ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయులైన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇవాళ వాస్తవిక సాదృశ సమావేశంలో పాల్గొన్నారు. భారత-యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల మధ్య చిరకాల స్నేహసంబంధాలున్నాయి. దీంతోపాటు ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, చట్టబద్ధ పాలన తదితరాల సమన్వయంతో కూడిన వ్యూహాత్మక ఉమ్మడి భాగస్వామ్యం ఈ బంధాలను మరింత బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో ద్వైపాక్షిక సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక ‘మార్గప్రణాళిక-2030’ని ఆమోదించారు. ప్రజల మధ్య సంబంధాలు, వాణిజ్యం-ఆర్థిక వ్యవస్థ, రక్షణ-భద్రత, వాతావరణ మార్పు కార్యాచరణ, ఆరోగ్యం తదితర ముఖ్యమైన రంగాల్లో రాబోయే పదేళ్లలో మరింత లోతైన, బలమైన సంబంధాల దిశగా ఈ మార్గ ప్రణాళిక దోహదం చేస్తుంది.
కోవిడ్-19 పరిస్థితులు, టీకాలకు సంబంధించి విజయవంతంగా సాగుతున్న భాగస్వామ్యం సహా ప్రపంచ మహమ్మారిపై పోరులో రెండు దేశాలమధ్య కొనసాగుతున్న ప్రస్తుత సహకారం గురించి దేశాధినేతలిద్దరూ ఈ సందర్భంగా చర్చించారు. భారతదేశంలో కోవిడ్-19 రెండో దశ తీవ్రత నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి సకాలంలో సహాయం అందడంపై ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, యునైటెడ్ కింగ్‌డమ్ సహా పలు ఇతర దేశాలకు అవసరమైన మేర ఔషధాలతోపాటు టీకాలను అందజేయడంద్వారా సహకరించడంలో భారత్ పోషిస్తున్న పాత్రను ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కొనియాడారు.
ప్రపంచంలో 5, 6 స్థానాల్లోగల అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాల సామర్థ్యం పెంపు ధ్యేయంగా ‘‘ద్విగుణీకృత వాణిజ్య భాగస్వామ్యా’’నికి (ఈటీపీ) ఇద్దరు ప్రధానమంత్రులూ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 2030నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపునకు మించి పెంచడాన్ని ప్రతిష్టాత్మక లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సదరు ఈటీపీలో భాగంగా సమగ్ర-సమతుల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడంపై చర్చలకు మార్గ ప్రణాళికపై భారత-యూకే అంగీకారానికి వచ్చాయి. ఇందులో భాగంగా ఆరంభ ప్రయోజనాలను ఇవ్వగల మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. భారత-యూకేల మధ్య ఈటీపీ భాగస్వామ్యం ద్వారా రెండు దేశాల్లో వేలాదిగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాల సృష్టికి వీలుంటుంది.
పరిశోధనలు-ఆవిష్కరణల సంబంధిత సహకారంలో భారతదేశానికి యునైటెడ్ కింగ్‌డమ్ రెండో అతిపెద్ద భాగస్వామి. ఈ నేపథ్యంలో భారత-యూకే వాస్తవిక సాదృశ శిఖరాగ్ర సదస్సులో
సరికొత్త ‘‘అంతర్జాతీయ ఆవిష్కరణల భాగస్వామ్యం’’పై సంయుక్త ప్రకటన వెలువడింది. దీనిద్వారా ఆఫ్రికాసహా ఎంపిక చేసిన వర్ధమాన దేశాలకు భారత సార్వజనీన ఆవిష్కరణల బదిలీకి మద్దతునివ్వడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఈ మేరకు నవ్య, ప్రగతిశీల సాంకేతిక పరిజ్ఞానాలు, డిజిటల్, ఐసీటీ ఉత్పత్తులు తదితరాలలో సహకారం పెంపునకు, సరఫరా కార్యకలాపాల ప్రతిరోధకత వృద్ధికోసం కృషి చేసేందుకు ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. సముద్ర భ్రదత, ఉగ్రవాద నిరోధం, సైబర్ ప్రపంచంసహా రక్షణ-భద్రత రంగాల్లో సంబంధాల బలోపేతంపైనా దేశాధినేతలిద్దరూ అంగీకరించారు.
ఇండో-పసిఫిక్, జి-7 కూటముల మధ్య సహకారంసహా పరస్పర ప్రయోజనాలతో ముడిపడిన ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై ఇద్దరు ప్రధానమంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందం లక్ష్యాల సాధనకు దిశగా కార్యాచరణ అమలు దిశగా తమ నిబద్ధతను వారు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అలాగే ఈ సంవత్సరం చివరన యూకే నిర్వహించబోయే కాప్-26 శిఖరాగ్ర సదస్సు విషయంలో సన్నిహితంగా వ్యవహరించడంపైనా వారు అంగీకారానికి వచ్చారు. మరోవైపు భారత-యూకేల మధ్య వలస-ప్రయాణ సౌలభ్యంపై సమగ్ర భాగస్వామ్యానికి రెండు దేశాలూ శ్రీకారం చుట్టాయి. దీనివల్ల ఉభయ దేశాల మధ్య విద్యార్థులు, నిపుణుల రాకపోకలకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు కుదుటపడిన అనంతరం ప్రధానమంత్రి జాన్సన్ వెసులుబాటు మేరకు ఆయనను భారతదేశానికి ఆహ్వానించాలన్న తన ఆకాంక్షను ప్రధాని మోదీ వెల్లడించారు. కాగా, జి-7 శిఖరాగ్ర సదస్సుకు హాజరులో భాగంగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటించాల్సిందిగా ప్రధానమంత్రి మోదీకి తన ఆహ్వానాన్ని ప్రధాని జాన్సన్ పునరుద్ఘాటించారు.