అటల్ సొరంగ మార్గాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రోహ్ తాంగ్ లో ఈ నెల 3న ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు.
భూతలానికి దిగువన నిర్మించిన హైవే మార్గాలలో ప్రపంచంలోనే అతి పొడవైనదైన మార్గం కావడం అటల్ సొరంగం ప్రత్యేకత. ఈ సొరంగం నిడివి 9.02 కిలో మీటర్లు. ఇది ఏడాది పొడవునా మనాలీ ని లాహౌల్-స్పీతి లోయ తో కలిపి ఉంచుతుంది. ఇంతకు ముందు, ఈ లోయ పెద్ద ఎత్తున మంచు కురుస్తూ ఉండే కారణంగా దాదాపు 6 నెలల కాలం పాటు ఇతర ప్రాంతాల తో సంబంధాలు తెగిపోయి ఉండేది.
ఈ సొరంగాన్ని హిమాలయాల లోని పీర్ పంజాల్ శ్రేణులలో సగటు సముద్ర మట్టం (ఎంఎస్ఎల్) నుంచి 3,000 మీటర్ల (10,000 అడుగుల) ఎగువన అతి- ఆధునిక ప్రమాణాలతో నిర్మించడం జరిగింది.
ఈ సొరంగం మనాలీ, లేహ్ ల మధ్య రోడ్డు దూరాన్ని 46 కిలో మీటర్ల మేరకు తగ్గించివేస్తుంది; అలాగే, రెండు ప్రాంతాల మధ్య పట్టే ప్రయాణ సమయంలో కూడా సుమారు నాలుగు నుంచి ఐదు గంటలు ఆదా అవుతాయి.
అటల్ సొరంగం దక్షిణ పోర్టల్ (ఎస్ పి) మనాలీ నుంచి 25 కిలో మీటర్ల దూరం లో 3,060 మీటర్ల ఎత్తున నెలకొని ఉండగా, దీని ఉత్తర పోర్టల్ (ఎన్ పి) లాహౌల్ లోయ లోని తేలింగ్ సిస్సు గ్రామం సమీపంలో 3071 మీటర్ల ఎగువన ఏర్పాటయింది.
గుర్రపు నాడా ఆకారం లో 8 మీటర్ల రోడ్ వే కలుపుకొని సింగిల్ ట్యూబ్ , డబుల్ లేన్ లతో ఏర్పరచిన సొరంగమిది. దీనికి 5.525 మీటర్ల ఓవర్ హెడ్ క్లియరెన్స్ సౌకర్యాన్ని జతపరిచారు. ఇది 10.5 మీటర్ల వెడల్పును కలిగివుంది. అంతే కాదు, దీనిలో అగ్నిని తట్టుకొనే 3.6 x 2.25 మీటర్ ల మేర అత్యవసర నిష్క్రమణ సొరంగం కూడా ఉంది; దీనిని ప్రధాన సొరంగంలోనే ఏర్పరచడం జరిగింది.
ఎక్కువలో ఎక్కువగా గంటకు 80 కిలో మీటర్ల వేగం తో ప్రతి రోజూ 3,000 కార్లు, 1,500 ట్రక్కులు రాకపోకలు జరపడానికి వీలుగా అటల్ సొరంగం రూపురేఖలను తీర్చిదిద్దడమైంది.
దీనిలో సెమీ ట్రాన్స్ వర్స్ వెంటిలేషన్ సిస్టమ్, ఎస్ సిఎడిఎ నియంత్రిత అగ్నినివారక, ప్రకాశక, పర్యవేక్షక వ్యవస్థలు సహా అతి ఆధునిక ఇలెక్ట్రో-మెకానికల్ వ్యవస్థ ను అమర్చారు.
ఈ సొరంగంలో భద్రత ఏర్పాట్లు తగినన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని విశేషాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి..:
- a) రెండు పోర్టళ్ళ వద్ద సొరంగం లోకి ప్రవేశించే ముందు నిరోధకాలు;
- b) అత్యవసర కమ్యూనికేషన్ కోసం ప్రతి 150 మీటర్ల దూరం లో ఒక టెలిఫోన్ కనెక్షన్;
- c) ప్రతి 60 మీటర్ల దూరంలో మంటలను ఆర్పేందుకు నీటిని చిమ్మే వ్యవస్థ;
- d) ప్రతి 250 మీటర్లకు ఒకటి చొప్పున ప్రమాదం జరిగితే గనుక వెనువెంటనే గుర్తించేందుకు సిసిటివి కెమెరా లను అనుసంధానించిన ఆటో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్;
- e) ప్రతి ఒక్క కిలో మీటరు కు గాలి నాణ్యత నిఘా సంబంధిత ఏర్పాటు;
- f) ప్రతి 25 మీటర్ల వద్ద అవసరమైనప్పుడు ఈ సొరంగ మార్గాన్ని ఖాళీ చేయడానికి దారిని చూపే దీపాలు/ బయటి దారిని తెలిపే సూచికలు ;
- g) సొరంగం అంతటా ప్రసార వ్యవస్థ;
- h) ప్రతి 50 మీటర్లకు ఒకటి చొప్పున అగ్ని నిరోధకాలు;
- i) ప్రతి 60 మీటర్ల దూరం లో కెమెరాలు.
- తాంగ్ పాస్ కు దిగువన ఒక వ్యూహాత్మక సొరంగ మార్గాన్ని నిర్మించాలనే చరిత్రాత్మక నిర్ణయాన్ని కీర్తి శేషులు శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రధాని గా ఉన్న కాలం లో 2000 సంవత్సరం జూన్ 3న తీసుకోవడం జరిగింది. ఈ సొరంగ మార్గ దక్షిణ పోర్టల్ ను సమీపించే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన 2002వ సంవత్సరం మే నెల 26న జరిగింది.
సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఒ) భూవైజ్ఞానిక, పర్వతమయ ప్రాంత, వాతావరణ సంబంధిత సవాళ్ళ పై పైచేయిని సాధించడం కోసం అలుపెరగక పాటుపడింది. ఈ సవాళ్లన్నింటిలోకీ అత్యంత కఠిన భాగం ఏదంటే, అది.. 587 మీటర్ల సేరీ నాలా ఫాల్ట్ జోన్ ఇందులో కలసి ఉండడమే. రెండు వైపుల నుండి ఈ సొరంగ మార్గానికి ఎలాంటి అవరోధాలు ఎదురవకుండా తగిన చర్యలను తీసుకోవడం లో సఫలత 2017వ సంవత్సరం అక్టోబరు 15న సాధ్యపడింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి 2019వ సంవత్సరం డిసెంబర్ 24న సమావేశమై, పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ సేవలను గౌరవించుకోవడం కోసం రోహ్ తాంగ్ టన్నెల్ కు అటల్ సొరంగం అని పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని తీసుకొంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మనాలీ లో అటల్ సొరంగం దక్షిణ పోర్టల్ ప్రారంభోత్సవానికి హాజరయిన తరువాత, లాహౌల్ స్పీతి లోని సిస్సు గ్రామం లో, సోలంగ్ లోయలో జరిగే సార్వజనిక కార్యక్రమాలలో పాల్గొంటారు.