‘‘గత 10 సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు విశ్వాసాన్ని పునః ప్రకటించారు. మూడోసారి కూడా సత్పరిపాలన అందించే అవకాశం మాకు ఇచ్చారు’’
‘‘జన సేవ హై ప్రభు సేవ అంటే మానవ సేవే మాధవ సేవ’’ అనే విశ్వాసంతో పౌరులకు మేం కట్టుబాటుతో అందించిన సేవలను ప్రజలు గమనించారు’’
‘‘అవినీతికి ఏ మాత్రం అవకాశం కల్పించని వైఖరికి ప్రజలు బహుమతి ఇచ్చారు’’
‘‘మేం తుష్టీకరణ్ కోసం కాకుండా సంతుష్టీకరణ్-బుజ్జగింపు ధోరణి కాకుండా కోసం సంతృప్తత కోసం మేం పని చేశాం’’
‘‘140 కోట్ల మంది భారతీయుల విశ్వాసం, అంచనా, నమ్మకమే అభివృద్ధికి చోదకశక్తిగా నిలిచింది’’
‘‘జాతి ప్రథమం అన్నదే మా లక్ష్యం’’
‘‘దేశం అభివృద్ధి చెందితే భవిష్యత్ తరాల కలలు నెరవేరడానికి బలమైన పునాది ఏర్పడుతుంది’’
‘‘మూడో విడత పాలనలో మూడు రెట్లు వేగంతో మేం పని చేస్తాం, మూడు రెట్లు అధిక శక్తిని వినియోగిస్తాం, మూడు రెట్లు అధిక ఫలితాలు అందిస్తాం’’

పార్లమెంటులో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో జరిగిన చర్చకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానం ఇచ్చారు.

సభనుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటులో రాష్ర్టపతి  ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఆ ప్రసంగంలో వికసిత్ భారత్ ఆలోచనకే ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. అలాగే రాష్ర్టపతి తన ప్రసంగంలో అనేక కీలక అంశాలు ప్రస్తావించారని చక్కని మార్గనిర్దేశం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.  

రాష్ర్టపతి ప్రసంగంపై నిన్న, నేడు పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు తెలియచేశారని, సభా నిబంధనలను గౌరవించి రాష్ర్టపతి ప్రసంగంపై తమ అభిప్రాయాలు తెలియచేసినందుకు తొలిసారిగా లోక్ సభ సభ్యులైన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి ప్రవర్తనా ధోరణి కూడా పరిణతి చెందిన సభ్యులకు  ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందని, వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు సభలో చర్చను సుసంపన్నం చేశాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఓటర్లకు కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ప్రజలు వరుసగా మూడో సారి కూడా ప్రస్తుత ప్రభుత్వాన్నే ఎన్నుకున్నారని, ఇది ప్రజాస్వామ్య ప్రపంచానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసిన పనులే వోటర్ల నిర్ణయానికి పునాది అని, ‘‘జన్ సేవ హి ప్రభు సేవ’’ అంటే మానవ సేవే మాధవ సేవ అన్నది మాత్రమే ప్రభుత్వ కట్టుబాటు అని  ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారిగా అతి తక్కువ వ్యవధిలో 25 కోట్ల మంది పైగా పేదలను పేదరికం నుంచి వెలుపలికి తెచ్చినట్టు ఆయన ప్రస్తావించారు. 

2014 సంవత్సరం తర్వాత ప్రభుత్వం అవినీతిని ఏ మాత్రం సహించని వైఖరి అవలంబించిందంటూ ఆ కారణంగానే ఓటర్లు తమను తిరిగి అధికారంలోకి తెచ్చారని పునరుద్ఘాటించారు. ‘‘నేడు భారతదేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడింది. నేడు ప్రతీ ఒక్క భారతీయుడు గర్వపడుతున్నాడు’’ అని ఆయన అన్నారు. తన ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, పని అన్నింటిలోనూ భారతదేశమే ప్రాధాన్యతాంశమని శ్రీ మోదీ వెల్లడించారు. ప్రపంచ యవనికపై భారతదేశం పట్ల దృక్ప‌థం ఎంతో మారిందని, అందుకు ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానాలు లేదా నిర్ణయాలకు ‘‘జాతి ప్రథమం’’ అన్నదే ప్రాతిపదిక అని, ఆ విశ్వాసంతోనే దేశం యావత్తు సంస్కరణల ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తున్నదని ప్రధానమంత్రి శ్రీ మోదీ చెప్పారు. గత 10 సంవత్సరాల కాలంలో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మంత్రం, ‘‘సర్వ పంత్ సంభవ్’’అంటే అన్ని మతాలు సమానం అనే సిద్ధాంతం ఆధారంగానే ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం పని చేసిందని తెలిపారు.

భారతదేశం దీర్ఘకాలం పాటు బుజ్జగింపు రాజకీయాలు, బుజ్జగింపు పాలనా ధోరణులు దీర్ఘకాలంగా అనుసరించిందని శ్రీ మోదీ అన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వం సంతృప్తితో కూడిన సెక్యులరిజం, ప్రజల సమ్మతి కోసం పని చేసిందని చెప్పారు. తన వరకు సంతృప్తి అంటే వివిధ ప్రభుత్వ విధానాల పట్ల పరిపూర్ణత సాధించడం, వరుసలోని చివరి వ్యక్తికి కూడా సేవ చేయడం అని ప్రధానమంత్ర నొక్కి చెప్పారు. తన వరకు సంతృప్త‌త అంటే సామాజిక న్యాయం, సెక్యులరిజం చిత్తశుద్ధితో ఆచరిండమేనని, మూడో సారి కూడా అధికారం చేపట్టేలా ప్రజలు ఆ వైఖరిని ఆమోదించారని శ్రీ మోదీ అన్నారు.

ఈ ఎన్నిక భారతదేశ ప్రజల పరిణతిని, ఆదర్శాన్ని మరోసారి నిరూపించిందని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘ప్రజలు మా విధానాలు, ఆలోచనలు, కట్టుబాటు పట్ల విశ్వాసం ప్రకటించారు’’ అని ప్రధానమంత్రి తెలిపారు. అలాగే వికసిత్ భారత్ సంకల్పానికి కూడా ప్రజలు ఈ ఎన్నిక ద్వారా ఆమోదముద్ర వేశారని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి చెందిన భారత్ ప్రాధాన్యతను నొక్కి చెబుతూ దేశం పురోగమిస్తే ప్రతీ ఒక్క పౌరుని కలలు సాకారం అవుతాయి. అదే సమయంలో భవిష్యత్ తరాల ఆకాంక్షలు నెరవేరేందుకు బలమైన పునాది పడుతుంది అని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి చెందిన భారత్  ప్రయోజనాలు అంది పుచ్చుకునేందకు ప్రజలందరూ అర్హులేనని ఆయన చెప్పారు. పూర్వపు తరాలన్నీ ఆ ప్రయోజనాల కోసం ఎంతగానో ఎదురు చూశారన్నారు. వికసిత్ భారత్ సాకారంతో దేశంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల జీవన స్థితిగతులు, జీవన నాణ్యత ఎంతో పెరుగుతాయని; ప్రజలను గర్వపడేలా చేయడంతో పాటు అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ‘‘ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందిన నగరాల రీతిలోనే భారత నగరాలు కూడా సమాన భాగస్వాములవుతాయి’’ అని హామీ ఇచ్చారు.

వికసిత్ భారత్ అంటే దేశంలోని ప్రతీ ఒక్క పౌరునికి బహుళ, సమానావకాశాలు అందుబాటులోకి రావడమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతీ ఒక్కరికీ నైపుణ్యాలు, వనరులు, సామర్థ్యానికి లోబడి వృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుందన్నారు.

వికసిత్ భారత్ కల సాకారం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ హామీ ఇచ్చారు. ‘‘మాకున్న సమయంలో ప్రతీ ఒక్క క్షణం, మా శరీరంలో ప్రతీ ఒక్క కణం వికసిత్ భారత్ సాకారం చేయడానికే’’ అంటే ‘‘2047 కోసం 24 బై 7’’ అన్నది తమ కట్టుబాటు అని తెలిపారు.

2014 సంవత్సరానికి ముందు కాలం నాటి పరిస్థితి గురించి ప్రధానమంత్రి గుర్తు చేస్తూ నాడు యావద్దేశం ఎంతో నిరాశావహ స్థితిలో ఉందన్నారు. పౌరుల్లో విశ్వాసం కోల్పోవడం జాతి మొత్తానికే పెద్ద నష్టమని,  ఆ స్థితి అందరిలోనూ నిరాశావహ స్థితిని కల్పించిందని ప్రదానమంత్రి చెప్పారు. అది కుంభకోణాలు, విధానపరమైన క్రియారాహిత్యం రాజ్యం ఏలిన కాలమని పేర్కొంటూ దేశం అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడమే అందుకు తార్కాణమని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు ఆశలన్నీ పూర్తిగా వదిలేసుకున్నారని చెప్పారు. ఇల్లు కావచ్చు, గ్యాస్ కనెక్షన్ కావచ్చు, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందుకోవడం కావచ్చు అన్నింటికీ లంచం ఒక సాధారణ నియమంగా మారిపోయిందని చెప్పారు.

2014 సంవత్సరానికి ముందు దేశ ప్రజలు తాము రోజువారీ అనుభవిస్తున్న దుర్భర జీవితానికి కారణం విధిరాత అని నిందించుకోవడం పరిపాటి అయిందని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘అలాంటి సమయంలో వారు మమ్మల్ని ఎన్నుకున్నారు. మార్పునకు నాంది పలికారు’’ అని చెప్పారు.

ఏదీ సాధ్యం కాదు అనే భావన నుంచి ఏదైనా సాధ్యమే అనే భావనలోకి ప్రజల ఆలోచనా ధోరణిని మార్చే దిశగా ప్రభుత్వం చేసిన కృషిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రభుత్వ విజయాలను ఒక్కోటిగా తెలియచేస్తూ 5జి సేవలు విజయవంతంగా ప్రవేశపెట్టడం, గరిష్ఠ స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని సాధించడం, బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ఠం చేయగల విధంగా పరివర్తిత విధానాలు అనుసరించడం, ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించని విధానం అనుసరించడం, 370 అధికరణం రద్దు వాటిలో ప్రధానమైనవని చెప్పారు. ‘‘370వ అధికరణం గోడలు బద్దలు కొట్టడంతో ప్రజాస్వామ్యం బలోపేతం అయింది’’ అంటూ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని తెలియచేశారు.

‘‘140 కోట్ల మంది పౌరుల నమ్మకం, ఆకాంక్షలు, విశ్వాసమే అభివృద్ధికి చోదకశక్తి’’ అని ప్రధానమంత్రి అన్నారు. కట్టుబాటుతోనే ఈ విశ్వాసం ఏర్పడిందన్నారు.

నేడు పౌరులందరూ అభివృద్ధి చెందిన భారత్ నిర్మించాలన్న సంకల్పంతో స్వాతంత్ర్య పోరాట సమయంలో ఉన్న తరహాలో ఎంతో ఉత్సాహంగా, విశ్వాసంగా ఉన్నారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. గత 10 సంవత్సరాల కాలంలో దేశం సాధించిన పురోగతిని కొనియాడుతూ ‘‘నేడు భారత్ తనతో తనే పోటీ  పడాల్సిన అవసరం ఉంది. మనం అన్ని రికార్డులను బ్రేక్ చేసి దేశాన్ని తదుపరి లెవెల్ కి నడిపించాలి’’ అని ప్రధానమంత్రి చెప్పారు. భారతదేశం గత 10 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధి ఇతరులకు ఒక బెంచ్ మార్క్ అయిందని పిఎం శ్రీ మోదీ అన్నారు. ‘‘మేంద ప్రతీ ఒక్క రంగాన్ని తదుపరి లెవెల్ కి నడిపిస్తాం’’ అంటూ దేశం వేగవంతమైన పురోగతి సాధించగలదన్న విశ్వాసం ఆయన ప్రకటించారు.

గత 10 సంవత్సరాల కాలంలో భారతదేశం ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగిందని చెబుతూ త్వరలోనే ప్రపంచంలోని 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్న విశ్వాసం శ్రీ మోదీ ప్రకటించారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ ఫోన్ల తయారీ, ఎగుమతి దేశం అని చెప్పారు. తమ ప్రభుత్వ మూడో విడత అధికార కాలంలో సెమీకండక్టర్ల విభాగంలో కూడా ఆ స్థాయిని చేరకుంటామని ప్రధానమంత్రి శ్రీ మోదీ విశ్వాసం ప్రకటించారు.

జాతి కొత్త మైలురాళ్లు నమోదు చేస్తూ నూతన శిఖరాలకు చేరుతున్నప్పటికీ ప్రభుత్వం సగటు పౌరుల సేవకే ప్రాధాన్యం ఇస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. తమ అధికార కాలంలో 4 కోట్ల పక్కా ఇళ్లు పేదలకు అందించామని, రాబోయే రోజుల్లో మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని శ్రీ మోదీ చెప్పారు. దేశంలో పెరుగుతున్న మహిళల స్వయం సహాయక గ్రూప్ ల గురించి ప్రస్తావిస్తూ 3 కోట్ల లక్షాధికారి దీదీలను తయారుచేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. తమ మూడో విడత అధికార కాలంలో మూడింతలు వేగంగా పని చేసి మూడు రెట్లు అధిక ఫలితాలు సాధించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

60 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో తమ ప్రభుత్వం వరుసగా మూడో సారి కూడా అధికారంలోకి వచ్చిందంటూ తాము ప్రజల్లో కలుగచేసిన విశ్వాసం, అలుపెరుగని కృషి అందుకు కారణమని ప్రధానమంత్రి అన్నారు. ‘‘సంకుచిత రాజకీయాల ద్వారా ఇలాంటి ఘనత సాధించలేం, కేవలం ప్రజల ఆశీస్సులతోనే అవి సాధ్యం’’ అంటూ ప్రజలు సుస్థిరత, కొనసాగింపునే ఎంచుకున్నారని పిఎం శ్రీ మోదీ చెప్పారు.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును కూడా ప్రధానమంత్రి కొనియాడారు. అంతకు ముందు రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందించిన భారీ విజయాల గురించి కూడా ప్రస్తావించారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో ఓటింగ్  శాతం పెరగడం గురించి కూడా ప్రస్తావిస్తూ ‘‘జనతా, జనార్దన్ మా వైపే ఉన్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవలి లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి ప్రస్తావిస్తూ ప్రజల సందేశాన్ని హుందాతనంతో అర్ధం చేసుకోవాలని ప్రతిపక్షాన్ని ప్రధానమంత్రి కోరారు.

ప్రజలు అభివృద్ధి బాటనే ఎంచుకున్నారు, వికసిత్ భారత్ లక్ష్యం సాకారం కావాలని కోరుతున్నారని ఆయన చెప్పారు. భారతదేశం కలిసికట్టుగా నూతన అభివృద్ధి బాటలో పురోగమిస్తున్న ఈ తరుణంలో గందరగోళం, చట్టరాహిత్యం, విభజన రాజకీయాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. దేశ స్థితిగతులకు ఏ మాత్రం సరిపోని ఆర్థిక విధానాల వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలోకి పోయి దేశం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. పవిత్రమైన చట్టసభ గౌరవం, హుందాతనం కాపాడేలా ప్రవర్తించాలని ప్రతిపక్షాన్ని కోరుతూ సభ పవిత్రత దెబ్బ తినకుండా ఉండేందుకు తగు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని స్పీకర్ కు సూచించారు.

ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ నాడు అధికారంలో ఉన్న వారు నియంతృత్వ వాతావరణం కల్పించి పౌరులపై కనివిని ఎరుగని క్రూరత్వం ప్రదర్శించారని, జాతికి కనివిని ఎరుగని అన్యాయం చేశారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. నూతన భారత రాజ్యాంగంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాల హక్కుల సంరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిరసన ప్రకటిస్తూ నాడు బాబా సాహెబ్ అంబేద్కర్ కేబినెట్ కు రాజీనామా చేసిన విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారు. అలాగే నాటి ప్రఖ్యాత నాయకులైన జగ్జీవన్ రామ్ జీ, చౌదరి చరణ్ సింగ్ జీ, సీతారామ కేసరిజీ వంటి వారిపై పాల్పడిన దురాగతాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు.

తత్వవేత్త స్వామి వివేకానంద చికాగో ప్రసంగాన్ని ఉటంకిస్తూ, ప్రపంచానికి సహనాన్ని, విశ్వవ్యాప్త ఆమోదాన్ని నేర్పిన మతానికి చెందినందుకు తాను గర్వపడుతున్నానని ప్రధాన మంత్రి అన్నారు. సహనం, హిందూ సమాజం ఐక్యతా స్ఫూర్తి వల్లనే భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం వర్ధిల్లాయని ఆయన అభిప్రాయపడ్డారు. నేడు హిందూ సమాజంపై తప్పుడు ఆరోపణలు, కుట్రలు చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారత సాయుధ దళాల సాహసాన్ని, శక్తిని శ్రీ మోదీ కొనియాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక సంస్కరణలు చేపట్టామని, సాయుధ దళాలను ఆధునీకరించడంతో పాటు ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనగల స్థాయిలో ఆయుధాలు అందించామని తెలిపారు. జాతి భద్రతకు అగ్రప్రాధాన్యం ఇస్తూ సాయుధ దళాలు ఎప్పుడైనా యుద్ధ సంసిద్ధంగా ఉండేలా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని నొక్కి చెప్పారు. థియేటర్ కమాండ్ ను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత గురించి శ్రీ మోదీ నొక్కి చెబుతూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) నియామకం అనంతరం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ వ్యవస్థ ఏర్పాటుకు జరుగుతున్న కృషిపై సంతృప్తి ప్రకటించారు.

ఆత్మ నిర్భర్ భారత్ లో మన సాయుధ దళాల స్వావలంబన కోసం చేపట్టిన పలు కీలక సంస్కరణలను ప్రముఖంగా ప్రస్తావించారు. సాయుధ దళాలు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి, సాయుధ సిబ్బందిలో యువతరం సంఖ్య పెంచాలి అని ఆయన నొక్కి వక్కాణించారు. జాతీయ భద్రత అనేది అత్యంత ప్రధానమైన అంశమని, అందుకే సాయుధ దళాల యుద్ధ సన్నద్ధత కోసం ప్రభుత్వం సకాలంలో సంస్కరణలు చేపట్టిందని శ్రీ మోదీ వివరించారు.

ఆయుధాలు కావచ్చు లేదా టెక్నిక్ లు కావచ్చు అన్నింటిలోనూ యుద్ధరంగం ముఖచిత్రం ఎంతగానో మారిపోయిన తరుణంలో ఆరోపణలు, అభియోగాలను తోసిరాజంటూ ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనగల రీతిలో సాయుధ దళాలను బలోపేతం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని శ్రీ మోదీ చెప్పారు. గతంలో ఎన్నో అవినీతి కుంభకోణాలు సాయుధ దళాల  బలోపేతాన్ని నిలువరించాయన్నారు.

దీర్ఘకాలం పాటు అమలుకు నోచుకోకుండా స్తంభించిపోయిన ‘‘ఒక ర్యాంక్, ఒకే పెన్షన్’’ విధానాన్ని తమ ప్రభుత్వం అమలుపరిచిందని శ్రీ మోదీ చెప్పారు. కొవిడ్ మహమ్మారి కష్ట కాలంలో కూడా ఒఆర్ఓపి అమలు కోసం తమ ప్రభుత్వం రూ.1.2 లక్షల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

ఇటీవల చోటు చేసుకున్న పేపర్ లీక్ గురించి ఆందోళన ప్రకటిస్తూ  భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా నివారించాలన్న కట్టుబాటుతో తాము ఉన్నట్టు విద్యార్థులకు ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.  ఈ బాధ్యతను నెరవేర్చేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నీట్-యుజి పేపర్ లీక్ సంఘటనతో సంబంధం ఉన్న పలువురిని ఇప్పటికే అరెస్టు చేసినట్టు తెలిపారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన చట్టం ప్రతిపాదించింది. మొత్తం స్క్రీనింగ్ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాం’’ అని శ్రీ మోదీ చెప్పారు.

‘‘గత 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అనేది ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద సంకల్పం’’ అని ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను తీర్చి దిద్దడం, ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన మంచినీరు అందించడం, పేదల్లో ప్రతీ ఒక్కరికీ పక్కా ఇళ్లు కల్పించడం, సాయుధ దళాలను స్వయం-సమృద్ధం చేయడం ద్వారా వాటిని బలోపేతం చేయడం, దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని ఉత్తేజితం చేయడం, హరిత హైడ్రోజెన్ కేంద్రంగా దేశాన్ని తీర్చి దిద్దడం, ఆధునిక మౌలిక వసతులు కల్పించడం; కొత్త ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధిని సాధికారం చేయడం, యువత భవిష్యత్తు తీర్చి దిద్దడం తమ సంకల్పాలని ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో దేశంలో గత 18 సంవత్సరాల కాలంలోనే అత్యధికంగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన జరిగినట్టు తేలిదని ప్రధానమంత్రి తెలియచేశారు.

డిజిటల్ ఇండియా ఉద్యమాన్ని కొనియాడుతూ ప్రపంచంలో డిజిటల్ చెల్లింపుల విధానానికి కరదీపికగా భారత్ నిలించిందని చెప్పారు. దేశంలో జరిగిన జి-20  శిఖరాగ్రం గురించి ప్రస్తావిస్తూ చివరికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారతదేశంలోని డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ చూసి  ఆశ్చర్యపోయినట్టు తెలిపారు.

భారతదేశ పురోగతితో పోటీ, కొత్త సవాళ్లు కూడా ఏర్పడుతున్నాయంటూ భారతదేశ  పురోగతిని ఒక సవాలుగా భావించి దాన్ని దెబ్బ తీయడం లక్ష్యంగా భారత ప్రజాస్వామ్యం, జనాభా ప్రయోజనం, భిన్నత్వాలను నిర్వీర్యపరిచేందుకు ఎలాంటి ప్రయత్నం చేసినా సహించేది లేదని ప్రధానమంత్రి హెచ్చరించారు. ‘‘భారతదేశ పురోగతిని దెబ్బ తీసేందుకు, అనుమానాలు వ్యాపింపచేసి, దేశ పునాదులు బలహీనపరిచేందుకు బలమైన ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అలాంటి ప్రయత్నాలన్నింటినీ మూలంలోనే తుంచివేస్తాం’’ అన్న సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై సభలో తీవ్రంగా చర్చ జరగాలని నొక్కి చెబుతూ అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను శ్రీ మోదీ కోరారు. ‘‘జాతి వ్యతిరేక శక్తులను భారత్ ఎన్నడూ సహించదు’’ అని శ్రీ మోదీ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

భారతదేశ పురోగతిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తూనే లోటుపాట్లను కూడా అంతే నిశితంగా వీక్షిస్తోందని శ్రీ మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని నెరవేర్చే దిశగానే సభలో ప్రతీ ఒక్క సభ్యుడూ వ్యవహరించాలని ఆయన నొక్కి చెప్పారు. జాతి సంక్షేమం పరిగణనలోకి తీసుకుని సభ్యులందరూ ఈ సంకల్పం నెరవేర్చేందుకు ముందుకు రావాలని కోరారు. ‘‘పౌకరుల కలలు, ఆకాంక్షలు తీర్చడం లక్ష్యంగామనందరం కలిసికట్టగా భుజం భుజం కలిపి నడవాలి’’ అని శ్రీ మోదీ పిలుపు ఇచ్చారు. ప్రస్తుత శకంలో సానుకూల రాజకీయాల ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు. ‘‘సత్పరిపాలన, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మనందరం పోటీ పడదాం’’ అని ఆయన అన్నారు. 

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించడం పట్ల ప్రసంగంలో భాగంగా ప్రధానమంత్రి విచారం ప్రకటించారు. ఆ తొక్కిసలాటలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్ష ప్రకటించారు. రాష్ర్టప్రభుత్వం సోదా, సహాయక చర్యలను క్రియాశీలంగా నిర్వహిస్తోందని, కేంద్రానికి చెందిన సీనియర్ అధికారులు కూడా బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ర్టప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రధానమంత్రి సభకు తెలియచేశారు.

తొలిసారిగా సభ్యులుగా సభలో అడుగు పెట్టిన వారిని ప్రధానమంత్రి అభినందించారు. వారు నేర్చుకోవలసింది ఎంతో ఉన్నదని ఆయన అన్నారు. రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తమ ఆలోచనలు పంచుకున్నందుకు సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage