దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమ ప్రగతిపై సమీక్షకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీకాల కార్యక్రమంలోని వివిధ అంశాలపై అధికారులు ఆయనకు సమగ్రంగా నివేదించారు. దేశంలో ప్రస్తుతం టీకాల లభ్యత, ఉత్పత్తి పెంపు దిశగా మార్గ ప్రణాళిక గురించి ప్రధానికి వారు వివరించారు. టీకాల ఉత్పత్తి పెంచడంలో వివిధ సంస్థలకు చేయూతనిస్తూ చేపట్టిన చర్యలను కూడా ఆయనకు తెలిపారు. ఈ మేరకు మరిన్ని ఉత్పత్తి యూనిట్లు, ముడి పదార్థాల సరఫరా, ఆర్థిక తోడ్పాటు వగైరాల రూపంలో కేంద్ర ప్రభుత్వం చురుగ్గా సహాయం అందిస్తున్నదని విశదీకరించారు.
ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ముందువరుస సిబ్బందిసహా 18-44 ఏళ్ల మధ్య/45పైబడిన వయో వర్గాలవారికి టీకాలివ్వడంపై ప్రస్తుత స్థితిని ప్రధానమంత్రి సమీక్షించారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో టీకాల వృథా స్థితిగతులను కూడా ప్రధాని సమీక్షించారు. టీకాల వృథా ఇప్పటికీ హెచ్చు స్థాయిలో ఉన్నదని, దీన్ని బాగా తగ్గించడానికి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులను ప్రధాని ఆదేశించారు. టీకాలిచ్చే ప్రక్రియను ప్రజలకు మరింత సన్నిహితం చేయడం కోసం సాంకేతికపరంగా తీసుకున్న చర్యల గురించి అధికారులు ప్రధానికి తెలిపారు.
టీకాల లభ్యతపై రాష్ట్రాలకు ముందస్తు సమాచారం అందుబాటులో ఉంచినట్లు అధికారులు ప్రధానమంత్రి వివరించారు. అలాగే ప్రజలకు అసౌకర్యం నివారణలో భాగంగా ఈ సమాచారాన్ని జిల్లా స్థాయి వరకూ అందించాలని రాష్ట్రాలను కోరినట్లు వారు ప్రధానికి వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ, హోం, ఆర్థిక, వాణిజ్య-పరిశ్రమల, సమాచార-ప్రసార శాఖల మంత్రులతోపాటు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, మంత్రిమండలి కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర ముఖ్యమైన విభాగాల ప్రధానాధికారులు పాల్గొన్నారు.