ఢిల్లీ లో, హరియాణా లో, పంజాబ్ రాష్ట్రాల లో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకొన్న చర్యల పై ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా మరొక్కమారు ఈ రోజు న సమీక్ష ను నిర్వహించారు. ఈ రాష్ట్రాల లో గడచిన 24 గంటల కాలం లో చేపట్టిన అదనపు చర్యల వివరాల ను డాక్టర్ మిశ్రా అడిగి తెలుసుకోగోరారు.
హాట్ స్పాట్ లను గుర్తించిన వివిధ జిల్లాల లో నెలకొన్న పరిస్థితి ని తాను డిప్యూటీ కమిశనర్ ల సహాయం తో వ్యక్తిగతం గా పర్యవేక్షిస్తున్నట్లు పంజాబ్ ప్రధాన కార్యదర్శి తెలిపారు. 1981వ సంవత్సరం నాటి వాయు (కాలుష్యం యొక్క నిరోధం మరియు నియంత్రణ) చట్టాన్ని అతిక్రమించినందుకు ఎఫ్ఐఆర్ లను కూడా నమోదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ చట్టాన్ని ఉల్లంఘించిన ఘటన లలో అవసరమైన జరిమానాల ను విధించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యల ను తీసుకొంటోంది.
హరియాణా లో గడ్డి దుబ్బుల ను తగులబెట్టే ఘటనల ను తగ్గించవలసింది గా సంబంధిత పక్షాలన్నిటి కి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు హరియాణా ప్రధాన కార్యదర్శి చెప్పారు. వాయు కాలుష్యం కేసుల ను నియంత్రించడం కోసం బృందాలు 24 గంటల ప్రాతిపదిక న రంగం లోకి దిగినట్లు ఆమె తెలియ జేశారు.
ఢిల్లీ ప్రధాన కార్యదర్శి సమావేశం లో పాల్గొని మాట్లాడుతూ, నీళ్ళ ను చిమ్మే ప్రక్రియ ను తీవ్రతరం చేసినట్లు, హాట్ స్పాట్ లను గుర్తించి పరిస్థితి ని చక్కదిద్దడం కోసం కారిడర్ లపై ప్రత్యేకం గా శ్రద్ధ వహించడం జరుగుతోందన్నారు. ఆరుబయలు ప్రదేశాల లో చెత్త చెదారం పారబోయడం ఆగిపోయిందని, ఈ నియమాల ఉల్లంఘిస్తే అటువంటి వారి వద్ద నుండి గరిష్ఠ మొత్తం లో అపరాధ రుసుము ను విధించడమే కాక ఆ మేరకు రుసుము ను వసూలు చేయడం కూడా జరుగుతోందని తెలిపారు.
రాగల కొద్ది రోజుల కాలం లో వాతావరణ పరిస్థితులు అనుకూలం గా ఉండేందుకు ఆస్కారం ఉందని భారత వాతావరణ అధ్యయన విభాగం సూచన చేసింది.
ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ, అవసరమైన చోట్ల ముందస్తు నిరోధక చర్యల ను చేపట్టడానికి ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. సత్వర చర్యల కు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి పలికారు. ఈ కృషి లో పాలు పంచుకొంటున్న సంబంధిత వర్గాలన్నిటి ప్రయత్నాల ను ఆయన ప్రశంసించారు.
స్వల్ప కాల చర్యల ను తీసుకొన్న అనంతరం శాశ్వతమైనటువంటి దీర్ఘ కాల పరిష్కారానికై ఒక వ్యవస్థ ను నెలకొల్పడం జరుగుతుందని ఆయన చెప్పారు.
ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ అడ్వయిజర్ గా ఉన్న శ్రీ పి.కె. సిన్హా, కేబినెట్ కార్యదర్శి, పర్యావరణం, అడవులు మరియు జల వాయు పరివర్తన కార్యదర్శి, వ్యవసాయ కార్యదర్శి, కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి చైర్‌మన్, భారత వాతావరణ అధ్యయన విభాగం డైరెక్టర్ జనరల్ లతో పాటు పంజాబ్, హరియాణా, ఇంకా ఢిల్లీ ల ప్రధాన కార్యదర్శులు మరియు ఇతర సీనియర్ అధిరారులు కూడా ఈ సమావేశాని కి హాజరయ్యారు.