ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాగల రెండు రోజులలో గుజరాత్ మరియు తమిళ నాడు రాష్ట్రాలతో పాటు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు.. దమన్ & దివు లోను, ఇంకా పాండిచ్చేరి లోను పర్యటించనున్నారు.
ప్రధాన మంత్రి శనివారం నాడు దమన్ కు చేరుకొంటారు. ఆయన వేరు వేరు అభివృద్ధి పథకాలను ప్రారంభించి, వివిధ ఆధికారిక పథకాల లబ్దిదారులకు ధ్రువ పత్రాలను అందజేస్తారు. ఒక జన సభలో ఆయన ప్రసంగిస్తారు.
అటు నుండి ప్రధాన మంత్రి తమిళనాడు కు పయనమవుతారు. చెన్నై లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం అయినటువంటి ‘అమ్మ ద్విచక్ర వాహన పథకా’న్ని ప్రారంభసూచకంగా ఏర్పాటయ్యే ఒక కార్యక్రమానికి ఆయన హాజరవుతారు.
ఆదివారం నాడు, ప్రధాన మంత్రి పాండిచ్చేరి ని సందర్శిస్తారు. అరబిందో ఆశ్రమంలో శ్రీ అరవిందుల వారికి ఆయన పుష్పాంజలి ఘటించిన అనంతరం ‘శ్రీ అరబిందో ఇంటర్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్’ విద్యార్థులతో మాట్లాడుతారు. శ్రీ నరేంద్ర మోదీ ఆరోవిల్లే ను కూడా సందర్శిస్తారు. ఆరోవిల్లే స్వర్ణోత్సవాల సూచకంగా ఒక స్మారక తపాలా బిళ్ళను ఆయన విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం చేస్తారు.
పాండిచ్చేరి లో ఒక జన సభను ఉద్దేశించి కూడా ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.
ఆదివారం సాయంత్రానికల్లా ప్రధాన మంత్రి ‘‘రన్ ఫర్ న్యూ ఇండియా మారథన్’’ కు పచ్చ జెండా ను చూపేందుకుగాను గుజరాత్ లోని సూరత్ కు వెళ్తారు.