శ్రేష్ఠులు, నా తోటి మిత్రులారా,
అన్నింటి కంటే ముందు, ఎస్‌సిఒ కు సమర్ధ నాయకత్వాన్ని అందించినందుకుగాను, అలాగే కొవిడ్-19 మహమ్మారి సవాళ్ళను రువ్వి, అడ్డంకులను సృష్టించినప్పటికీ కూడా ఈ శిఖర సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు నేను అభినందనలు తెలియజేయదలచుకొన్నాను. ఈ బాధాకర పరిస్థితుల్లోనూ, ఎస్‌సిఒ ఛత్రఛాయ లో సహకారం, ఏకీరణల కు సంబంధించిన స్థూల, పురోగామి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకుపోగలుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.
శ్రేష్ఠులారా,
ఎస్‌సిఒ లో ఈ సంవత్సరం భారతదేశానికి ఒక ముఖ్యమైన సంవత్సరం. మేము ‘‘ఎస్‌సిఒ కౌన్సిల్ సభ్యత్వ దేశాల ప్రభుత్వ అధిపతుల’’తో ఒక శిఖర స్థాయి సమావేశాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్నాము. ఈ సమావేశం కోసం ఒక స్థూల చర్చనీయాంశ పట్టిక ను సిద్ధం చేయడమైంది. దీనిలో ఆర్థిక సహకారంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. స్టార్టప్ ఇకోసిస్టమ్ తో మాకు ఉన్న విశేష అనుభవాన్ని పంచుకోవడానికి నూతన ఆవిష్కరణ, స్టార్టప్ లపై ఒక ప్రత్యేక కార్యాచరణ సమూహాన్ని రూపొందించాలని మేము ప్రతిపాదించాము. అలాగే, సాంప్రదాయక వైద్యం అంశం పైన సైతం ఒక కార్యాచరణ సమూహాన్ని మేము ప్రతిపాదించాము. అదే జరిగితే సాంప్రదాయక వైద్యం, పురాతన వైద్యం ల తాలూకు జ్ఞానాన్ని ఎస్‌సిఒ దేశాలకు విస్తరించడం తో పాటు సమకాలిక వైద్యంలో సాధించిన పురోగతి ఒకదానికి మరొకటి పూరకం గా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది.
శ్రేష్ఠులారా,
జాతీయ సామర్ధ్యాల పెంపుదల, ఆర్థిక బహుళపక్షీయ వాదం ల కలబోత తో మహమ్మారి నేపథ్యం లో ఎదురైన ఆర్థిక నష్టాల బారి నుంచి ఎస్‌సిఒ సభ్యత్వ దేశాలు తప్పించుకోగలుగుతాయి అని భారతదేశం దృఢంగా నమ్ముతోంది. మహమ్మారి అనంతర కాలం లో ‘‘స్వయం సమృద్ధియుత భారతదేశాన్ని’’ ఆవిష్కరించాలనే దృష్టితో మేము ముందుకు పోతున్నాము. ‘‘స్వయం సమృద్ధియుత భారతదేశం’’ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు అనేక ప్రయోజనాలను అందించే ఒక శక్తి గా రుజువవుతుందని, అంతేకాకుండా ఎస్‌సిఒ ప్రాంత ఆర్థిక పురోగతి ని వేగవంతం చేస్తుందని నేను నమ్ముతున్నాను.
శ్రేష్ఠులారా,
ఎస్‌సిఒ సభ్యత్వ దేశాలతో సన్నిహితమైన సాంస్కృతిక సంబంధాలను, సన్నిహిత చరిత్రాత్మక సంబంధాలను భారతదేశం కాపాడుకుంటూ వస్తోంది. మా పూర్వికులు వారి నిరంతర సంబంధాల ద్వారా, వారి అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా ఈ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని, ఈ ఉమ్మడి చరిత్రాత్మక వారసత్వాన్ని సజీవంగా నిలబెడుతూ వచ్చారు. ఇంటర్‌నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్, చాబహార్ నౌకాశ్రయం, అశ్ గాబాత్ ఒప్పందం వంటి నిర్ణయాలు సంధానం దిశలో భారతదేశం దృఢ సంకల్పానికి అద్దం పడుతున్నాయి. సంధానాన్ని మరింతగా అభివృద్ధిపరచేందుకు దేశాలు ఒక దేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరొక దేశం, అలాగే ఒక దేశం యొక్క ప్రాదేశిక సమగ్రతను మరొక దేశం గౌరవించాలనే ముఖ్య సూత్రాలను ముందుకు తీసుకుపోవడం అవసరం అని భారతదేశం నమ్ముతోంది.
శ్రేష్ఠులారా,
ఐక్య రాజ్య సమితి 75 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంది. ఎన్నో కార్యసిద్ధులను సాధించిన తరువాత కూడాను, ఐక్య రాజ్య సమితి మౌలిక లక్ష్యం ఇప్పటికీ నెరవేరకుండానే మిగిలిపోయింది. మహమ్మారి కారణంగా ఆర్థిక, సామాజిక సమస్యల తో పోరాడుతున్న ప్రపంచం ఐరాస వ్యవస్థలలో క్రాంతికారి మార్పులను తీసుకు వస్తుందని ఆశించడం జరుగుతోంది.
మా ధర్మ గ్రంథాల లో ‘‘పరివర్తన్‌మే స్థిర మస్తి’’ ఉంది. ఈ మాటలకు – పరివర్తన ఒక్కటే శాశ్వతమైంది అని భావం. 2021 తో మొదలుపెట్టి భారతదేశం ఐరాస భద్రతమండలి లో ఒక శాశ్వతేతర సభ్యత్వ దేశంగా పాలుపంచుకోనుంది. ప్రపంచ పరిపాలన ప్రక్రియ లో వీలైనన్ని మార్పులను తీసుకురావడం మీదే మేము శ్రద్ధ వహించనున్నాము.
వర్తమాన ప్రపంచ వాస్తవ స్థితిగతులకు దర్పణం పట్టే సంస్కరణలకు అవకాశం ఉన్నటువంటి, భాగస్వాములందరి ఆకాంక్షలు, సమకాలిక సవాళ్ళు, మానవాళి సంక్షేమం మొదలైన అంశాలను చర్చించేటటువంటి బహుళపక్షవాదం కావాలిప్పుడు. ఈ ప్రయత్నానికి ఎస్‌సిఒ సభ్యత్వ దేశాల నుంచి పూర్తి మద్దతు ను మేము ఆశిస్తున్నాము.
శ్రేష్ఠులారా,
సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా.. ఈ మాటలకు- మనం అందరమూ సంతోషంగా ఉంటూ, వ్యాధి బారి న పడకుండా మనుగడ సాగిద్దాం- అని భావం. ఈ శాంతి మంత్రం భారతదేశంలో ప్రజలందరి సంక్షేమానికి సంబంధించిన విశ్వాస ప్రతీక గా నిలుస్తోంది. ఇదివరకు ఎరుగనటువంటి ఒక మహమ్మారి పీడిస్తున్న ఈ కాలంలో, భారతదేశ ఔషధ పరిశ్రమ అత్యవసర మందులను 150 దేశాలకు పైగా సరఫరా చేసి సాయపడింది. ప్రపంచం లో అతి పెద్ద సంఖ్యలో టీకామందులను ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారతదేశం, తనకు గల టీకా మందుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని, పంపిణీ సామర్ధ్యాన్ని ఈ సంక్షోభ తరుణంలో పోరాడుతూ ఉన్న మానవ జాతి కి సాయపడటానికి వినియోగిస్తుంది.
శ్రేష్ఠులారా,
శాంతి, భద్రత, సమృద్ధి లంటే భారత్ కు దృఢమైన నమ్మకం ఉంది. మేము ఉగ్రవాదానికి, ఆయుధాల దొంగరవాణాకు, మత్తుపదార్థాలకు, మనీలాండరింగు కు వ్యతిరేకంగా ఎల్లప్పటికీ గళమెత్తుతూ వస్తున్నాము. ఎస్‌సిఒ నియమావళి లో నిర్దేశించిన సూత్రాలను అనుసరిస్తూ కలసి పనిచేస్తామని ఇచ్చిన మాటలను భారతదేశం నిలబెట్టుకొంటూ వస్తోంది.
ఏమైనా, ఎస్‌సిఒ చర్చనీయాంశాల పట్టిక లోకి అనవసరంగా ద్వైపాక్షిక అంశాలను చొప్పించేందుకు పదే పదే ప్రయత్నాలు జరుగుతూ ఉండటం దురదృష్టకరం. ఇది ఎస్‌సిఒ నియమావళిని, శంఘాయి స్ఫూర్తిని అతిక్రమించడమే. ఆ తరహా యత్నాలు ఏకాభిప్రాయ భావన కు, సహకారానికి ప్రతికూలం.
శ్రేష్ఠులారా,
ఎస్‌సిఒ 20వ వార్షికోత్సవాన్ని 2021 వ సంవత్సరంలో ‘‘ఎస్‌సిఒ కల్చర్ ఇయర్’’ గా జరుపుకోవడానికి నేను సంపూర్ణంగా మద్ధతిస్తున్నాను. ఈ సంవత్సరం లో మన ఉమ్మడి బౌద్ధ వారసత్వం పై తొలి ఎస్‌సిఒ ప్రదర్శన ను నిర్వహించే పనిలో నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఇండియా తలమునకలుగా ఉంది. భారతీయ సాహిత్యంలోని రచనలు పదింటిని చైనా, రష్యా ల భాషల లో అనువదించే పని ని లిటరేచర్ అకాడమీ ఆఫ్ ఇండియా పూర్తి చేసింది.
వచ్చే సంవత్సరం, మహమ్మారి కి తావు లేనటువంటి వాతావరణం లో, ఎస్‌సిఒ ఆహార ఉత్సవానికి భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది అని నాకు నమ్మకం ఉంది. ఎస్‌సిఒ సచివాలయం తో కలసి బీజింగ్ లో ఇటీవల నిర్వహించిన యోగ కార్యక్రమం లో ఎస్‌సిఒ సభ్యత్వ దేశాల దౌత్యవేత్తలు, అధికారులు పాలుపంచుకొన్నందుకు నేను సంతోషిస్తున్నాను.
శ్రేష్ఠులారా,
అధ్యక్షుడు శ్రీ పుతిన్ దక్షత కలిగిన, సఫలమైన నాయకత్వాన్ని అందిస్తున్నందుకు ఆయన ను నేను మరో సారి అభినందిస్తున్నాను. ఈ శిఖరాగ్ర సమ్మేళనాన్ని నిర్వహించినందుకు ఆయన కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే సంవత్సరం లో ఎస్‌సిఒ అధ్యక్ష పదవీబాధ్యతలను స్వీకరించనున్న తాజిక్ అధ్యక్షుడు శ్రీ ఇమోమాలీ రహమాన్ ను నేను అభినందించదలచాను. ఆయనకు ఇవే నా శుభాకాంక్షలు.
అధ్యక్ష బాధ్యతలలో తాజికిస్తాన్ సఫలం అయ్యేందుకు భారతదేశం పక్షాన పూర్తి సహకారం అందిస్తామని కూడా నేను హామీ ని ఇస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు.