గడిచిన కొద్దివారాలు రాజకీయ నేతలకు, మీడియాకు తీరికలేకుండా గడిచాయి. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో మేం నిమగ్నమై ఉన్నవేళ నాకు ఒక విషాద వార్త అందింది. రామోజీరావు ఇక లేరని తెలిసింది. మా మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా వ్యక్తిగతంగా ఇది నాకు తీవ్ర నష్టం.
రామోజీరావు గురించి ఆలోచించగానే నా మనసులో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి మెదిలారు. ఆయనకు ఆయనే సాటి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన భిన్న రంగాల్లో అద్భుతంగా రాణించారు. సినిమాలు, వినోదం, మీడియా, వ్యవసాయం, విద్య, పాలనపై తనదైన ముద్ర వేశారు. అయినా జీవితపర్యంతం ఆయనలో వినమ్రత సడలలేదు. అలాగే మూలాలను ఎన్నడూ విస్మరించలేదు. ఈ గొప్ప లక్షణాలే ఆయనను అనేక మందికి ఆత్మీయుడిని చేశాయి.
మీడియా రంగంలో రామోజీరావు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నిబద్ధత, నవ్యత, అసమాన పనితీరు వంటి అంశాల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఆయన కాలానుగుణంగా నడుచుకున్నారు. కాలంకన్నా వేగంగానూ పరుగులు తీశారు. పత్రికలే ప్రధాన వార్తా వనరుగా ఉన్న కాలంలో ‘ఈనాడు’ దినపత్రికను స్థాపించారు. 1990లలో భారత్‌లో టీవీల సందడి ప్రారంభం కాగానే ఈటీవీతో ఆయన తనదైన ముద్రవేశారు. తెలుగుతోపాటు ఇతర భాషా ఛానళ్లనూ ప్రారంభించడం ద్వారా ‘ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు.
వృత్తిపరమైన విజయాలకు తోడు రామోజీరావు భారత దేశ అభివృద్ధి పట్ల అమితమైన అనురక్తి ప్రదర్శించేవారు. ఆయన కృషి ఫలితాలు ‘న్యూస్‌రూమ్’నూ దాటి విస్తరించాయి. విద్య, వ్యాపార, సామాజిక అంశాలపైనా ప్రభావం చూపాయి. ప్రజాస్వామ్య సూత్రాల పట్ల ఆయనకు అచంచల విశ్వాసం ఉంది. 1980లలో.. మహా నాయకుడు ఎన్టీఆర్‌ను కాంగ్రెస్ వేధించి, ఆయన ప్రభుత్వాన్ని
అన్యాయంగా కూలదోసినప్పుడు రామోజీరావు అద్భుత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. ఆ సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. అయినా రామోజీరావు వెనకడుగు వేయలేదు. అప్రజాస్వామిక పోకడలను దృఢంగా ఎదుర్కొన్నారు.
రామోజీరావుతో ముచ్చటించి, ఆయనకున్న అపార జ్ఞానంతో ప్రయోజనం పొందే అవకాశాలు నాకు అనేకసార్లు వచ్చాయి. వివిధ అంశాలపై ఆయనకున్న అభిప్రాయాలకు నేను ఎనలేని విలువనిచ్చా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన వద్ద విలువైన సలహాలు, సూచనలు తీసుకునేవాడిని. గుజరాత్‌లో సుపరిపాలన అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఎప్పుడూ ఉత్సుకత చూపేవారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్యపై ఎక్కువ దృష్టిపెట్టేవారు. 2010లో ఒకసారి ఆయన నన్ను రామోజీ ఫిల్మ్ సిటీకి ఆహ్వానించారు. ఆ సందర్భంలో ఆయనతో ముచ్చటించినప్పుడు.. గుజరాత్‌లో చిన్నారుల విశ్వవిద్యాలయ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆసక్తి ప్రదర్శించారు. అది కనీవినీ ఎరుగని ఆలోచన అని కితాబిచ్చారు. ఆయన నుంచి ఎప్పుడూ తిరుగులేని ప్రోత్సాహం, మద్దతు లభించేది. ఎప్పుడూ నా యోగక్షేమాల గురించి ఆరా తీసేవారు. 2012లో గుజరాత్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా నేను ఎన్నికైనప్పుడు.. తన సంతోషాన్ని వ్యక్తంచేస్తూ ఒక హృద్యమైన లేఖను ఆయన నాకు రాశారు.
మేం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు రామోజీరావు గట్టి మద్దతుదారుగా నిలిచారు. వ్యక్తిగతంగాను, తన మీడియా నెట్‌వర్క్ ద్వారానూ ఆయన తోడ్పాటు అందించారు. రామోజీరావు వంటి దిగ్గజాల సాయం వల్లే.. మహాత్మా గాంధీ కలను రికార్డు సమయంలో నెరవేర్చగలిగాం.
రామోజీరావుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించింది మా ప్రభుత్వమే కావడం మాకు గర్వకారణం. ఆయనలోని ధైర్యసాహసాలు, ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యం, అంకితభావం వంటి గొప్ప లక్షణాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. అవరోధాలను అవకాశాలుగా, సవాళ్లను విజయాలుగా, వైఫల్యాలను గెలుపునకు పునాదులుగా ఎలా మలచుకోవాలో ఆయన జీవితం నుంచి యువతరం నేర్చుకోవచ్చు.
కొన్నిరోజులుగా రామోజీరావు అస్వస్థులుగా ఉన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీసేవాడిని. ఇటు కేంద్రంలో, అటు ఏపీలో నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పడటం చూసి ఆయన సంతోషించి ఉండేవారు. ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. రామోజీరావు ఎప్పటికీ ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోతారు.