రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి & మాల్దీవులు అధ్యక్షుల వారి ప్రత్యేక దూత డాక్టర్ మొహమ్మద్ అసిమ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం స్వాగతం పలికారు.
వారు ఉభయులు ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి తో పాటు హిందూ మహా సముద్రంలో సముద్ర సంబంధిత ఉమ్మడి ప్రయోజనాలు పెనవేసుకొని ఉన్నటువంటి సన్నిహిత ఇరుపొరుగు దేశాలైన భారతదేశం, మాల్దీవుల మధ్య సంబంధాలను గురించి చర్చించారు. మాల్దీవులు అనుసరిస్తున్న ‘‘ఇండియా ఫస్ట్’’ విధానంలో భాగంగా భారతదేశంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి తమ దేశం కట్టుబడి ఉన్నట్లు మాల్దీవుల ప్రత్యేక దూత శ్రీ అసిమ్ పునరుద్ఘాటించారు.
మాల్దీవులు కు భారతదేశం ఎల్లప్పటికీ సన్నిహితమైనటువంటి మరియు ఆధారపడదగినటువంటి పొరుగు దేశంగా ఉంటుందని, మాల్దీవుల పురోగతికి మరియు భద్రతకు తోడ్పాటును అందిస్తుంటుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
మాల్దీవులు లో పర్యటించవలసిందిగా అధ్యక్షులు శ్రీ యామీన్ ప్రధాన మంత్రి కి ఆహ్వానం పలుకుతున్నారంటూ ప్రత్యేక దూత శ్రీ అసిమ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ ఆహ్వానానికి గాను ప్రధాన మంత్రి తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు; అనుకూల సమయంలో పర్యటించేందుకు అంగీకారం తెలిపారు.
ప్రధాన మంత్రికి అధ్యక్షులు శ్రీ అబ్దుల్లా యామీన్ యొక్క శుభాకాంక్షలను ప్రత్యేక దూత అందజేశారు. ఇందుకుగాను ప్రధాన మంత్రి తాను సైతం ఆప్యాయంగా శ్రీ యామీన్ కు శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.