యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ ఆహ్వానించిన మీదట నేను 2021 సెప్టెంబర్ 22-25 తేదీ ల మధ్య కాలం లో యుఎస్ఎ ను సందర్శించనున్నాను.
నా సందర్శన కాలం లో, నేను భారతదేశం-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అధ్యక్షుడు శ్రీ బైడెన్ తో నేను సమీక్షించనున్నాను. పరస్పర ప్రయోజనం ముడిపడ్డ ప్రాంతీయ అంశాల పై, ప్రపంచ అంశాల పై మేం ఒకరి అభిప్రాయాల ను మరొకరికి వెల్లడించుకొంటాము. ఉభయ దేశాల మధ్య సహకారాని కి గల అవకాశాల ను, మరీ ముఖ్యం గా విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం రంగం లో సహకారాని కి ఉన్న అవకాశాల ను పరిశీలించడం కోసం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గారి తో సమావేశం కావడానికి కూడా నేను ఎదురు చూస్తూ ఉన్నాను.
అధ్యక్షుడు శ్రీ బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని శ్రీ యోశీహిదే సుగా లతో నేను కూడా కలసి, క్వాడ్ లీడర్స్ సమిట్ లో పాలుపంచుకోబోతున్నాను. ఇది నేత లు స్వయంగా పాల్గొంటున్న ఒకటో క్వాడ్ లీడర్స్ సమిట్ కానున్నది. ఈ సంవత్సరం మార్చి నెల లో వర్చువల్ మాధ్యమం ద్వారా జరిగిన మా శిఖర సమ్మేళనం తాలూకు ఫలితాల ను నిశితం గా పరిశీలించడానికి, ఇండో-పసిఫిక్ రీజియన్ పట్ల మా ఉమ్మడి దృష్టి కోణం ప్రాతిపదిక గా భావి కార్యక్రమాల కు ప్రాధాన్యాల ను కూడా గుర్తించడానికి ఈ సమిట్ ఒక అవకాశాన్ని అందిస్తోంది.
ఆస్ట్రేలియా, జపాన్ లతో దృఢమైన ద్వైపాక్షిక సంబంధాల ను నిశితం గా పరిశీలించడానికి, అలాగే ప్రాంతీయ అంశాల పైన, ప్రపంచ అంశాల పైన మా అభిప్రాయాల ను ఉపయోగకరమైన రీతి లో వెల్లడి చేసుకోవడానికి ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ మారిసన్ తో, జపాన్ ప్రధాని శ్రీ సుగా తో నేను భేటీ కానున్నాను.
కోవిడ్ -19 మహమ్మారి, ఉగ్రవాదం తో పోరాడవలసిన ఆవశ్యకత, జలవాయు పరివర్తన, ఇంకా ఇతర ముఖ్య అంశాలు సహా ప్రస్తుతం ప్రపంచానికి సవాలు గా నిలచిన అత్యవసర అంశాల పై దృష్టి పెడుతూ ఐక్య రాజ్య సమితి సాధారణ సభ లో ఒక ప్రసంగం తో నేను నా సందర్శన ను ముగిస్తాను.
యుఎస్ఎ తో సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి, మన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు అయిన జపాన్ తో, ఆస్ట్రేలియా తో సంబంధాల ను మరింత గా సమన్వయం చేసుకోవడానికి, అలాగే ముఖ్యమైన ప్రపంచ అంశాల పైన మా మధ్య గల సహకారాన్ని పెంపొందించుకోవడానికి యుఎస్ కు నా సందర్శన ఒక అవకాశాన్ని ఇవ్వగలదు.