ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు శుక్రవారం ఫిబ్రవరి 16వ తేదీన వరల్డ్ సస్‌టైనబుల్ డివెలప్‌మెంట్ సమ్మిట్ 2018 సంచిక (డబ్ల్యుఎస్‌డిఎస్ 2018)ని విజ్ఞాన్ భవన్ లో ప్రారంభించనున్నారు. డబ్ల్యుఎస్‌డిఎస్ అనేది ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (టిఇఆర్ఐ) యొక్క ప్రధానమైన వేదిక. సుస్థిరమైన అభివృద్ధి, శక్తి ఇంకా పర్యావరణ రంగాలలో మేధావులను, ప్రపంచ నాయకులను ఒక ఉమ్మడి వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.
ఈ శిఖర సమ్మేళనం కేంద్ర పర్యావరణం, అడవులు మరియు జల, వాయు పరివర్తన శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ను, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కేంద్ర మంత్రి శ్రీ సురేశ్ ప్రభు ను, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్‌దీప్ పురి ని, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ సిన్హా తో పాటు అనేక మంది ప్రముఖులను, ఇంకా కీలక రాజకీయ, కార్పొరేట్ నేతలకు ఆతిథేయిగా వ్యవహరించనుంది.
ఈ సంవత్సర శిఖర సమ్మేళనం ఇతివృత్తం ‘పార్ట్‌నర్‌శిప్స్ ఫర్ ఎ రిజీలియంట్ ప్లానెట్’. జల, వాయు పరివర్తన పూర్వ రంగంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో అత్యవసరంగా ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్ళను పరిష్కరించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని డబ్ల్యుఎస్‌డిఎస్ 2018 తలపెట్టింది. అనేక రకాలైన సమస్యలను ఈ శిఖర సమ్మేళనం చర్చించి పరిష్కరించ దలుస్తోంది. ఈ సమస్యలలో భూ నష్టం నివారణ, నగరాలలో ల్యాండ్ ఫిల్స్ కు చోటు లేకుండా చూడటానికి గాను సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ యంత్రాంగాలు, వాయు కాలుష్యం పై ధీటుగా పోరాడటం, వనరులు మరియు శక్తి సంబంధ సామర్థ్యాన్ని పెంచేందుకు ఏర్పాట్లు, శుభ్రమైన శక్తి దిశగా పరివర్తనకు మార్గం సుగమం చేయడంతో పాటు, సమర్థవంతమైన రీతిలో జల, వాయు పరివర్తన న్యూనీకరణకు అనువైన ఆర్థిక యంత్రాంగాలను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకొనేందుకు వీలుగా ఆధునిక, సాంకేతిక విజ్ఞాన సంబంధ పురోగమనాన్ని కళ్ళకు కట్టేలా డబ్ల్యుఎస్‌డిఎస్ 2018 లో ‘గ్రీనోవేశన్ ఎగ్జిబిషన్’ ను ఏర్పాటు చేస్తారు.
ఈ శిఖర సమ్మేళనంలో ప్రపంచం నలుమూలల నుండి విధాన రూపకర్తలు, పరిశోధకులు, ఆలోచన పరులు, మేధావి వర్గాలు, దౌత్యవేత్తలు, ఇంకా కార్పొరేట్ ప్రముఖులు, 2000 మందికి పైగా ప్రతినిధులు పాలుపంచుకొంటారని ఆశిస్తున్నారు. సర్వ సభ్య సదస్సులలో ప్రముఖులైన అంతర్జాతీయ వక్తలు, భూమి పై, ఆకాశం పై, ఇంకా జలం పై ప్రసరిస్తున్న ప్రభావాన్ని తగ్గించడం సహా రకరకాల సమస్యలపై ప్రసంగాలు చేస్తారు. అంతేకాకుండా, శక్తిని, మరియు వనరులను మరింత ధీటైన విధంగా వినియోగించుకొనేందుకు గల మార్గాలు, సాధనాల పైన కూడా వారు ప్రసంగిస్తారు. సుస్థిర అభివృద్ధి, కర్బన విపణులు మరియు ధరల ఖరారు విధానం, సస్‌టైనబుల్ ట్రాన్స్‌పోర్టు, రెజిలియంట్ సిటీస్, సౌర శక్తి ఇంకా రెఫ్రిజిరెంట్ టెక్నాలజీస్ వంటి డబ్ల్యుఎస్‌డిఎస్ 2018 లో చర్చనీయ అంశాలలో చేరి ఉన్నాయి. డబ్ల్యుఎస్‌డిఎస్ ను ఈసారి న్యూ ఢిల్లీ లో ఫిబ్రవరి 15, 16, & 17వ తేదీలలో ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (టిఇఆర్ఐ) నిర్వహిస్తోంది.