ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తొలి ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ ను 2018 జనవరి 31వ తేదీన న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో ప్రారంభిస్తారు.
మన దేశంలో అన్ని క్రీడలకు ఒక బలమైన ఫ్రేమ్ వర్క్ ను అతి కింది స్థాయి నుండి రూపొందించి, భారతదేశాన్ని ఒక గొప్ప క్రీడాదేశంగా ఆవిష్కరించే క్రమంలో క్రీడా సంస్కృతిని ఇండియా లో పునరుద్ధరించడం కోసమే ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని పరిచయం చేస్తున్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా వివిధ విభాగాలలో పాఠశాల స్థాయిలోనే యువ ప్రతిభావంతులను అన్వేషించి, భావి క్రీడావిజేతలుగా వారిని మలచడంలో ఖేలో ఇండియా సహాయపడగలదని ఆశిస్తున్నారు.
ప్రాధాన్యత కలిగినటువంటి క్రీడా విభాగాలలో ప్రతిభాశాల క్రీడాకారులను ఒక అధిక శక్తివంతమైన సంఘం ద్వారా వివిధ దశల్లో గుర్తించి, అటువంటి వారికి 5 లక్షల రూపాయల వార్షిక ఆర్థిక సహాయాన్ని 8 సంవత్సరాల పాటు అందిస్తారు.
ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ను న్యూ ఢిల్లీ లో 2018 జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 8 వ తేదీ వరకు నిర్వహిస్తారు. 16 విభాగాలు.. విలువిద్య, అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, ఖో-ఖో, షూటింగ్, ఈత, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఇంకా మల్లయుద్ధం..లలో భాగం పంచుకోవలసిందిగా 17 ఏళ్ళ లోపు క్రీడాకారులను ఆహ్వానించారు. ఈ ఆటలు భారతదేశం యొక్క యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసి, భారతదేశ క్రీడా సామర్ధ్యాన్ని కళ్ళకు కట్టనున్నాయి.
ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ లో 199 స్వర్ణ పతకాలు, 199 రజత పతకాలు మరియు 275 కాంస్య పతకాలను గెలుచుకొనేందుకు అవకాశం ఉంది. ఈ క్రీడలలో దేశంలోకెల్లా అత్యంత ప్రతిభ కలిగిన 17 ఏళ్ళ లోపు వయస్సు కలిగిన క్రీడాకారులు పోటీ పడనున్నారు.