15 వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని 2019 వ సంవత్సరం జనవరి 22 వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
మూడు రోజుల పాటు- 2019 వ సంవత్సరం జనవరి 21 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు- జరిగే ఈ సమ్మేళనాన్ని వారాణసీ లో మొట్టమొదటి సారి గా నిర్వహిస్తున్నారు. న్యూ ఇండియా నిర్మాణం లో భారతీయ ప్రవాసుల పాత్ర అనేది పిబిడి కన్వెన్షన్ 2019 కి ఇతివృత్తం గా ఉండబోతోంది.
కుంభ మేళా లో, గణతంత్ర దినోత్సవం లో పాలుపంచుకోవాలని వుందన్న ప్రవాసుల భావోద్వేగాలను సమాదరిస్తూ, 15 వ పిబిడి సమ్మేళనాన్ని 2019 వ సంవత్సరం జనవరి 9 వ తేదీ కి బదులుగా జనవరి 21 నుండి 23 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సమ్మేళనం ముగిసిన అనంతరం దీని లో పాలుపంచుకున్నవారు జనవరి 24 వ తేదీన కుంభ మేళా కు హాజరయ్యేందుకు ప్రయాగ్‌రాజ్ ను సందర్శించనున్నారు. ఆ తరువాత వారు జనవరి 25 వ తేదీ న ఢిల్లీ కి వెళ్తారు. 2019 వ సంవత్సరం జనవరి 26 వ తేదీ న న్యూ ఢిల్లీ లో జరిగే గణతంత్ర దిన కవాతు ను వారు వీక్షిస్తారు.
పిబిడి సమ్మేళనాని కి ముఖ్య అతిథి గా మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ వస్తారు. నార్వే పార్లమెంటు సభ్యుడు శ్రీ హిమాన్శు గులాటి ప్రత్యేక అతిథి గా, న్యూజిలాండ్ పార్లమెంటు సభ్యుడు కన్వల్‌జిత్ సింగ్ బక్షి గౌరవ అతిథి గా పిబిడి 15 వ సంచిక కు హాజరవుతారు.
ఈ సంచిక లోని ముఖ్య కార్యక్రమాల లో-
2019 జనవరి 21 న యువజన ప్రవాసీ భారతీయ దివస్ జరుగనుంది. ఈ కార్యక్రమం న్యూ ఇండియా తో ప్రవాసీ యువజనులు మమేకం అయ్యేందుకు అవకాశాల ను కల్పించనుంది.
2019 జనవరి 22 న మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ సమక్షం లో పిబిడి సమ్మేళనాన్ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.
2019 జనవరి 23 న ముగింపు సమావేశం జరుగతుంది; భారత రాష్ట్రపతి ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాల ను ప్రదానం చేస్తారు.
ఈ కార్యక్రమం లో భాగం గా వివిధ సర్వసభ్య సదస్సు లు కూడా జరుగనున్నాయి. సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
ప్రవాసీ భారతీయ దివస్ విశేషాలు:
ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి)ని జరుపుకోవాలన్న నిర్ణయాన్ని పూర్వ ప్రధాని కీర్తి శేషులు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ తీసుకున్నారు.
ఒకటో పిబిడి ని 2003 వ సంవత్సరం జనవరి నెల 9 వ తేదీన న్యూ ఢిల్లీ లో జరిపారు. గాంధీ మహాత్ముడు దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చింది 1915 వ సంవత్సరం జనవరి నెల 9 వ తేదీ న కావడం తో ఆ రోజు ను పిబిడి గా జరుపుకోవాలని ఎంపిక చేయడమైంది.
ప్రస్తుతం ప్రతి రెండు సంవత్సరాల కు ఒకసారి పిబిడి ని నిర్వహిస్తున్నారు. ఇది విదేశాల లో నివసిస్తున్న భారతీయ సముదాయం తమ మూలాల తో మరొక్కమారు సంధానమై, ప్రభుత్వం తో సన్నిహితం అయ్యేందుకు ఒక వేదిక ను సమకూర్చుతోంది. ఈ సమావేశాల లో భాగంగా విదేశాల లో నివసిస్తున్న భారతీయులలో దేశ, విదేశాల లో వివిధ రంగాల కు గణనీయమైన సేవల ను అందించిన వారి ని ఎంపిక చేసి, వారికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డుల ను ప్రదానం చేయడం జరుగుతుంది.
14 వ పిబిడి ని 2017వ సంవత్సరం జనవరి 7-9 తేదీ ల మధ్య కర్నాటక లోని బెంగళూరు లో నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ‘‘భారతీయ ప్రవాసుల తో బంధాన్ని పునర్ నిర్వచించుకోవడం’’ అనేది 14 వ పిబిడి కి ఇతివృత్తం గా ఉండింది. శ్రీ మోదీ తన ప్రసంగం లో భారతీయ ప్రవాసులు భారతదేశ సంస్కృతి కి, సభ్యత కు, ఇంకా విలువల కు అత్యుత్తమ ప్రతినిధులని, వారి సేవల కు గాను వారి ని గౌరవించుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. విదేశాల లో ఉంటున్న భారతీయ సముదాయం తో నిరంతరాయం గా సంబంధాలు పెట్టుకోవటం ముఖ్యమని, ఇది ప్రభుత్వ కీలక ప్రాధాన్యాల లో ఒకటి గా ఉందని ఆయన అన్నారు.