ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి హిజ్ ఎక్సలెన్సీ ఫుమియో కిషిదా తో ఈ రోజు సమావేశమయ్యారు. ప్రధానమంత్రి గౌరవార్థం, జపాన్ ప్రధానమంత్రి విందు ఇచ్చారు. వారిరువురు , ప్రాంతీయ , అంతర్జాతీయ అంశాలు, వివిధ అంశాలలో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంపుపై సానుకూల అభిప్రాయాలను పంచుకున్నారు.
ద్వైపాక్షిక భద్రత, రక్షణ రంగ సహకారం, రక్షణ ఉత్పత్తుల తయారీ సహా పలు రంగాలలో సహకారానికి ఉభయ నాయకులు అంగీకరించారు. తదుపరి 2+2 విదేశీ, రక్షణ మంత్రుల సమావేశం వీలైనంత త్వరగా జపాన్ లో నిర్వహించాలని నిర్ణయించారు.
ఇరు దేశాల మధ్య ఆర్ధిక సంబంధాలు మరింత వృద్ధి చెందుతుండడాన్ని ఉభయ నాయకులు అభినందించారు. రాగల 5 సంవత్సరాలలో జపాన్ నుంచి ఇండియాకు పబ్లిక్, ప్రైవేట్ పెట్టుబడి, ఫైనాన్సింగ్‌లో 5 ట్రిలియన్ ఎన్ లు ఉండేలా చూసేందుకు తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఇరువైపులా కృషి చేసేందుకు ఉభయులూ అంగీకరించారు.
గతి శక్తి చొరవ ద్వారా సులభతర వాణిజ్యం, లాజిస్టిక్ లను గతి శక్తి ద్వారా పెంపొందించేందుకు, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. జపాన్ కంపెనీలు ఇండియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు చర్యలు తీసుకోవలసిందిగా జపాన్ ప్రధాని కిషిడాను భారత ప్రధాని కోరారు. ఇలాంటి పెట్టుబడులు పటిష్టమైన సరఫరా గొలుసు ఏర్పాటుకు ఉపయోగపడతాయని, ఇది పరస్పరం ప్రయోజన కరమని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , జపాన్ కంపెనీలు ఇండియాలో తమ పెట్టుబడులు పెంచుతుండడాన్ని అభినందించారు. అలాగే వివిధ పిఎల్ ఐ పథకాల కింద 24 జపాన్ కంపెనీలు విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు..
ఇరువురు నాయకులు ముంబాయి - అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ( ఎం.ఎ.హెచ్.ఎస్.ఆర్) ప్రాజెక్టు అమలులో పురోగతిని సమీక్షించారు. ఈ ప్రాజెక్టుకు 3 వ విడత రుణానికి సంబంధించి న పత్రాలపై సంతకాలు జరగడాన్ని వారు స్వాగతించారు. సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యతను ఇరువురు నాయకులు ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీలను ఉభయులూ రెండువైపులా ప్రైవేటు రంగం కొలాబరేషన్ ను ప్రోత్సహించేందుకు అంగీకరించారు. కీలక, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం విషయంలో అంటే 5జి, ఇంకా ఆ పైన, అలాగే సెమికండక్టర్ల వంటి సాంకేతిక పరిజ్ఞానంలో పరస్పర సహకారానికి గల అవకాశాలను వారు చర్చించారు.
పరిశుభ్రమైన ఇంధనం,హరిత హైడ్రొజన్ వంటి వాటి విషయంలో మరింత లోతైన సహకారానికి ఇరువురు ప్రధానమంత్రులు అంగీకరించారు. ఈ విషయంలో బిజినెస్ టు బిజినెస్ కొలాబరేషన్‌ను మరింతగా ప్రోత్సహించాలని అంగీకరించారు.
ఇరు దేశాల ప్రజలకు -ప్రజలకు మధ్య అనుసంధానతను మరింత పెంపొందించేందుకు ఇరువురు నాయకులు అంగీకరించారు. ఇటువంటి అనుసంధానతలు ద్వైపాక్షిక సంబంధాలకు వెన్నెముకగా నిలుస్తాయని జపాన్ ప్రధానమంత్రి కిషిద అన్నారు. ఇందుకు సంబంధించి, నిర్దేశిత నైపుణ్య కార్మికుల (ఎస్ ఎస్ డబ్ల్యు) కార్యక్రమ అమలు లో పురోగతిని ఇరువురు నాయకులు సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు వారు అంగీకరించారు. కోవాక్సిన్, కోవిషీల్డ్ వాక్సిన్ సర్టిఫికేట్ కలిగిన పర్యాటకులు ఇండియా నుంచి జపాన్ కు వచ్చేందుకు వీలు కల్పించే విధంగా పర్యాటక ఆంక్షలను మరింత సడలించే అంశాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇండియా - జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరమ్ భారత దేశ ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడంలో ఎంతో ఉపయోగకరంగా ఉందని ఇరువురు నాయకులు అంగీకరించారు. వార్షిక శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా ఉభయ పక్షాలు గుర్తించిన వివిధ ప్రాజెక్టుల సత్వర అమలుకు ఎదురుచూస్తున్నట్టు వారు తెలిపారు.
ఇరువురు నాయకులు ఇటీవలి .ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇండో-పసిఫిక్‌కు సంబంధించి వారి విధానాల కలయికను గుర్తించారు .స్వేచ్ఛాయుత, బహిరంగ , సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంలో, వ్యాక్సిన్‌లు, స్కాలర్‌షిప్‌లు, క్లిష్టమైన సాంకేతికతలు, మౌలిక సదుపాయాలు వంటి క్వాడ్ సమకాలీన నిర్మాణాత్మక అంశాల ఎజెండాలో పురోగతిని స్వాగతించారు.
జపాన్ పర్యటన సందర్భంగా తనకు, తన బృంద సభ్యులకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి కిషిదా కు కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి ద్వైవార్షిక శిఖరాగ్ర సమ్మేళనానికి జపాన్ రావలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని , జపాన్ ప్రధానమంత్రి కిషిద ఆహ్వానించారు. దీనిని ప్రధానమంత్రి సంతోషపూర్వకంగా అంగీకరించారు.