ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు (2018 డిసెంబరు 29న) ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ, ఘాజీపూర్ పట్టణాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా వారాణసీ లో 6వ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (IRRI), దక్షిణ ఆసియా ప్రాంతీయ కేంద్రం (ISARC) ప్రాంగణాన్ని జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత ‘‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’’ పేరిట దీనదయాళ్ హస్తకళా సముదాయం లో నిర్వహించే ప్రాంతీయ సదస్సుకు హాజరవుతారు. ఈ కార్యక్రమం అనంతరం ఘాజీపుర్ వెళ్లి, అక్కడ మహారాజా సుహేల్ దేవ్ స్మారక తపాలా బిళ్లను ప్రధాన మంత్రి ఆవిష్కరించి, అటుపైన ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభ లో ప్రసంగిస్తారు.
వారణాసిలోని జాతీయ విత్తన పరిశోధన-శిక్షణ కేంద్ర (NSRTC) ప్రాంగణం లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ, దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రాన్ని ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. దక్షిణ ఆసియా ప్రాంత (SAARC) దేశాల్లో వరి పరిశోధన–శిక్షణ కార్యకలాపాలకు ఈ కేంద్రం ఒక కూడలి గా పని చేస్తుంది. తూర్పు భారతదేశం లోని ఈ తొలి అంతర్జాతీయ కేంద్రం ఈ ప్రాంతం లో వరి ఉత్పాదన ను స్థిరీకరించి, నిలదొక్కుకునేలా చేయడం లో ప్రధాన పాత్ర పోషించనుంది.
అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం తో భారత దేశానికి 1960 నుంచి సత్సంబంధాలున్నాయి. కాగా, ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా లోని ఈ కేంద్రం ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యే కావడం విశేషం. ఈ కేంద్రాన్ని 2017 నవంబర్ లో సందర్శించిన సందర్భంగా వ్యవసాయ రంగం లో వినూత్న ఆవిష్కరణ లతో పాటు వరి రంగంలో సాగుతున్న పరిశోధనల గురించి అక్కడి శాస్త్రవేత్తలు, అధికారుల తో ఆయన చర్చించారు.
వారాణసీ లోని దీనదయాళ్ హస్తకళా సముదాయం (వాణిజ్య సౌలభ్య కేంద్రం & హస్తకళా ప్రదర్శనశాల)లో ‘‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’’ పేరిట నిర్వహించే ప్రాంతీయ సదస్సు కు శ్రీ మోదీ హాజరవుతారు. స్థానిక ప్రజల హస్తకళా నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం ‘‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అదే సమయంలో రాష్ట్రం లోని చిన్న జిల్లాలు, పట్టణాలకు దేశీయ వ్యాపారాలను చేరువచేసి వారి ఉత్పత్తులు, హస్తకళాకృతులు, ఇతర వస్తువుల విక్రయాలకు వీలు కల్పించాలన్నది ఈ పథకం ప్రధానోద్దేశం. ఆహార శుద్ధి-తయారీ, హస్తకళాకృతులు, ఇంజనీరింగ్ వస్తువులు, తివాచీలు, చర్మ వస్తువులు, రెడీమేడ్ దుస్తులు వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటాయి. వీటి విక్రయాల ద్వారా విదేశీ మారక ద్రవ్యం సమకూరడమే గాక, ప్రజలకు ఉపాధి కూడా లభిస్తుంది.