రష్యా లో నిన్న జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ విజేతగా నిలచినందుకు గాను ఆయనను అభినందించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ లో శ్రీ పుతిన్ తో మాట్లాడారు. శ్రీ పుతిన్ కు ప్రధాన మంత్రి తన అభినందనలను తెలుపుతూ భారతదేశానికి, రష్యన్ ఫెడరేశన్ కు మధ్య నెలకొన్న ‘ప్రత్యేకమైన మరియు విశేషాధికారం కల వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం’ శ్రీ పుతిన్ నాయకత్వంలో మరింత బలోపేతం అయ్యే దిశగా పయనిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలోనే జరుగనున్న వార్షిక శిఖర సమ్మేళనానికై అధ్యక్షులు శ్రీ పుతిన్ ను భారతదేశానికి ఆహ్వానించేందుకు తాను ఎదురు చూస్తున్నానని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి తనతో ఫోన్ లో మాట్లాడినందుకు అధ్యక్షులు శ్రీ పుతిన్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం- రష్యా సంబంధాలను అన్ని రంగాలలో దృఢతరంగా మలచేందుకు తన వచనబద్ధతను శ్రీ పుతిన్ ప్రకటించారు. అలాగే, భారతదేశం మరియు భారతీయులు ప్రగతి పథంలో ముందుకు సాగుతూ ఉండాలంటూ శ్రీ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు.