ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ యునైటెడ్ కింగ్‌డమ్ రాజు మాననీయ చార్లెస్-IIIతో ఫోన్ ద్వారా సంభాషించారు. సర్వసత్తాక యునైటెడ్ కింగ్‌డమ్ రాజుగా బాధ్యతలు చేపట్టిన మాననీయ చార్లెస్-IIIతో మొట్టమొదటి సారి మాట్లాడిన నేపథ్యంలో రాచరిక బాధ్యతల నిర్వహణలో ఆయన విజయవంతం కావాలంటూ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అనేక పరస్పర ప్రయోజన అంశాలపై వారిద్దరూ చర్చించారు. ఈ మేరకు వాతావరణ మార్పు కార్యాచరణ, జీవవైవిధ్య పరిరక్షణ, ఇంధన పరివర్తన దిశగా ఆవిష్కరణాత్మక పరిష్కరాల కోసం ఆర్థిక తోడ్పాటు తదితరాలు వారి సంభాషణల్లో చోటు చేసుకున్నాయి. ఈ అంశాలపై ఆయన చూపిన ఆసక్తితోపాటు రాజు వెలిబుచ్చిన సానుకూల0 అభిప్రాయాలను ప్రధానమంత్రి ప్రశంసించారు.
మరోవైపు జి20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో డిజిటల్ ప్రజా శ్రేయో చర్యలకు ప్రాచుర్యంసహా భారత ప్రాథమ్యాల గురించి ప్రధానమంత్రి గౌరవనీయులైన రాజుకు వివరించారు. పర్యావరణం కోసం జీవనశైలి ‘లైఫ్’ ఔచిత్యం గురించి కూడా ఆయన ఈ సంభాషణ సందర్భంగా రాజుకు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ హిత జీవనశైలిని ప్రోత్సహించాలన్న భారత్ సంకల్పం గురించి ఆయనకు చెప్పారు.
దేశాధినేతలిద్దరి చర్చల్లో భాగంగా కామన్‌వెల్త్ దేశాల కూటమి పనితీరును మరింత బలోపేతం చేయడంపై వారు తమ అభిప్రాయాలను పరస్పరం వెల్లడించుకున్నారు. రెండు దేశాల మధ్య ‘సజీవ వారధి’గా ద్వైపాక్షిక సంబంధాలను సుసంపన్నం చేయడంలో యూకేలోని భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను వారిద్దరూ ప్రశంసించారు.