ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ని రేపు లఖ్‌నవూ లో ప్రారంభించనున్నారు. ఈ శిఖర సమ్మేళనానికి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ సురేశ్ ప్రభు, శ్రీ రవి శంకర్ ప్రసాద్, డాక్టర్ హర్ష్ వర్ధన్, శ్రీ వి.కె. సింగ్, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీమతి నిర్మలా సీతారమణ్, శ్రీమతి స్మృతి ఇరానీ లు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరై, రాష్ట్రం లోకి పెట్టుబడును ఆకర్షించేందుకుగాను ఉద్దేశించినటువంటి వివిధ సదస్సులకు అధ్యక్షత వహించనున్నారు. శిఖర సమ్మేళనాన్ని ఫిబ్రవరి 21 నాడు ప్రధాన మంత్రి ప్రారంభించనుండగా, ఈ సమ్మేళనం ముగింపు ఉత్సవంలో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ పాలుపంచుకోనున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని పెట్టుబడి అవకాశాలను మరియు రాష్ట్ర సామర్ద్యాన్ని కళ్ళకు కట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి మరింత ఉత్తేజాన్ని అందించడానికి, సంబంధిత సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రపంచ వేదికను నిర్మించనుంది. ఈ కార్యక్రమం మంత్రులను, సీనియర్ విధాన రూపకర్తలను, కార్పొరేట్ జగత్తులోని నాయకులను, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థల అధిపతులను మరియు విద్యారంగ ప్రముఖులను ఒక చోటుకు తీసుకు రానుంది.
ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించేందుకు ఏడు దేశాలు.. ఫిన్‌లాండ్, నెదర్‌లాండ్స్, జపాన్, చెక్ రిపబ్లిక్, థాయీలాండ్, స్లొవాకియా మరియు మారిషస్.. లను గుర్తించడమైంది. ఈ శిఖర సమ్మేళనం సందర్భంగా అనేక అవగాహన పూర్వక ఒప్పంద పత్రాల (ఎమ్ఒయు ల)పై సంతకాలు జరగవచ్చని ఆశిస్తున్నారు.
రాష్ట్రాలు వాటి సత్తాను చాటిచెప్తూ, పెట్టుబడిదారులను ఆకర్షించి అన్ని రంగాలలోనూ అభివృద్ధి కోసం సహకారాత్మక మరియు స్పర్ధాత్మక సమాఖ్య భావనను ప్రదర్శించాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చోటు చేసుకొంటోంది. ప్రధాన మంత్రి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనే క్రమంలో మరియు తన నిబద్ధతను చాటుకొనే క్రమంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ నాడు గువాహాటీ లో ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్’ ను, ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన ‘మేగ్నెటిక్ మహారాష్ట్ర’ను ప్రారంభించారు.