్రామం లో అమరులైన వారికి సంబంధించిన వారి వివరాల తో కూడిన నిఘంటువు ను న్యూ ఢిల్లీ లోని లోక్ కల్యాణ్ మార్గ్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 1857 తొలి స్వాతంత్ర్య సంగ్రామం నుండి 1947 భారత స్వాతంత్ర్య పోరాటం వరకు దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కు సంబంధించిన వివరాలు ఈ ఐదు సంపుటాల నిఘంటువు లో ఉన్నట్టు తెలిపారు.
జలియన్ వాలా బాగ్ ఊచకోత, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఆజాద్ హింద్ ఫౌజ్, స్వాతంత్ర్య సమరం లలో ప్రాణ త్యాగం చేసిన వారి ని గురించినటువంటి మరెన్నో విషయాలు ఇందులో ఉన్నట్టు ప్రధాన మంత్రి వెల్లడించారు.
స్వాతంత్ర్య ఉద్యమం లో అమరులైన వారి వివరాల ను ఇంత పెద్ద ఎత్తున ఒక చోట చేర్చే ప్రయత్నం జరగడం ఇదే తొలి సారి అని ఆయన
అన్నారు. ఈ సంగ్రహాల ను తయారు చేయడం లో పాలుపంచుకొన్న వారందరికి ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు.
దేశ చరిత్ర లో ఒక ముఖ్య భాగమైన వారి ని గురించి లేదా చరిత్ర ను సృష్టించిన వారిని స్మరించుకోని, గౌరవించుకోని దేశాని కి భద్రమైన భవిష్యత్తు ఉండదని ప్రధాన మంత్రి అన్నారు. ఆ రకం గా ప్రస్తుతం జరిగిన ప్రయత్నం కేవలం గతాన్ని కీర్తించుకోవడమే కాకుండా భద్రమైన భవిష్యత్తు ను ఏర్పరచుకోవడం గా కూడా చెప్పుకోవచ్చన్నారు. యువత ప్రత్యేకం గా ఈ కృషి ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయాలన్నారు.
స్వాతంత్ర్య ఉద్యమ వీర ఘట్టాల ను, స్వాతంత్ర్య సమరయోధుల అసమాన ధైర్య సాహసాల ను స్మరించుకోవడం, అలాంటి విలువల ను పెంపొందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇది భవిష్యత్ తరాల పై సానుకూల ప్రభావాన్నిచూపుతుందని, ఇది “భారతదేశమే అన్నింటి కన్నా ముందు” అన్న భావన వారి లో బలపడుతుందని అన్నారు.
స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఇప్పటి వరకు భారతదేశాని కి యుద్ధ స్మారకం లేదని, ఇటీవలే జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించి తాను జాతికి అంకితం చేసినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. అలాగే జాతీయ పోలీసు అమరుల స్మారకాన్నినిర్మించినట్టు ప్రధాన మంత్రి చెప్పారు.
సర్ దార్ వల్లభ్ భాయ్ పటేల్ గౌరవార్థం ప్రపంచం లోకెల్లా ఎత్తయిన విగ్రహాన్ని నెలకొల్పినట్లు ప్రధాన మంత్రి చెప్పారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ ల గుర్తు గా క్రాంతి మందిర్ ను ఎర్ర కోట లో ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.
మన స్వాతంత్ర్య ఉద్యమ పోరాటం లో భాగస్వాములైన ఆదివాసీ నాయకుల అసమాన ధైర్య సాహసాల ను స్మరించుకొంటూ వస్తు సంగ్రహాలయాల ను నిర్మిస్తున్నట్టు కూడా ప్రధాన మంత్రి తెలిపారు.
ఈ సందర్భం గా జరిగిన కార్యక్రమం లో కేంద్ర సంస్కృతి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ మహేశ్ శర్మ పాల్గొన్నారు.
పూర్వరంగం:
భారత స్వాతంత్ర్య సంగ్రామం లో అమరులైన వారి నిఘంటువు రూపకల్పన కు సంబంధించిన ప్రాజెక్టు ను, 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగిన 150 సంవత్సరాల ను పురస్కరించుకొని, సంస్కృతి మంత్రిత్వ శాఖ , ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసర్చ్ (ఐసిహెచ్ఆర్) లు చేపట్టాయి.
ఈ నిఘంటువు లో స్వాతంత్ర్య ఉద్యమ అమరుల ను గురించి నిర్వచించారు. దేశ విముక్తి కోసం , స్వాతంత్ర్య ఉద్యమ పోరాటం లో ఎవరైనా వ్యక్తి నిర్బంధం లో గాని లేదా పోరాట కార్యక్రమాలలో గాని మరణించినా, ఉరి శిక్ష కు గురైనా అలాంటి వారి ని అమరులు గా నిర్వచించారు. వీరి లో మాజీ ఐఎన్ఎ లేదా బ్రిటిష్ వారికి వ్యతిరేకం గా పోరాడిన మాజీ సైనికుల ను కూడా చేర్చారు.
ఇందులో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం, జలియన్‌వాలా బాగ్ ఊచకోత (1919), సహాయ నిరాకరణ ఉద్యమం (1920-22), శాసనోల్లంఘన ఉద్యమం (1930-34), క్విట్ ఇండియా ఉద్యమం (1942-44), పలు పోరాట ఘట్టాలు (1915-34), రైతు ఆందోళన లు,
గిరిజన ఉద్యమాలు, సంస్థానాలలో (ప్రజా మండళ్లలో) బాధ్యతాయుత ప్రభుత్వాని కి ఆందోళనలు, ఇండియన్ నేశనల్ ఆర్మీ [ఐఎన్ఎ ] (1943-45)
భారత నౌకాదళ పోరాటం (ఆర్‌ఐఎన్ 1946) తదితరాలు ఉన్నాయి. సుమారు 13,500 మంది స్వాతంత్ర్య ఉద్యమ అమరుల గురించిన సమాచారాన్ని ఈ సంపుటాల లో పొందుపరిచారు.
ఈ ప్రచురణ ను ఐదు సంపుటాలలో (జోన్ ల వారీ గా )వెలువరించారు. అవి కింది విధం గా ఉన్నాయి.
డిక్శనరి ఆఫ్ మార్టర్స్: ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్ (1857-1947), వాల్యూమ్ – 1, పార్ట్స్ 1, 2. ఈ సంపుటి లో ఢిల్లీ, హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లకు చెందిన సుమారు 4,400 కన్నా ఎక్కువ మంది అమరుల పేర్లు ఇచ్చారు.
డిక్శనరి ఆఫ్ మార్టర్స్: ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్ (1857-1947), వాల్యూమ్ – 2, పార్ట్స్ 1, 2. ఈ సంపుటి లో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, జమ్ము & కశ్మీర్ లకు చెందిన 3,500 కన్నా ఎక్కువ మంది స్వాతంత్ర్య ఉద్యమ అమరుల వివరాలు ఇచ్చారు.
డిక్శనరి ఆఫ్ మార్టర్స్: ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్ (1857-1947), వాల్యూమ్ – 3, పార్ట్స్ 1, 2. ఈ సంపుటి లో మహారాష్ట్ర, గుజరాత్, సింధ్ లకు చెందిన 1,400 కన్నా ఎక్కువ మంది స్వాతంత్ర్య ఉద్యమ అమరుల వివరాలు ఇచ్చారు.
డిక్శనరి ఆఫ్ మార్టర్స్: ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్ (1857-1947), వాల్యూమ్ – 4, పార్ట్స్ 1, 2. ఈ సంపుటి లో బెంగాల్, బిహార్, ఝార్ ఖండ్, ఒడిశా, అసమ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర లకు చెందిన 3,300 కన్నా ఎక్కువ మంది స్వాతంత్ర్య ఉద్యమ అమరుల వివరాలు ఇచ్చారు.
డిక్శనరి ఆఫ్ మార్టర్స్: ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్ (1857-1947), వాల్యూమ్ -5, పార్ట్స్ 1, 2. ఈ సంపుటి లో ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, కర్నాటక, తమిళ నాడు, కేరళ లకు చెందిన 1,450 కన్నా ఎక్కువ మంది స్వాతంత్ర్య ఉద్యమ అమరుల వివరాలు ఇచ్చారు.