దేశంలో కోవిడ్ వాక్సినేషన్ పురోగతి, కోవిడ్ -19 పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా గల వైద్యులతో సంప్రదింపులు జరిపారు. కరోనావైరస్ మహమ్మారి కాలంలో వైద్యులు, మెడికల్ పారామెడికల్‌సిబ్బంది దేశానికి అందించిన సేవలను ప్రధానమంత్రి కొనియాడారు.
గత సంవత్సరం ఇదే సమయంలో మన దేశ వైద్యులు కష్టపడి పనిచేయడం, దేశం అనుసరించిన వ్యూహం వల్ల మనం కరోనా వైరస్ ఉధృతిని నిలువరించ గలిగామని అన్నారు. ఇప్పుడు దేశం రెండోదశ కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నదని, అందరు వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఈ మహమ్మారిని తమ శక్తిని కేంద్రీకరించి ఎదుర్కొంటూ లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని అన్నారు.
అత్యావశ్యక మందుల సరఫరా, సూది మందులు, ఆక్సిజన్ తగినంతగా అందుబాటులో ఉండేట్టు చూడడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు కీలక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్ర తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వాలకు తగిన మార్గదర్శకాలు జారీచేసినట్టు ఆయన తెలిపారు.
కరోనావైరస్ పై పోరాటంలో వాక్సినేషన్ అనేది అతిపెద్ద ఆయుధమని అంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, మరింత ఎక్కువమంది పేషెంట్లు వాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.
కోవిడ్ చికిత్స, నిరోధానికి సంబంధించి ప్రచారంలో ఉన్న రకరకాల పుకార్లపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిందిగా ప్రధానమంత్రి వైద్యులకు పిలుపునిచ్చారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో ప్రజలు అనవసరంగా భయపడి బాధితులు కారాదని అన్నారు. ఆస్పత్రులలో చేరిన పేషెంట్లకు తగిన చికిత్సతోపాటు, వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రధానమంత్రి సూచించారు. ఇతర వ్యాధులకు సంబంధించి అత్యవసరం కాకపోతే, చికిత్స అందించడానికి టెలిమెడిసిన్ విధానాన్ని వాడుకోవాలని ఆయన సూచించారు.
ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలలో వేగంగా విస్తరిస్తున్నదని అన్నారు. ఇలాంటి ప్రాంతాలలో వనరులను ఉన్నతీకరించడానికి వేగవంతమైన కృషి జరగాలన్నారు. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాలలో ఉన్న తమ సహచరులతో సంబంధాలు పెట్టుకుని వారికి ఆన్‌లైన్ ద్వారా కన్సల్టేషన్ ఇచ్చి కోవిడ్ కు సంబంధించిన అన్ని ప్రొటోకాల్స్ సక్రమంగా పాటించేలా చూడాలని ఆయన అన్నారు.
ప్రధానితో సమావేశం సందర్భంగా వైద్యులు తమ అనుభవాలను తెలియజేశారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వానికి వారు అభినందనలు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను వారుఏవిధంగా పెంచినదీ వివరించారు. ప్రజలు మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి వాటి ప్రాధాన్యతను వారు పునరుద్ఘాటించారు. అలాగే కోవిడ్‌తో సంబంధం లేని పేషెంట్లకు వైద్య మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచడం గురించి వారు నొక్కి చెప్పారు. సరైన రీతిలో మందులు వాడకపోవడం పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు వారు తెలిపారు.
ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి శ్రీ హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ, ప్రధానమంత్రికి ప్రిన్సిపుల్ సెక్రటరీ మన్‌సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ (హెచ్) సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్, కేబినెట్ సెక్రటరీ, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, కేంద్ర ఫార్మాసూటికల్ కార్యదర్శి, ఐసిఎంఆర్ డిజి డాక్టర్ బలరామ్ భార్గవ , వివిధ మంత్రిత్వశాఖలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు పాల్గొన్నారు.