కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కేంద్ర బడ్జెట్ 2024-25 ను గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, దేశాన్ని అభివృద్ధి పరంగా కొత్త శిఖరాలకు ఖాయంగా తీసుకుపోయే ఈ సంవత్సరపు బడ్జెటు విషయంలో పౌరులందరికీ అభినందనలను తెలియజేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తో పాటు మంత్రి బృందం సభ్యులందరూ అభినందనీయులే అని ఆయన అన్నారు.
‘‘కేంద్ర బడ్జెట్ 2024-25 సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి సాధికారితను కల్పిస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ బడ్జెటు పల్లె ప్రాంతాల పేద రైతులను సమృద్ధి బాటలోకి తీసుకు పోతుందని ఆయన అన్నారు. 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చిన తరువాత, ఇటీవలె నవ్య మధ్యతరగతి ఉనికిలోకి వచ్చిందని ప్రధాన మంత్రి వివరిస్తూ, వారికి సాధికారితను కల్పించడాన్ని ఈ బడ్జెటు కొనసాగిస్తూనే లెక్కలేనన్ని ఉద్యోగ అవకాశాలను సమకూర్చుతుందన్నారు. ‘‘ఈ బడ్జెట్ విద్యకు, నైపుణ్యాభివృద్ధికి ఒక కొత్త విస్తృతిని ప్రసాదిస్తుంది’’ అని ఆయన అన్నారు. బడ్జెట్ లోని కొత్త పథకాలు మధ్యతరగతి, ఆదివాసీ సముదాయం, దళితులు మరియు వెనుకబడిన వర్గాల ప్రజల జీవితాలను పరిపుష్టం చేయాలన్న లక్ష్యాన్ని కలిగివున్నాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం బడ్జెటు చిన్న వ్యాపారాలకు, సూక్ష్మ, లఘు, మధ్యతరహా, వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) లకు ఒక కొత్త బాటను వేస్తూ, అదే కాలంలో ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యానికి కూడా పూచీ పడుతుందని ఆయన నొక్కి చెప్పారు. ‘‘తయారీతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర బడ్జెట్ ప్రోత్సాహాన్ని ఇస్తుంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆర్థిక వృద్ధిని ఈ బడ్జెటు కొనసాగిస్తూనే ఆర్థిక వృద్ధికి ఒక కొత్త బలాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగ కల్పనకు, స్వయంఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఉత్పాదకత తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకం సాఫల్యాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఉద్యోగ కల్పనతో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకం కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తుందంటూ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పథకంలో భాగంగా ఒక యువతికి లేదా యువకునికి వారి తొలి నౌకరీలో మొదటి జీతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు. ఉన్నత విద్యకు, ఒక కోటి మంది యువతీయువకులకు ఇంటర్న్ షిప్ కు ఉద్దేశించిన పథకాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘ఈ పథకంలో భాగంగా అగ్రగామి వ్యాపార సంస్థలలో పనిచేస్తూ, యువ ఇంటర్న్ లు అనేక కొత్త అవకాశాలను కనుగొనగలుగుతారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న నిబద్ధతను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ‘ముద్ర పథకం’లో భాగంగా పూచీకత్తు అక్కరలేని రుణాల పరిమితిని 10 లక్షల రూపాయల నుంచి పెంచి 20 లక్షలకు పెంచడాన్ని ప్రస్తావించారు. ఇది చిన్న వ్యాపారస్తులకు, మహిళలకు, దళితులకు, వెనుకబడిన వర్గాలవారికి మరియు నిరాదరణకు లోనైనవారికి ఎంతో ప్రయోజనకారి అవుతుందన్నారు.
భారతదేశాన్ని ప్రపంచంలో తయారీ కేంద్రం (గ్లోబల్ మేన్యుఫేక్చరింగ్ హబ్) గా తీర్చిదిద్దాలన్న నిబద్ధతను ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, దేశంలో మధ్యతరగతితో ఎమ్ఎస్ఎమ్ఇ కి ఉన్న బంధాన్ని, పేద ప్రజలకు ఉద్యోగ కల్పనలో ఎమ్ఎస్ఎమ్ఇ కి ఉన్న సత్తాను వివరించారు. చిన్న పరిశ్రమలకు పెద్ద శక్తి లభించేటట్లు బడ్జెటులో ఒక కొత్త పథకాన్ని ప్రకటించడమైందని, ఆ పథకం ఎమ్ఎస్ఎమ్ఇ లకు పరపతి పరమైన సౌలభ్యాన్ని పెంచుతుందని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘బడ్జెట్ లో చేసిన ప్రకటనలు తయారీని, ఎగుమతులను ప్రతి జిల్లా ముంగిటకు తీసుకుపోతాయి’’ అని ఆయన అన్నారు. ‘‘ఇ-కామర్స్, ఎగుమతి కేంద్రాలు (ఎక్స్ పోర్ట్ హబ్స్), ఆహార నాణ్యత పరీక్ష ప్రక్రియ.. ఇవి ‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’ కార్యక్రమానికి కొత్త జోరును అందిస్తాయి’’ అని ఆయన అన్నారు.
కేంద్ర బడ్జెట్ 2024-25 భారతదేశంలో అంకుర సంస్థ (స్టార్ట్-అప్) లకు, నూతన ఆవిష్కరణల వ్యవస్థకు అసంఖ్యాక అవకాశాలను మోసుకు వస్తుందని ప్రధాన మంత్రి అభివర్ణించారు. అంతరిక్ష ప్రధాన ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని సంతరించడానికి, ఒక వేయి కోట్ల రూపాయల కార్పస్ ఫండ్, ఏంజెల్ ట్యాక్స్ రద్దు లను ఆయన ఉదాహరించారు.
‘‘ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత అధిక స్థాయిలో మూలధన వ్యయం (కేపెక్స్) ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి లా మారనుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 12 కొత్త పారిశ్రామిక కేంద్రాలు (ఇండస్ట్రియల్ నోడ్స్), కొత్త శాటిలైట్ టౌన్స్, 14 ప్రధాన నగరాలలో రవాణా సంబంధ ప్రణాళికలను ఆయన ప్రస్తావించారు. ఈ చర్యలు దేశంలో కొత్త ఆర్ధిక కేంద్రాల (ఇకానామిక్ హబ్స్) అభివృద్ధికి దారితీసి, లెక్కలేనన్ని ఉద్యోగాలను సృష్టించనున్నాయని ఆయన అన్నారు.
రక్షణ సంబంధ ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకొన్న సంగతిని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, రక్షణ రంగాన్ని స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అనేక అంశాలను ఈ సంవత్సరపు బడ్జెటులో చేర్చడమైందన్నారు. భారత్ పట్ల ప్రపంచంలో ఆకర్షణ నిలకడగా పెరుగుతోంది, ఇది పర్యాటక పరిశ్రమలో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది అని ఆయన అన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో పర్యాటక రంగానికి ప్రాధాన్యాన్ని ఇచ్చినట్లు ఆయన తెలియజేస్తూ పర్యాటక పరిశ్రమ పేదలకు, మధ్యతరగతికి, ఎన్నో అవకాశాలను అందించనుందన్నారు.
గత పదేళ్ళలో పేదలకు, మధ్యతరగతికి పన్నుల సంబంధ ఉపశమనం లభించేటట్లు ప్రభుత్వం శ్రద్ధ వహించగా, ఈ సంవత్సరం బడ్జెటులో ఆదాయపు పన్నును తగ్గించేందుకు స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచేందుకు, టిడిఎస్ నియమాలను సరళతరం చేసేందుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడమైందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సంస్కరణలు పన్ను చెల్లింపుదారులకు మరింత డబ్బును ఆదా చేసుకొనే అవకాశాన్ని ఇస్తాయని ఆయన అన్నారు.
‘పూర్వోదయ’ దృష్టికోణంతో భారతదేశంలో తూర్పు ప్రాంతాలలో అభివృద్ధి ప్రక్రియ సరికొత్త జోరును, సరికొత్త శక్తిని పుంజుకోనుందని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘భారతదేశంలో తూర్పు ప్రాంతాలలో రహదారులు, జల పథకాలు, విద్యుత్తు పథకాల వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కొత్త ఉత్తేజాన్ని అందించడం జరుగుతుందని ఆయన అన్నారు.
‘‘దేశ రైతులపై ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టిని సారించింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధాన్య నిలవ పథకాన్ని అమలు చేసిన తరువాత, ఇక కాయగూరల ఉత్పత్తి క్లస్టర్ లను ప్రవేశపెట్టడం జరుగుతుంది; తత్ఫలితంగా ఇటు రైతులకు, అటు మధ్యతరగతికి మేలు చేకూరుతుంది అని ఆయన అన్నారు. ‘‘వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధంగా నిలవడం భారతదేశ తక్షణావసరం, అందుకని పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిని పెంచడంలో రైతులకు సాయపడడానికి కూడా తగిన చర్యలను ప్రకటించడమైంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
పేదరిక నిర్మూలన, పేద ప్రజలకు సాధికారిత కల్పనలకు సంబంధించిన ప్రధాన పథకాలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, పేదల కోసం దాదాపుగా మూడు కోట్ల ఇళ్ళను గురించి, ‘జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’ ను గురించి తెలియజేశారు. 5 కోట్ల ఆదివాసి కుటుంబాలకు కనీస సౌకర్యాలను జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ సమకూర్చుతుందన్నారు. అంతేకాకుండా, ‘గ్రామ్ సడక్ యోజన’ 25 వేల కొత్త గ్రామీణ ప్రాంతాలను ఏడాది పొడవునా రహదారుల సదుపాయంతో కలుపుతుందని, దీనితో అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.
‘‘ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ కొత్త అవకాశాలను, కొత్త శక్తిని, కొత్త ఉద్యోగ అవకాశాలతోపాటు, స్వయంఉపాధి అవకాశాలను తీసుకువచ్చింది’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ మెరుగైన వృద్ధిని, ప్రకాశవంతమైన భవిష్యత్తును తీసుకు వచ్చిందని ఆయన అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో, వికసిత్ భారత్ కు ఒక బలమైన పునాదిని వేయడంలో ఒక ఉత్ప్రేరకంగా నిలచే శక్తి బడ్జెట్ కు ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, తన ప్రసంగాన్ని ముగించారు.
Click here to read full text speech
#BudgetForViksitBharat benefits every segment of society. pic.twitter.com/IlKhCb2HMq
— PMO India (@PMOIndia) July 23, 2024
इस बजट में सरकार ने Employment Linked Incentive scheme की घोषणा की है।
— PMO India (@PMOIndia) July 23, 2024
इससे देश में करोड़ों नए रोजगार बनेंगे। #BudgetForViksitBharat pic.twitter.com/cWAnnt3I5h
#BudgetForViksitBharat opens up new avenues for StartUps and innovation ecosystem. pic.twitter.com/N5aFatddxd
— PMO India (@PMOIndia) July 23, 2024
इस बजट में भी income tax में कटौती और standard deduction में वृद्धि का बहुत बड़ा फैसला लिया गया है। #BudgetForViksitBharat pic.twitter.com/ki6qSsqqPU
— PMO India (@PMOIndia) July 23, 2024
#BudgetForViksitBharat focuses on welfare of farmers. pic.twitter.com/jnwiY76vsV
— PMO India (@PMOIndia) July 23, 2024