ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంజాబ్ లోని డేరా బాబా నానక్ లో కర్ తార్ పుర్ కారిడర్ లో భాగమైన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను 2019వ సంవత్సరం నవంబర్ 9వ తేదీ న ప్రారంభించనున్నారు.
అంత కన్నా ముందు, ప్రధాన మంత్రి సుల్తాన్ పుర్ లోధీ వద్ద బేర్ సాహిబ్ గురుద్వారా లో ప్రణామాన్ని ఆచరిస్తారు.
ఆ తరువాత, ప్రధాన మంత్రి డేరా బాబా నానక్ లో జరిగే ఒక సార్వజనిక కార్యక్రమం లో పాలు పంచుకొంటారు.
ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసిపి)ని ప్రారంభించడం వల్ల భారతీయ యాత్రికులు పాకిస్తాన్ లోని కర్ తార్ పుర్ సాహిబ్ ను సందర్శించేందుకు మార్గం సుగమం కానుంది.
డేరా బాబా నానక్ లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జీరో పాయింట్ వద్ద గల కర్ తార్ పుర్ సాహిబ్ కారిడర్ ను క్రియాశీలం గా మార్చేందుకు విధి విధానాల పై 2019వ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీ న పాకిస్తాన్ తో ఒప్పంద పత్రం పైన భారతదేశం సంతకం చేసింది.
చరిత్రాత్మక సందర్భం అయినటువంటి శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క 550వ జయంతి ని దేశం అంతటా మరియు ప్రపంచ వ్యాప్తంగా గొప్పదైన రీతి లోను, సముచితమైన రీతి లోను జరపాలని కేంద్ర మంత్రివర్గం 2018వ సంవత్సరం నవంబర్ 22వ తేదీ న ఒక తీర్మానాన్ని ఆమోదించిన సంగతి ని ఈ సందర్భం లో గుర్తు కు తెచ్చుకోవలసివుంది.
భారతదేశాని కి చెందిన తైర్థికులు ఏడాది పొడవున గురుద్వారా దర్ బార్ సాహిబ్ కర్ తార్ పుర్ ను సులభమైన పద్ధతి లో, ఇబ్బంది లేకుండా సందర్శిస్తూ ఉండేటట్లు డేరా బాబా నానక్ నుండి అంతర్జాతీయ సరిహద్దు వరకు కర్ తార్ పుర్ సాహిబ్ కారిడర్ ను నిర్మించడం తో పాటు దాని ని అభివృద్ధిపరచడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లు
అమృత్ సర్- గుర్ దాస్ పుర్ హైవే నుండి డేరా బాబా నానక్ ను కలుపుతూ 4.2 కిలోమీటర్ ల పొడవున నాలుగు దోవ ల హైవే ను 120 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించడం జరిగింది.
అధునాతనమైనటువంటి ప్యాసెంజర్ టర్మినల్ బిల్డింగ్ 15 ఎకరాల భూమి లో కొలువుదీరింది. పూర్తి గా ఎయిర్ కండిశన్ సదుపాయం తో ఓ విమానాశ్రయాన్ని పోలిన ఈ భవనం లో రోజు కు దాదాపు గా 5000 తైర్థికుల సౌకర్యార్థం 50 ఇమిగ్రేశన్ కౌంటర్ లు పనిచేస్తాయి.
ప్రధాన భవనం లోపల శౌచాలయాలు, సహాయతాకేంద్రాలు, చిన్న పిల్లల సంరక్షణ సౌకర్యాలు, ప్రాథమిక ఉపచార సదుపాయాలు, ప్రార్థన స్థలం, ఇంకా అల్పాహార కేంద్రాల వంటి అవసరమైన అన్ని సౌకర్యాలు అమరి ఉన్నాయి.
సార్వజనిక సంబోధన వ్యవస్థ లు మరియు క్లోజ్ డ్ సర్క్యూట్ టెలివిజన్ (సిసిటివి) నిఘా లు సహా భద్రతపరం గా పక్కా మౌలిక సదుపాయాలను సైతం సమకూర్చారు. అంతర్జాతీయ సరిహద్దు లో 300 అడుగుల ఎత్తున జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది.
అక్టోబర్ 24వ తేదీ నాడు పాకిస్తాన్ తో ఒప్పందం పై సంతకాలు జరిగినందున కర్ తార్ పుర్ సాహిబ్ కారిడర్ క్రియాశీలతకంటూ ఒక లాంఛనప్రాయ సర్దుబాటు కార్యరూపం లోకి వచ్చింది.
ఒప్పందం తాలూకు ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి: –
• అన్ని మతాల కు చెందిన భారతీయ యాత్రికులు మరియు భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులు ఈ కారిడర్ ను వినియోగించుకోవచ్చు.
• ఈ ప్రయాణాని కి వీజా తో పని లేదు.
• యాత్రికులు కేవలం ఒక చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్ ను తీసుకువెళ్తే సరిపోతుంది.
• భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులు తమ దేశపు పాస్ పోర్టు తో పాటు ఒసిఐ కార్డు ను తీసుకు రావాలి.
• సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కారిడర్ తెరచి ఉంటుంది. ఉదయం పూట ప్రయాణించే తైర్థికులు అదే రోజు న తిరిగి రావాలి.
• ముందస్తు గా ప్రకటించబడే రోజులు మినహా, ఏడాది పొడవున కారిడర్ పనిచేస్తుంది.
• యాత్రికులు వ్యక్తులు గా గాని లేదా బృందాలు గా గాని సందర్శించవచ్చును; అలాగే కాలి నడక న కూడాను ప్రయాణించవచ్చును.
• భారతదేశం ప్రయాణ తేదీ కి 10 రోజులు ముందుగా యాత్రికుల జాబితా ను పాకిస్తాన్ కు పంపుతుంది. ప్రయాణ తేదీ కి 4 రోజుల ముందు ధ్రువీకరణ ను యాత్రికుల కు పంపిస్తారు.
• ‘లంగర్’ కు మరియు ‘ప్రసాదం’ పంపిణీ కి తగినన్ని ఏర్పాట్లు చేయగలమని పాకిస్తాన్ పక్షం భారతదేశాని కి హామీ ని ఇచ్చింది.
నమోదు కు పోర్టల్
యాత్రికులు వారంతట వారు prakashpurb550.mha.gov.in పోర్టల్ లో ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవలసివుంటుంది. ఏ రోజు న ప్రయాణించేది కూడా వారు సూచించాలి. యాత్రికుల కు ప్రయాణ తేదీ కి 3 నుండి 4 రోజుల ముందు ఇమెయిల్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా నమోదు తాలూకు ధ్రువీకరణ సమాచారం పంపబడుతుంది. ఇలెక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేశన్ (ఇటిఎ)ను కూడా తయారు అయిపోతుంది. యాత్రికులు వారు ప్యాసెంజర్ టర్మినల్ బిల్డింగ్ కు చేరుకొన్నప్పుడు వారి పాస్ పోర్ట్ తో పాటు ఇటిఎ ను వెంట తెచ్చుకోవలసిన అవసరం ఉంటుంది.