నమస్కారం…
గౌరవనీయ కార్యదర్శిగారూ…
ఐక్యరాజ్య సమితి 74వ సర్వసభ్య సమావేశంలో 130 కోట్లమంది భారతీయుల తరఫున ప్రసంగించడం నాకు లభించిన గొప్ప గౌరవం. ఇదొక అత్యంత ప్రత్యేక సందర్భంకూడా… ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతిని ప్రపంచమంతా ఘనంగా నిర్వహించుకోనుండటమే అందుకు కారణం. ప్రపంచ శాంతి, ప్రగతి, పురోగతిరీత్యా ఆయన ప్రబోధించిన సత్యం, అహింస నేటికీ అనుసరణీయాలే.
గౌరవనీయ కార్యదర్శిగారూ…
ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత భారీ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో, ఎన్నడూ ఎరుగనంత అధికసంఖ్యలో ఓటర్లు నన్ను, నా ప్రభుత్వాన్ని ఆదరించి, మునుపటికన్నా బలమైన తీర్పుతో రెండోసారి అధికారం అప్పగించారు. ఇవాళ నేను మరోసారి మీ సమక్షంలో ప్రసంగించే అవకాశమిచ్చిన ఆ ప్రజా తీర్పునకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయినప్పటికీ, ఈ తీర్పు ఇస్తున్న సందేశానికి మరింత ప్రాముఖ్యం ఉంది. అది ఎంతో విస్తృతమేగాక స్ఫూర్తిమంతమైనది కూడా.
గౌరవనీయ కార్యదర్శిగారూ…
ఒక వర్ధమాన దేశం తన పౌరుల కోసం కేవలం ఐదేళ్లలో 110 మిలియన్లకుపైగా మరుగుదొడ్లను నిర్మించి ప్రపంచంలోనే అతిగొప్ప పారిశుధ్య కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయగలిగిన వేళ- ప్రభుత్వం సాధించిన అన్ని విజయాలు, ఫలితాలు ప్రపంచానికే స్ఫూర్తిమంతమైన సందేశంగా నిలుస్తున్నాయి.
ఒక వర్ధమాన దేశం తన 500 మిలియన్ల ప్రజలకు ఏటా రూ.5 లక్షలదాకా విలువైన ఉచిత వైద్యం పొందే ఆరోగ్య రక్షణ సదుపాయం కల్పిస్తూ ప్రపంచంలోనే అత్యంత భారీ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తూన్న వేళ- ఈ పథకంలో భాగంగా సాధించిన విజయాలు, రూపొందిన స్పందనాత్మక వ్యవస్థలు ప్రపంచానికి ఒక కొత్త మార్గం నిర్దేశిస్తున్నాయి.
ఒక వర్ధమాన దేశం కేవలం ఐదేళ్లలో పేదల కోసం 370 మిలియన్ల బ్యాంకు ఖాతాలను తెరిపించి, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సార్వజనీనత పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూన్న వేళ- ఫలితంగా ఆవిర్భవిస్తున్న వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా పేదలలో విశ్వాసం పాదుకొల్పుతున్నాయి.
ఒక వర్ధమాన దేశం తన పౌరులకు జీవసంబంధ గుర్తింపునిచ్చేలా ప్రపంచంలోనే అత్యంత భారీ డిజిటల్ గుర్తింపు కార్యక్రమాన్ని ప్రారంభించి తద్వారా వారి హక్కుల సద్వినియోగానికి భరోసా కల్పించడంతోపాటు అవినీతికి అడ్డుకట్టద్వారా 20 బిలియన్ డాలర్ల మేర ఆదా చేయగలిగిన వేళ- తత్ఫలితంగా ఆవిర్భవించిన ఆధునిక వ్యవస్థలు ప్రపంచానికి కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.
గౌరవనీయ కార్యదర్శిగారూ…
నేను ఇక్కడికి వచ్చేసరికే ఈ భవన ప్రవేశద్వారం సమీపాన ఒక గోడపై ‘ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వినియోగం ఇక వద్దు’ అని ఒక వాక్యం రాసి ఉండటం చూశాను. ఈ విషయం గురించి ఒకవైపు నేనిక్కడ మీ సమక్షంలో ప్రసంగిస్తుండగానే మరోవైపు భారత్‘ను ‘ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ రహిత దేశం’గా రూపొందించే అత్యంత భారీ ప్రచారోద్యమం దేశవ్యాప్తంగా మొదలైంది. ఇక రాబోయే ఐదేళ్లలో జల సంరక్షణను ప్రోత్సహించడంతోపాటు 150 మిలియన్ ఇళ్లకు మంచినీటి సరఫరాను ప్రారంభించబోతున్నాం.
రాబోయే ఐదేళ్లలో మేం 1,25,000 కిలోమీటర్ల కొత్త రహదారులను నిర్మించనున్నాం.
మా దేశంలో 75వ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకోబోయే 2022నాటికి పేదల కోసం 20 మిలియన్ ఇళ్లను నిర్మించే ప్రణాళికను చేపట్టాం.
క్షయవ్యాధిని 2030నాటికి నిర్మూలించాలన్నది ప్రపంచ లక్ష్యం కాగా, భారతదేశంలో 2025నాటికే ఈ గమ్యాన్ని చేరేదిశగా మేం కృషి చేస్తున్నాం.
అయితే, ఇవన్నీ ఎలా సాధిస్తున్నామన్న సందేహం ఉదయించవచ్చు… భారతదేశంలో ఇంతటి సత్వర మార్పులు ఎలా చోటుచేసుకుంటున్నాయన్న ప్రశ్న తలెత్తవచ్చు.
గౌరవనీయ కార్యదర్శిగారూ…
భారతీయ సంస్కృతి వేల ఏళ్లనాటిదేగాక అత్యంత విలక్షణమైనది. తనదైన ఉజ్వల సంప్రదాయాలలో సార్వత్రిక స్వప్నాలెన్నో ఇమిడి ఉన్నాయి. ప్రతి ప్రాణిలోనూ దైవత్వాన్ని చూడటమేగాక అందరి సంక్షేమం కోసం కృషిచేయడం కూడా మా విలువలు, సంస్కృతిలోని ప్రత్యేకతలు.
అందువల్ల మా విధానాలకు కేంద్రకం ప్రజా భాగస్వామ్యంతో ప్రజా సంక్షేమమే… అయితే, ఈ ప్రజా సంక్షేమం అన్నది కేవలం భారతదేశం కోసం మాత్రమే కాదు… మొత్తం ప్రపంచం కోసం ఉద్దేశించినది కావడం విశేషం.
అందుకే… ‘సమష్టి కృషి, అందరి విశ్వాసంతో అందరికీ ప్రగతి’ (సబ్ కా సాథ్… సబ్ కా వికాస్… సబ్ కా విశ్వాస్) అనే మా ధ్యేయం మాకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఇది కూడా భారతదేశానికి మాత్రమే పరిమితంగాక ప్రపంచం మొత్తానికీ అన్వయిస్తుంది. మా ప్రయత్నాలు జాలి చూపడంలో భాగమో కరుణ ప్రదర్శించడమో కాదు… అది కేవలం బాధ్యత… కర్తవ్యం అన్న భావనతో చేస్తున్నవి మాత్రమే.
మా ప్రయత్నాలన్నీ 130 కోట్ల మంది భారతీయులు లక్ష్యంగా సాగుతున్నవే. అయితే, తద్వారా సాకారం చేయదలచి స్వప్నాలు ఒక్క భారతదేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి, ప్రతి దేశానికీ, ప్రతి సమాజానికీ చెందినవి. ఆ మేరకు ప్రయత్నాలన్నీ మావే… కానీ, ఫలితాలు మాత్రం మొత్తం ప్రపంచానికి, మానవాళి అంతటికీ సంబంధించినవే.
ఈ మేరకు ప్రగతి కోసం తమదైన మార్గంలో శ్రమిస్తున్న భారత్ వంటి దేశాల గురించి నేను ఆలోచించినప్పుడు నా దృఢ నిశ్చయం రోజురోజుకూ బలపడుతూనే ఉంటుంది. నేను అక్కడి ప్రజల ఆనందాలు, ఆవేదనల గురించి విన్నపుడు, వారి స్వప్నాల గురించి తెలుసుకున్నప్పుడు, నా దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసుకోవాలన్న నా సంకల్పం ఇంకా బలోపేతం అవుతుంది. కాబట్టి భారతదేశపు అనుభవాలు ఇతర దేశాలకు ప్రయోజనకరం కాగలవు.
గౌరవనీయ కార్యదర్శిగారూ…
భారతదేశపు కవి దిగ్గజం కరియన్ పుంగుండ్రనార్ 3వేల ఏళ్లకిందట ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన తమిళ భాషలో- ‘‘యాదుమ్ ఊరే… యావరుమ్ కేరిర్’’ అన్నారు… అంటే- ‘‘మేము అన్ని ప్రాంతాలకూ చెందినవారం… అందరికీ చెందినవారం’’ అని అర్థం. సరిహద్దులకు అతీతంగా ఈ సార్వత్రిక స్పృహ కలిగి ఉండటమన్నది భారతదేశ వైశిష్ట్యం.
శతాబ్దాలనుంచీ వస్తున్న గొప్ప సౌహార్దత సంప్రదాయం మేరకు గడచిన ఐదేళ్లలో ప్రపంచ సంక్షేమం దిశగా వివిధ దేశాలతో సౌభ్రాత్ర భావన బలోపేతానికి భారతదేశం ఎంతగానో కృషిచేసింది. ఇది ఐక్యరాజ్య సమితి నిర్దేశిస్తున్న కీలక లక్ష్యాలకు అనుగుణమైనది కావడం వాస్తవం. భారత్ లేవనెత్తే అంశాలు, విభిన్న కొత్త అంతర్జాతీయ వేదికల నిర్మాణానికి భారత్ ముందడుగు వేసిన తీరు, తీవ్రమైన ప్రపంచ సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనడంలో సమష్టి కృషిని కోరడం వంటివి ఇందుకు నిదర్శనం.
గౌరవనీయ కార్యదర్శిగారూ…
చారిత్రక, తలసరి ఉద్గారాల ప్రాతిపదికన పరిశీలిస్తే, భూతాపం పెరగడంలో భారతదేశం పాత్ర చాలా స్వల్పం. అయితే, ఈ సమస్యను ఎదుర్కొనడానికి చర్యలు తీసుకోవడంలో ముందున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఒకవైపు 450 గిగావాట్ల పునరుపయోగ ఇంధన ఉత్పత్తి లక్ష్య సాధన కోసం మేం కృషి చేస్తున్నాం. మరోవైపు అంతర్జాతీయ సౌరశక్తి కూటమి ఏర్పాటు మేం చొరవచూపాం. భూ తాపంవల్ల కలిగే దుష్ప్రభావాల్లో ప్రకృతి విపత్తుల సంఖ్య, తీవ్రత పెరిగిపోవడమన్నది ప్రధానమైనది. అదే సమయంలో అవి కొత్త రంగాల్లో, కొత్త రూపాల్లోనూ తలెత్తుతుండటం గమనార్హం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ‘‘విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కల్పన కూటమి’’ (CDRI) ఏర్పాటుకు భారత్ చొరవచూపింది. ప్రకృతి విపత్తులను ఎదుర్కొని నిలవగల మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఈ కూటమి సహకరిస్తుంది.
గౌరవనీయ కార్యదర్శిగారూ…
ఐక్యరాజ్య సమితి శాంతిస్థాపక దళాల్లో సేవలందిస్తూ మరణించిన సైనికులలో అత్యధికులు భారతీయులే. మేమంతా ‘‘యుద్ధం కాదు… శాంతి ప్రధాన’’మని ప్రబోధించిన బుద్ధ భగవానుడు నడయాడిన దేశానికి చెందినవారం. కాబట్టే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఈ మహమ్మారి ముప్పుపై హెచ్చరికగా, నిబద్ధతతోనేగాక ఆక్రోశంతో మా గళం వినిపిస్తాం. ఇది ఏదో ఒక దేశానికి చెందినది కాదని, మొత్తం ప్రపంచంతోపాటు మానవాళికే అతిపెద్ద సవాలుగా నిలుస్తున్నదని మేం విశ్వసిస్తున్నాం. ఉగ్రవాదంపై మనలో ఏకాభిప్రాయం లేకపోవడం ఐక్యరాజ్య సమితి సృష్టికి ప్రాతిపదికగా నిలిచిన సూత్రావళికే భంగకరం. అందుకే… మానవాళి కోసం… ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా పూర్తిస్థాయిలో ఏకమై, ఒక్కతాటిపైకి రావడం అవశ్యమని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
గౌరవనీయ కార్యదర్శిగారూ…
ప్రపంచ ముఖచిత్రం మారిపోతోంది. ఈ 21వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞానం సామాజిక, వ్యక్తిగత జీవితాల్లో కనీవినీ ఎరుగని మార్పులు తెస్తోంది. అలాగే ఆర్థిక, భద్రత, అనుసంధానం, అంతర్జాతీయ సంబంధాల రంగాల్లోనూ పెనుమార్పులకు కారణమవుతోంది. ఇటువంటి పరిస్థితుల నడుమ భిన్నధ్రువ ప్రపంచం ఏ ఒక్కరి ప్రయోజనాలనూ నెరవేర్చదు. మనకు మనమేనంటూ గిరిగీసుకోవడంగానీ, మన హద్దులకే పరిమితం కావడంగానీ సాధ్యం కాదు. ఈ ఆధునిక శకంలో బహుపాక్షిక వాదానికి, ఐక్యరాజ్య సమితికి మనం కొత్త దిశ, శక్తిని సమకూర్చాల్సి ఉంది.
గౌరవనీయ కార్యదర్శిగారూ…
షికాగోలో 125 ఏళ్లకిందట ప్రపంచ ధార్మిక సమ్మేళనం సందర్భంగా మహనీయుడైన ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద ప్రపంచానికి ఇచ్చిన పిలుపు- ‘‘అసహనం తగదు… సామరస్యం-శాంతి అవశ్యం.’’ ఇవాళ కూడా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంతర్జాతీయ సమాజానికి ఇస్తున్న పిలుపు అదే- ‘‘సామరస్యం… శాంతి’’.
మీకందరికీ నా కృతజ్ఞతలు.