చైనా లో అకస్మాత్తుగా కరోనా వైరస్ చెలరేగిన అంశం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశించిన మీదట ప్రధాన మంత్రి యొక్క ప్రిన్సిపల్ సెక్రటరి డాక్టర్ పి.కె. మిశ్రా ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి అధ్యక్షత వహించారు.
కరోనా వైరస్ యొక్క వ్యాప్తి కి సంబంధించి ఇటీవలి పరిణామాలు, సన్నాహక మరియ ప్రతిస్పందన పూర్వక చర్యల ను గురించి అధికారులు ఈ సమావేశం లో ప్రిన్సిపల్ సెక్రటరి దృష్టి కి తీసుకువచ్చారు.
ఆసుపత్రులు మరియ ప్రయోగశాల ల సన్నద్ధత ను గురించి, శీఘ్ర ప్రతిస్పందన బృందాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టిన చర్య లను గురించి, అలాగే తీసుకొన్న విస్తృత స్థాయి సంరక్షక చర్య లను గురించి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కి వివరించింది.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వంటి ఇతర మంత్రిత్వ శాఖ లు చేపట్టిన నివారక చర్యల ను గురించి కూడా ప్రిన్సిపల్ సెక్రటరి సమీక్షించారు.
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివిధ అన్య కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల తో సన్నిహిత సమన్వయం తో కలసి పరిస్థితి ని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరి కి తెలియజేశారు.
ఇంతవరకు, 7 అంతర్జాతీయ విమానాశ్రయాల లో 115 విమాన సర్వీసుల కు చెందినటువంటి 20,000 మంది కి వివిధ పరీక్షలను నిర్వహించడం జరిగింది. వైరస్ సంబంధిత పరీక్షలు నిర్వహించేందుకు దేశవ్యాప్తం గా నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రయోగశాల లు పూర్తి స్థాయి లో సన్నద్ధం అయ్యాయి. అన్ని రాష్ట్రాల మరియు జిల్లా ల ఆరోగ్య విభాగాధికారుల ను అప్రమత్తం చేసి అవసరమైతే సేవలను అందించాలని తగిన సూచన లు చేయడమైంది.
కేబినెట్ సెక్రటరి శ్రీ రాజీవ్ గౌబా, దేశీయ వ్యవహారాల కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా, విదేశీ వ్యవహారాల కార్యదర్శి శ్రీ విజయ్ గోఖలే, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ కార్యదర్శి ప్రీతి సూదన్, పౌర విమానయాన కార్యదర్శి శ్రీ ప్రదీప్ సింహ్ ఖరోలా సహా అనేక మంది ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.