పీఎం-కిసాన్‌’ పథకం 13వ విడత కింద రూ.16,000 కోట్లు విడుదల;
నవీకృత బెళగావి రైల్వే స్టేషన్ భవనం జాతికి అంకితం;
జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ఆరు బహుళ-గ్రామీణ పథకాలకుశంకుస్థాపన;“నేటి పరివర్తనాత్మక భారతంలో అణగారినవర్గాలకు ప్రాధాన్యంతోఒకదాని వెంట మరొకటిగా అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి”;
“దేశంలో 2014కు ముందు వ్యవసాయ బడ్జెట్‌రూ.25వేల కోట్లు..ఇప్పుడు ఐదు రెట్లు పెంపుతో రూ.1,25,000 కోట్లకు పెంపు”;
“భవిష్యత్‌ సవాళ్లను విశ్లేషిస్తూవ్యవసాయ రంగాన్నిబలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది”;
“శరవేగంతో ప్రగతి పయనానికి రెండుఇంజన్ల ప్రభుత్వమే ఒక హామీ”;“ఖర్గే గారుకాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు... కానీ, ఆయనకు లభిస్తున్న
గౌరవం చూస్తే అసలు పగ్గాలు ఎవరిచేతిలో ఉన్నదీ స్పష్టమవుతోంది”;“సదుద్దేశంతో పనులు చేపడితే అసలైనఅభివృద్ధి సాధ్యమవుతుంది”
వలసపాలనపై యుద్ధభేరి మోగించిన వీరనారి, కిత్తూరు రాణి చెన్నమ్మను, విప్లవ వీరుడు సంగొల్లి రాయన్నను నేటికీ స్మరించుకునే గడ్డగా బెళగావిని ప్రధాని అభివర్ణించారు
“బెళగావికి రావడం తీర్థయాత్రతో సమానం” అని ప్రధాని వ్యాఖ్యానించారు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలోని బెళగావిలో రూ.2,700 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనతోపాటు మరికొన్నిటిని జాతికి అంకితం చేశారు. అలాగే ‘పీఎం-కిసాన్‌’ పథకం 13వ విడత కింద రూ.16,000 కోట్లు విడుదల చేశారు. అంతేకాకుండా నవీకృత బెళగావి రైల్వే స్టేషన్ భవనాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. అటుపైన జల్ జీవన్‌ మిషన్‌ కింద ఆరు బహుళ-గ్రామీణ పథకాలకు శంకుస్థాపన కూడా చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ- బెళగావి ప్ర‌జ‌ల అసమాన ప్రేమ, ఆశీర్వాదాలతో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమానికి మరింత కృషి చేసేలా ప్రేరణ లభిస్తుందని, ఇది తమ శక్తిసామర్థ్యాలకు మూలం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. “బెళగావికి రావడం తీర్థయాత్రతో సమానం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. వలసపాలనపై యుద్ధభేరి మోగించిన వీరనారి, కిత్తూరు రాణి చెన్నమ్మను, విప్లవ వీరుడు సంగొల్లి రాయన్నను నేటికీ స్మరించుకునే గడ్డగా బెళగావిని ప్రధాని అభివర్ణించారు.

దేశ భవిష్యత్తు దిశగా బెళగావి పాత్రను ప్రధానమంత్రి గుర్తుచేస్తూ- నేటి భార‌త‌ పున‌రుజ్జీవ‌న పోరాటంలోనూ దానికి స్థానం లభిస్తుందని పేర్కొన్నారు. కర్ణాటక అంకుర సంస్కృతితో సారూప్యాన్ని వివరిస్తూ, వందేళ్ల కిందటే బెళగావి అంకుర సంస్థలకు నిలయంగా ఉండేదన్నారు. ఈ మేరకు బెళగావిని వివిధ పరిశ్రమల కూడలిగా తీర్చిదిద్దిన బాబూరావు పుసల్కర్‌ను ఈ సందర్భంగా ఉదాహరించారు. ప్రస్తుత దశాబ్దంలో బెళగావి పాత్రను మరింత బలోపేతం చేయడంపై రెండు ఇంజన్ల ప్రభుత్వ ఆకాంక్షలను ప్రధాని ఉద్ఘాటించారు. బెళగావిలో ఇవాళ ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ- ఇది బెళగావి అభివృద్ధిలో కొత్త శ‌క్తిని, వేగాన్ని తెస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అనుసంధానం, నీటి సదుపాయాలతో ముడిపడిన రూ.వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు రూపుదాల్చనుండటంపై ఈ ప్రాంత పౌరులకు ఆయన అభినందనలు తెలిపారు.

బెళగావి ద్వారా దేశంలోని ప్రతి రైతుకూ ప్రత్యేక బహుమతి లభించిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ మేరకు అక్కడి నుంచి ‘పీఎం-కిసాన్‌’ పథకం కింద మరో విడత నిధులు విడుదలయ్యాయని ప్రధాని చెప్పారు. “ఒక్క బటన్ నొక్కడం ద్వారా దేశంలో కోట్లాది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.16,000 కోట్లు బదిలీ అయ్యాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. దళారుల ప్రమేయమేదీ లేకుండా ఇంత భారీగా నిధులు బదిలీ చేయడం ప్రపంచవ్యాప్త ప్రజానీకం దృష్టిని కూడా ఆకర్షించిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనలో పరిస్థితులను ప్రస్తావిస్తూ- ప్రభుత్వం వెచ్చించే ప్రతి రూపాయిలో పేదలకు కేవలం 15 పైసలు మాత్రమే చేరుతున్నదని సాక్షాత్తూ ఆ పార్టీ ప్రధానమంత్రే చెప్పారని గుర్తుచేశారు. “కానీ, ఇది మోదీ ప్రభుత్వం. ప్రతి పైసా మీదే.. కేవలం మీ కోసమే” అని ప్రధాని వివరించారు. దేశంలోని రైతులందరికీ అత్యంత సుసంపన్న హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ, పండుగకు ముందు వారికి ప్రత్యేక బహుమతి లభించిందన్నారు. నేటి పరివర్తనాత్మక భారతంలో అణగారిన వర్గాలకు ప్రాధాన్యంతో ఒకదాని వెంట మరొకటిగా అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని ప్రధాని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం చిన్న రైతులకు ప్రాధాన్యమిస్తోందని, ‘పీఎం కిసాన్‌’ సమ్మాన్‌ నిధి ద్వారా చిన్న రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.2.5 లక్షల కోట్లు జమ చేశామన్నారు. ఇందులో రూ.50 వేల కోట్లకుపైగా మహిళా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. ఈ డబ్బుతో రైతుల స్వల్ప-అదే సమయంలో క్లిష్ట సమస్యలు తీరుతున్నాయని ప్రధాని చెప్పారు.

దేశంలో 2014కు ముందు రూ.25,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్ ఇప్పుడు ఐదు రెట్లు పెరిగి, నేడు రూ.1,25,000 కోట్లకు చేరిందని ప్రధాని పునరుద్ఘాటించారు. దేశంలోని రైతులను ఆదుకోవడంలో బీజేపీ ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. రైతుకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే సాంకేతిక పరిజ్ఞాన వినియోగం గురించి ప్రస్తావిస్తూ- జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్లు, ఆధార్‌ను ఆయన ఉదాహరించారు. రైతుకు ఏ దశలోనైనా బ్యాంకు సాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం వారిని కిసాన్ క్రెడిట్ కార్డులతో అనుసంధానిస్తున్నదని ఆయన వివరించారు. వ్యవసాయానికి సంబంధించి ప్రస్తుత సమస్యల పరిష్కారంతోపాటు భవిష్యత్తు అవసరాలను కూడా ఈ ఏడాది బడ్జెట్‌ తీరుస్తుందని ప్రధాని వెల్లడించారు. సాగు వ్యయం తగ్గింపు, పంట నిల్వ, చిన్న రైతులను సంఘటితం చేయడం వంటివి నేటి అవసరాలని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ బడ్జెట్‌లో నిల్వ సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు సహకార సంఘాలపై దృష్టి సారిస్తోందని తెలిపారు. మరోవైపు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారిస్తే రైతుకు ఖర్చులు తగ్గుతాయన్నారు. అలాగే ‘పీఎం ప్రాణం’ పథకం వంటి చర్యలు ఎరువులపై ఖర్చును మరింత తగ్గిస్తాయని వివరించారు.

“భ“భవిష్యత్‌ సవాళ్లను విశ్లేషిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది” అని ప్రధానమంత్రి ప్రకటించారు. వాతావరణ మార్పు సమస్యను ప్రస్తావిస్తూ- మన సంప్రదాయ ముతక తృణధాన్యాలు, చిరుధాన్యాల శక్తిని పునరుజ్జీవం కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కిచెప్పారు. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకోగల శక్తి ఈ పంటలకు ఉందని స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ- ముతక తృణ ధాన్యాలకు ‘శ్రీ అన్న’గా కొత్త గుర్తింపును ప్రతిపాదించిందని గుర్తుచేశారు. దేశంలో కర్ణాటక రాష్ట్రం చిరుధాన్యాలకు కేంద్రంగా ఉన్నదని, ఈ ప్రాంతాల్లో ‘శ్రీ అన్న’ను ‘శ్రీ ధాన్య’గా వ్యవహరిస్తారని, ఇక్కడి రైతులు వివిధ రకాల ‘శ్రీ అన్న’ పంటలు పండిస్తారని పేర్కొన్నారు. లోగడ బి.ఎస్‌.యడ్యూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం ‘శ్రీ అన్న’ సాగును ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రధాని గుర్తుచేశారు. ఇప్పుడు మనం ప్రపంచం దృష్టికి వీటివైపు మళ్లించాల్సి ఉందన్నారు. ‘శ్రీ అన్న’ సాగు ప్రయోజనాలను వివరిస్తూ, తక్కువ నీటితో ఏ వాతావరణంలోనైనా పండించే ఈ పంటల వల్ల రైతులకూ రెట్టింపు లబ్ధి చేకూరుగలదని తెలిపారు.

ర్ణాటకలో చెరకు ఒక ప్రధాన పంటగా ఉన్న నేపథ్యంలో చెరకు రైతుల అవసరాల గురించి ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. సహకార రంగంలో చెరకు రైతుకు 2016-17కు మునుపటి బకాయిల చెల్లింపుపై పన్ను రాయితీ కల్పిస్తూ ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు చేయడాన్ని ఆయన గుర్తుచేశారు. దీనివల్ల సహకార సంఘాలకు రూ.10 వేల కోట్ల మేర ఊరటనిస్తుందని చెప్పారు. ఇక ఇంధనంలో ఇథనాల్ మిశ్రమం దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ- చెరకు రైతుల ఆదాయం పెంపులో ఇథనాల్‌ ఉత్పత్తి తోడ్పడగలదని ప్రధానమంత్రి అన్నారు. గత 9 ఏళ్లలో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 1.5 శాతం నుంచి 10 శాతానికి పెరిగిందని, మరోవైపు దీన్ని 20 శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.

నుసంధానం మెరుగుతోనే వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యా రంగాలు బలోపేతం కాగలవని ప్రధాని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో 2014కు ముందు ఐదేళ్ల వ్యవధిలో రైల్వేలకు సంబంధించి బడ్జెట్ రూ.4,000 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.7,500 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు రూ.45 వేల కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బెళగావిలో కొత్తగా ప్రారంభించిన ఆధునిక రైల్వే స్టేషన్‌ గురించి ప్రస్తావిస్తూ- సౌకర్యాలకు ఊపునివ్వడం మాత్రమేగాక రైల్వేలపై నమ్మకం కూడా పెరుగుతున్నదని ప్రధాని అన్నారు. “కర్ణాటకలోని అనేక స్టేషన్లు ఇప్పుడు ఇదే తరహాలో ఆధునిక రూపు సంతరించుకుంటున్నాయి” అని ఆయన చెప్పారు. లోండా-ఘ‌ట్‌ప్ర‌భ రైలుమార్గం డ‌బ్లింగ్తో ప్ర‌యాణం వేగవంతం, సురక్షితం కాగలదని ప్ర‌ధాని అన్నారు. విద్య, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణకు బెళగావి ఓ కీలక కూడలి కాగా, మెరుగైన రైల్వే సంధానంతో ఈ రంగాలకు చేయూత లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

“వేగవంతమైన అభివృద్ధి రెండు ఇంజన్ల ప్రభుత్వమే ఒక హామీ అని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మేరకు జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రగతిని ప్రస్తావిస్తూ- కర్ణాటకలోని గ్రామాల్లో 2019కి ముందు కేవలం 25 శాతం గృహాలకు మాత్రమే కొళాయి కనెక్షన్లు ఉండేవని గుర్తుచేశారు. కానీ, నేడు పరిస్థితి పూర్తిగా మారిందని, 60 శాతం ఇళ్లకు ఇప్పుడు కొళాయిల ద్వారా నీరు అందుతున్నదని పేర్కొన్నారు. బెళగావి విషయంలో లోగడ 2 లక్షలకన్నా తక్కువ ఇళ్లకు మాత్రమే కొళాయి నీరు వస్తుండగా, ఇవాళ 4.5 లక్షల గృహాలకు సరఫరా అవుతున్నట్లు తెలిపారు. కాగా, ఈసారి బడ్జెట్‌లో ఈ కార్యక్రమం కోసం రూ.60 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

“గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన సమాజంలోని ప్రతి చిన్న వర్గానికి సాధికారత కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది” అని ప్రధానమంత్రి తెలిపారు. బెళగావి అనేది ‘వేణుగ్రామ్’.. అంటే- వెదురు గ్రామంగా ప్రసిద్ధి చెందినదని, ఇది కళాకారులు-చేతివృత్తుల వారి పట్టణంగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. అయితే, గత ప్రభుత్వాలు చాలాకాలం పాటు వెదురు సాగును నిషేధించాయని, అయితే ప్రస్తుత ప్రభుత్వం చట్టాన్ని సంస్కరించి సాగుతోపాటు వ్యాపారానికి బాటలు వేసిందని చెప్పారు. కళాకారులు-చేతివృత్తుల వారికి మద్దతుగా ఈ సంవత్సరం బడ్జెట్‌లో తొలిసారి ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.

ర్ణాటక నాయకులకు అమర్యాద కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో ఆనవాయితీగా ఉండేదని ప్రధాని ఎత్తిచూపారు. “ఎస్.నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్ వంటి నాయకులు ‘కాంగ్రెస్ కుటుంబం’ చేతిలో ఎంత ఘోరంగా అవమానాల పాలయ్యారో చరిత్రే ప్రత్యక్ష సాక్ష్యమిస్తుంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రస్తుత తరంలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే అంటే తనకెంతో గౌరవాదరాలు ఉన్నాయని ప్రధాని అన్నారు. ప్రజాసేవపై ఆయనకుగల అంకితభావాన్ని ప్రస్తావిస్తూ- ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ కార్యక్రమం సందర్భంగా మండుటెండలో ఆయనకు కనీసం ఒక గొడుగు కూడా తెచ్చి ఇవ్వలేదని గుర్తుచేశారు. పార్టీలో అత్యంత సీనియర్ సభ్యుడైన ఆయన కనీసం అందుకు కూడా అర్హులు కారా! అంటూ విచారం వెలిబుచ్చారు. “ఖర్గే గారు కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షులేనని ప్రపంచమంతటికీ తెలుసు. కానీ, ఆయనకు లభిస్తున్న గౌరవం చూస్తే అసలు పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నదీ స్పష్టమవుతోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ‘బంధుప్రీతి’కి పెద్దపీట వేస్తున్నాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ జాడ్యం నుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. ఆ మేరకు కాంగ్రెస్ వంటి పార్టీల విషయంలో కర్ణాటక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

చివరగా- “సదుదేశంతో పనిచేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది” అని ప్రధాని అన్నారు. రెండు ఇంజన్ల ప్రభుత్వ సదుద్దేశాలను, అభివృద్ధిపై దాని నిబద్ధతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. “కర్ణాటకతోపాటు దేశాభివృద్ధిని వేగిరపరచేందుకు సమష్టి కృషితో ముందడుగు వేయాలి” అని ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బస్వరాజ్ బొమ్మై, కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, వ్యవసాయ- రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజేసహా రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

దేశంలోని రైతులపట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకుంటూ- పీఎం-కిసాన్‌ పథకం కింద రూ.16వేల కోట్ల మేర 13వ విడత నిధులను 8 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లోకి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రధానమంత్రి జమచేశారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు రూ.2000 చొప్పున మూడు వాయిదాలలో సంవత్సరానికి రూ.6000 మేర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇక్కడి కార్యక్రమాల్లో భాగంగా నవీకృత బెళగావి రైల్వే స్టేష‌న్ భ‌వ‌నాన్ని ప్ర‌ధాని జాతికి అంకితం చేశారు. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల కల్పన లక్ష్యంగా సుమారు రూ.190 కోట్లతో ఈ స్టేషన్‌ పునరాభివృద్ధి చేయబడింది. అలాగే బెళగావి వద్ద లోండా-బెళగావి-ఘటప్రభ సెక్షన్ మధ్య రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దాదాపు రూ.930 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో ముంబై-పుణె-హుబ్బళ్లి-బెంగళూరు మార్గం సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో వాణిజ్య, వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు పెరిగేందుకు దోహదపడుతుంది. మరోవైపు జల్ జీవన్ మిషన్ బెళగావిలో ఆరు బహుళ గ్రామ పథకాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.1585 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుల ద్వారా 315కుపైగా గ్రామాల్లోని 8.8 లక్షల మంది ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుంది.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi