ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు బ్యాంకాక్ లో ఈస్ట్ ఏశియా సమిట్ లో మరియు ఆర్‌సిఇపి సమిట్ లో పాలు పంచుకోనున్నారు. ఆయన నేటి రాత్రి ఢిల్లీ కి తిరుగు ప్రయాణమయ్యే లోపు, జపాన్ ప్రధాని శ్రీ శింజో ఆబే, వియత్నామ్ ప్రధాని శ్రీ ఎన్గుయెన్ జువాన్ ఫుక్ లతో పాటు, ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ లతో కూడా సమావేశాల లో పాల్గొననున్నారు.
రీజనల్ కోంప్రిహెన్సివ్ ఇకనామిక్ పార్ట్ నర్ శిప్ (ఆర్‌సిఇపి)లో భారతదేశం యొక్క సంప్రదింపుల కు ప్రధాన మంత్రి సారథ్యం వహించనున్నారు. ఆసియాన్ కు చెందిన స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం భాగస్వామ్య దేశాలు అయినటువంటి ఆస్ట్రేలియా, చైనా, జపాన్, కొరియా, న్యూజిలాండ్, ఇంకా భారతదేశం లకు మరియు 10 ఆసియాన్ సభ్యత్వ దేశాల కు మధ్య సమాలోచనలు జరుగుతున్నటువంటి ఒక సంపూర్ణ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్నే ఆర్‌సిఇపి గా వ్యవహరిస్తున్నారు.
ఆర్‌సిఇపి వ్యాపార ఒప్పందం లో చేరేందుకు భారతదేశం విముఖం గా ఉందన్న అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్రోసిపుచ్చదలచుకొన్నారు. బ్యాంకాక్ పోస్ట్ కు ఆయన ఇచ్చిన ఒక విస్తృతమైన ఇంటర్వ్యూ లో భారతదేశం ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్‌సిఇపి సంప్రదింపుల లో ఒక సంపూర్ణమైన మరియు సమతుల్యత కలిగిన ఫలితం కోసం కంకణం కట్టుకొందని, అయితే అందరి కీ విజయాలు దక్కేటట్లుగా ఈ పరిణామం ఉండాలని భారతదేశం కోరుకొంటోందని స్పష్టం చేశారు.
అస్థిర వ్యాపార లోటు ల పట్ల భారతదేశం యొక్క ఆందోళన లను సమాధానపరచడం ముఖ్యం అని ఆయన అన్నారు.
పరస్పర ప్రయోజనకారి కాగలిగే ఆర్‌సిఇపి లో భారత్ తో పాటు సంప్రదింపుల లో పాల్గొంటున్న అన్ని భాగస్వామ్య దేశాల కు మేలు జరుగుతుందన్న అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
కంబోడియా లో 2012వ సంవత్సరం లో ఆరంభమైన ఆర్‌సిఇపి సంప్రదింపుల లో వస్తువులు మరియు సేవల సంబంధిత వ్యాపారం తో పాటు పెట్టుబడి, బజారు అందుబాటు, ఆర్థిక సహకారం, మేధో సంపత్తి మరియు ఇ-కామర్స్ లు భాగం గా ఉండబోతున్నాయి.