చెన్నై లో జరిగిన తుగ్లక్ తమిళ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఆ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, గత 50 సంవత్సరాలు గా తుగ్లక్ పత్రిక ప్రశంసనీయమైన ప్రగతి ని సాధించిందన్నారు. పత్రిక వ్యవస్థాపకుడు కీర్తిశేషుడు శ్రీ చో రామస్వామి ఈ సందర్భం లో మన మధ్య లేకపోవడం పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. ఆ పత్రిక ఎప్పుడూ వాస్తవాలను ప్రచురిస్తూ ఎంతో తెలివైన వాదాలతో, చమక్కుల తో వార్తలను అందించేది అని ప్రధాన మంత్రి అన్నారు.
తమిళ నాడు యొక్క క్రియాశీలత్వం
తమిళ నాడు యొక్క క్రియాశీలత్వాన్ని గురించి ప్రదాన మంత్రి ప్రస్తావిస్తూ, శతాబ్దాల తరబడి యావత్తు జాతి కి ఒక మార్గదర్శక జ్యోతి గా ఉంటూ వచ్చింది అన్నారు.
“తమిళ నాడు యొక్క క్రియాశీలత్వం, తమిళ ప్రజలు నాకు సదా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటారు. తమిళ నాడు శతాబ్దాల పాటు జాతి కి ఒక మార్గదర్శక జ్యోతి వలె నిలచింది. ఇక్కడ ఆర్థిక విజయాలు సామాజిక సంస్కరణల తో మిళితమై వుంటాయి. ప్రపంచం లోని ప్రాచీన భాష కు తమిళ నాడు పుట్టినిల్లు. గత సెప్టెంబర్ లో ఐక్య రాజ్య సమితి లోని ప్రసంగం లో కొన్ని వాక్యాలు తమిళం లో మాట్లాడే భాగ్యం నాకు లభించింది” అని ప్రధాన మంత్రి అన్నారు.
తమిళ నాడు కు డిఫెన్స్ కారిడార్
తమిళ నాడు అభివృద్ధి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దేశం లోని రెండు రక్షణ కారిడార్లలో ఒక కారిడార్ ను తమిళ నాడు లో ఏర్పాటు చేయడం వంటి పలు చర్య లను కేంద్ర ప్రభుత్వం తీసుకొంటోంది అన్నారు.
“దేశం లోని రెండు రక్షణ కారిడార్ లలో ఒక కారిడార్ ను తమిళ నాడు లో నెలకొల్పాలన్న నిర్ణయం కూడా అందులో ఒకటి అని ఆయన అన్నారు. గత కొన్ని సంవత్సరాలు గా తమిళ నాడు అభివృద్ధి కి కని విని ఎరుగనటువంటి ప్రయత్నాలు జరిగాయి. దేశం లో రెండు రక్షణ కారిడార్ ల ఏర్పాటు కోసం తీసుకున్న నిర్ణయం సందర్భం లో ఆ రెండిటి లో ఒక కారిడార్ ను ఏర్పాటు చేసేందుకు తమిళ నాడు తిరుగు లేని ఎంపిక గా నిలచింది. ఈ కారిడార్ రాష్ట్రాని కి మరిన్ని పరిశ్రమల ను తీసుకు వస్తుంది. తమిళ యువత కు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి” అని ప్రధాన మంత్రి అన్నారు.
జౌళి, మత్స్య పరిశ్రమ రంగాల కు దన్ను
రాష్ట్రం లో టెక్స్ టైల్ రంగాన్ని ఆధునికీకకరించేందుకు ప్రత్యేక చర్య లు తీసుకొంటున్నట్టు ప్రధాన మంత్రి చెప్పారు.
“తమిళ నాడు పురోగతి లో టెక్స్ టైల్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. పౌరుల కు సహాయం గా ఉండేందుకు ఆ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరిస్తోంది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం లో భాగం గా రాష్ట్రాని కి ఆర్థిక సహాయాన్ని అందించింది. రాష్ట్రం లో రెండు మెగా హ్యాండ్ లూమ్ క్లస్టర్ లు ఏర్పాటు కానున్నాయి. యంత్ర పరికరాల ఆధునికీకరణ కు కూడా వనరుల ను కేటాయించడమైంది” అని ప్రధాన మంత్రి అన్నారు.
రాష్ట్రం లో మత్స్య పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యల ను చేపడుతున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
‘‘దేశం లోని వర్థమాన రంగాల లో ఫిషరీస్ కూడా ఒకటి. ఫిషరీస్ రంగాన్ని మరింత చలనశీలం గా మేము తీర్చిదిద్దుతాము.
సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సహాయం, మానవ వనరుల అభివృద్ధిపై మేం ప్రధానం గా దృష్టి ని కేంద్రీకరిస్తున్నాము. కొద్ది రోజుల క్రితం తమిళ నాడు మత్స్యకారుల కు డీప్ సీ ఫిశింగ్ పడవల ను, ట్రాన్స్ పోండర్ లను అందించాము. మత్స్యకారులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డుల అనుసంధానం కల్పిస్తున్నాము. మత్స్యకారుల కోసం కొత్త ఫిశింగ్ హార్బర్ లు నిర్మించాము. పడవ ల ఆధునికీకరణ కు కూడా సహాయాన్ని అందించడం జరుగుతుంది” అని ప్రధాన మంత్రి అన్నారు.
పర్యాటకానికి ఉత్తేజం
రాగల రెండు సంవత్సరాల లో దేశం లోని కనీసం 15 పర్యాటక స్థలాల ను సందర్శించాలని ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. టూరిజం రంగం అభివృద్ధి కి ప్రభుత్వం ప్రాధాన్యాన్ని ఇస్తోందని చెప్పారు. వరల్డ్ ఇకనోమిక్ ఫోరమ్ ఇచ్చే పర్యాటక పోటీ సామర్థ్య సూచి లో భారతదేశం 34వ ర్యాంకు లో నిలచింది. 2014వ సంవత్సరం లో ఎన్ డిఎ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి అంటే ఐదు సంవత్సరాల క్రితం భారతదేశం 65వ ర్యాంకు లో ఉంది.
“గత ఐదేళ్ల కాలం లో భారతదేశాని కి విదేశీ పర్యాటకుల రాక పోక లు గణనీయం గా పెరిగాయని తెలియచేయడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే పర్యాటక రంగం నుండి విదేశీ మారక ద్రవ్యం ఆదాయం కూడా పెరిగింది” అని ప్రధాన మంత్రి చెప్పారు.
“కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల నుండి తమిళ నాడు ఎంతో ప్రయోజనాన్ని పొందిందని తెలియడం మీకు ఆనందదాయకం గా ఉంటుంది. చెన్నై నుండి కన్యకుమారి కోస్టల్ సర్క్యూట్, కాంచీపురం, వెల్లంకలిలను మరింత పర్యాటక స్నేహపూర్వక ప్రదేశాలు గా అభివృద్ధి చేస్తాము” అని ప్రధాన మంత్రి అన్నారు.
న్యూ ఇండియా- నూతన దశాబ్దం
“ప్రస్తుతం భారతదేశం కొత్త దశాబ్దిలో అడుగు పెడుతోంది. భారతదేశాన్ని అభివృద్ధి పథం లో కొత్త శిఖరాల కు చేర్చే వారు ప్రజలే. మహోన్నతమైన మన మన నాగరకత వర్ధిల్లడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్టు గా నేను విశ్వసిస్తాను. భారతదేశం అనుసరించే సామరస్యం, భిన్నత్వం, సహోదర భావం వాటి లో ఒకటైతే ప్రజల నమ్మకం, శక్తి రెండో కారణం. ఏదైనా చేయాలని దేశ ప్రజలు ఒకసారి సంకల్పించుకున్నారంటే వారి ని నిలువరించగల శక్తి ఏదీ లేదు” అని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ శక్తి ని గౌరవించి దానితో కలిసి సాగాలని ప్రసార మాధ్యమాల కు ఆయన సూచించారు.
“ప్రభుత్వాలు అయినా, ప్రసార మాధ్యమాలు అయినా మనం ఈ స్ఫూర్తి ని గౌరవించాలి. ఆ వేగాన్ని అందుకొనే విధం గా సాగాలి. ఇక్కడ మీడియా భూమిక ను కూడా నేను ప్రశంసిస్తున్నాను. స్వచ్ఛతా ఉద్యమం కావచ్చు, ఒక సారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ నిర్మూలన కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు.. నిజాయతీ గా చేపట్టిన ఏ కార్యక్రమాన్ని అయినా దాని ని ముందుకు నడిపించింది వారే. రానున్న కాలం లో కూడా ఇదే స్ఫూర్తి మరింత గా కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.
Here is my message at the programme marking 50 years of Thuglak. Paid tributes to the versatile and indomitable Cho, highlighted how the spirit of 130 crore Indians is powering transformations and some of the Centre’s efforts for Tamil Nadu’s progress. https://t.co/6mnUz0wZsO
— Narendra Modi (@narendramodi) January 14, 2020