ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఇజ్రాయెల్ ప్రధాని గౌరవనీయ బెంజమిన్ నెతన్యాహుతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద 2021 జనవరి 29నాటి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రధానమంత్రి తెలిపారు. భారతదేశంలోని ఇజ్రాయెల్ భవనాలు, దౌత్యవేత్తల రక్షణ, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని నెతన్యాహూకు హామీ ఇచ్చారు. ఈ దిశగా తమకు అందుబాటులోగల అన్ని మార్గాల్లోనూ ఏర్పాటు చేస్తామని, దాడులకు పాల్పడిన దుండగులను పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో భారత, ఇజ్రాయెల్ భద్రత సంస్థలు సన్నిహిత సమన్వయంతో చర్యలు తీసుకోవడంపై నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు.
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమతమ దేశాల్లో తీసుకున్న చర్యలను, ప్రగతిని వారు పరస్పరం తెలియజేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సహకారానికిగల అవకాశాలపైనా వారు చర్చించారు.