టుటుకోరిన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా తన సందేశం అందించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే దిశగా జరుగుతున్న భారతదేశ ప్రయాణంలో ఈ రోజు అత్యంత ముఖ్యమైనది అన్నారు. నూతనంగా ప్రారంభించుకుంటున్న టుటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్‌ను ‘భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాలలో కొత్త తార’గా అభివర్ణించారు. వి.వో చిదంబరనార్ నౌకాశ్రయ సామర్థ్యాన్ని విస్తరించడంలో దీని పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తూ, “14 మీటర్ల కంటే ఎక్కువ లోతైన డ్రాఫ్ట్, 300 మీటర్ల కంటే ఎక్కువ బెర్త్‌తో, ఈ టెర్మినల్ వి.ఓ.సి. నౌకాశ్రయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది" అన్నారు. కొత్త టెర్మినల్ పోర్టు వల్ల రవాణాపరమైన ఖర్చులు తగ్గి, భారతదేశానికి విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాని, రెండేళ్ల కిందట తన పర్యటనలో ప్రారంభించిన వి.ఓ.సి. సంబంధిత పలు ప్రాజెక్టులను గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ టెర్మినల్ ఉద్యోగుల్లో 40% మంది మహిళలు ఉండడం లింగ వైవిధ్యపరంగా ఈ ప్రాజెక్టు సాధించిన కీలక విజయంగా ప్రధాని పేర్కొన్నారు. సముద్ర రంగంలోనూ మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధికి ఇది ప్రతీకగా నిలుస్తుందన్నారు.
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో తమిళనాడు తీరప్రాంతం పోషిస్తున్న కీలక పాత్రను గురించి వివరిస్తూ, “మూడు ప్రధాన నౌకాశ్రయాలు, పదిహేడు చిన్న ఓడరేవులతో తమిళనాడు సముద్ర వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా మారింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధిని మరింత పెంచడానికి, భారతదేశం ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి కోసం రూ. 7,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతోందన్నారు. అలాగే వి.ఓ.సి పోర్ట్ సామర్థ్యం పెరుగుతూనే ఉంటుందని తెలిపారు. "వి.ఓ.సి. నౌకాశ్రయం భారతదేశ సముద్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉంది” అని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
భారతదేశ విస్తృత సముద్ర మిషన్ గురించి శ్రీ మోదీ మాట్లాడుతూ, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధికి మించి విస్తరించిందన్నారు. "భారతదేశ సుస్థిరమైన, ముందుచూపు గల అభివృద్ధి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నది" అని ఆయన అన్నారు. వి.ఓ.సి. నౌకాశ్రయం గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా, అలాగే సముద్రతీర పవన శక్తి కోసం నోడల్ పోర్ట్‌గా గుర్తింపు పొందిందన్నారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో ఈ కార్యక్రమాలు కీలకమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు.
"అభివృద్ధి ప్రయాణంలో ఆవిష్కరణలు, ఇతరులతో కలిసి పని చేయడం భారతదేశపు గొప్ప బలాలు"గా అభివర్ణించిన ప్రధాని, ఈ టెర్మినల్ ప్రారంభోత్సవం ఐక్యతా బలానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రపంచ వాణిజ్యంలో దేశం స్థానాన్ని బలోపేతం చేయడానికి భారత్ ఇప్పుడు రహదారులు, జాతీయ రహదారులు, జలమార్గాలు, వాయుమార్గాల విస్తారంగా అల్లుకున్న వ్యవస్థలతో మెరుగైన అనుసంధానాన్ని కలిగి ఉన్నట్లు శ్రీ మోదీ తెలిపారు. "ప్రపంచ సరఫరాల వ్యవస్థలో భారతదేశం ప్రధాన వాటాదారుగా మారుతోందనీ, మెరుగవుతున్న ఈ సామర్థ్యం మన ఆర్థికవృద్ధికి పునాది" అవుతుందని ప్రధాన మంత్రి వివరించారు. ఈ వృద్ధిని కొనసాగించడంలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తుందన్న ప్రధాని, ఇదే వేగంతో త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.