ప్రధానమంత్రి శ్రీ సోనెక్సే సిఫాండోన్ ఆహ్వానం మేరకు 21వ ఆసియాన్ -ఇండియా 19వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి నేను ఈ రోజు లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లోని వియంటియాన్ రెండు రోజుల పర్యటనకు బయలుదేరాను.
ఈ సంవత్సరం మనం యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రారంభించి పదేళ్లు అయింది. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించడానికి, సహకారం, భవిష్యత్తు దిశను రూపొందించడానికి నేను ఆసియాన్ నాయకులతో సమావేశం అవుతాను.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సౌభాగ్యానికి ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు తూర్పు ఆసియా సదస్సు అవకాశం కల్పిస్తుంది.
బౌద్ధం, రామాయణాల భాగస్వామ్య వారసత్వంతో సుసంపన్నమైన లావో పిడిఆర్ తో సహా ఈ ప్రాంతంతో మనం సన్నిహిత సాంస్కృతిక, నాగరిక సంబంధాలను పంచుకుంటాం. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి లావో పీడీఆర్ నాయకత్వ సారధ్యంలో సమావేశం కావడం కోసం ఎదురుచూస్తున్నాను.
ఈ పర్యటన ఆసియాన్ దేశాలతో మన సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.