ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 1న ‘యుఎఇ’లోని దుబాయ్ లో కాప్-28 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ‘వాతావరణ ఆర్థిక పరివర్తన’పై అధ్యక్షస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. వర్ధమాన దేశాలకు వాతావరణ ఆర్థిక సహాయం మరింత అధికంగా, సులభంగా, అందుబాటులో ఉండేవిధంగా చూడటంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది.
ఈ సమావేశంలో ‘కొత్త ప్రపంచ వాతావరణ ఆర్థిక చట్రం‘పై దేశాధినేతలు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఇందులో ఇతరత్రా అంశాలతోపాటు హామీలను నెరవేర్చడం, ప్రతిష్టాత్మక నిర్ణయాలను అమలు చేయడం, వాతావరణ కార్యాచరణకు సంబంధించి రాయితీతో ఆర్థిక వనరుల సమీకరణను విస్తృతం చేయడం వంటివి అంతర్భాగంగా ఉన్నాయి.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దక్షిణార్థ గోళ దేశాల సమస్యలను వివరించారు. అలాగే వర్ధమాన దేశాలు తమ వాతావరణ కార్యాచరణ లక్ష్యాలను సాధించడంతోపాటు జాతీయ లక్ష్యాలను చేరుకునేందుకు తగిన వనరులను సమకూర్చగల... ప్రత్యేకించి వాతావరణ ఆర్థిక వ్యవస్థను అందుబాటులోకి తేవాల్సిన ఆవశ్యకతను ఆయన పునరుద్ఘాటించారు. కాప్ సదస్సులో భాగంగా
‘లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్‘తోపాటు యుఎఇ వాతావరణ పెట్టుబడుల నిధి ఏర్పాటుపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
వాతావరణ ఆర్ధిక సహాయానికి సంబంధించి కింది అంశాలను నెరవేర్చాలని కాప్-28కు ప్రధాని పిలుపునిచ్చారు:
- వాతావరణ ఆర్థిక సహాయంపై కొత్త సామూహిక పరిమాణాత్మక లక్ష్య సాధనలో ప్రగతి
- హరిత వాతావరణ నిధి-అమలు నిధికి అదనపు విరాళాలు
- వాతావరణ కార్యాచరణ కోసం ‘ఎండిబి’ల ద్వారా ఆర్థిక సహాయం అందుబాటు
- అభివృద్ధి చెందిన దేశాల కర్బన పాదముద్ర 2050 సంవత్సరానికి ముందే తొలగింపు