ప్రధానమంత్రి మెలోనీ...
పావనమూర్తులు...
మాననీయులు..
మహోన్నతులు..
శ్రేష్టులైన మీకందరికీ...
నమస్కారం!
మున్ముందుగా నన్ను ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించడంతోపాటు అత్యంత గౌరవ మర్యాదలతో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రధానమంత్రి మెలోనీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే చాన్సలర్ ఓలాఫ్ షోల్ట్స్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జి-7 శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకమైనదేగాక, దీనికెంతో చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. ఆ మేరకు కూటమి 50వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయ మిత్రులైన జి-7 దేశాధినేతలందరికీ నా మనఃపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను.
మిత్రులారా!
ఐరోపా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గతవారం మీలో చాలామంది తీరికలేని కార్యక్రమాల్లో మునిగి ఉన్నారు. కొందరు మిత్రులు రాబోయే ఎన్నికల విషయంలో ఉత్కంఠతో ఉండి ఉంటారు. కొన్ని నెలల కిందట భారతదేశంలోనూ ఎన్నికల ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది. అయితే, భారత ఎన్నికల ప్రక్రియ ఎంత విశిష్టమైనదో, ఎంత భారీ పరిమాణంలో ఉంటుందో కొన్ని గణాంకాలు స్పష్టం చేస్తాయి. ఎలాగంటే- మాకు 2,600కుపైగా రాజకీయ పార్టీలున్నాయి... 10 లక్షలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో 50 లక్షలకుపైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, 1.5 కోట్ల మంది సిబ్బందితో సాగిన ఎన్నికలలో దాదాపు 9.70 కోట్లమంది ఓటర్లకుగాను 6.40 కోట్లమంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు! ఈ ప్రక్రియ ఆద్యంతం సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించబడింది. అంతేకాదు... ఇంత భారీస్థాయి ఎన్నికల ఫలితాలు కేవలం కొన్ని గంటల్లో ప్రకటించబడటం కూడా విశేషమే! ఇది ప్రపంచంలో అత్యంత భారీ ప్రజాస్వామ్య మహోత్సవం మాత్రమేగాక మానవాళి చరిత్రలోనే అతిపెద్దది. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన మా దేశంలో ప్రాచీన విలువలకు ఇదొక సజీవ తార్కాణం కూడా. ఈ మహోత్సవంలో భాగస్వాములైన నా దేశ ప్రజలు వరుసగా మూడోసారి తమకు సేవచేసే అవకాశం ఇవ్వడం నా అదృష్టం. గడచిన ఆరు దశాబ్దాల కాలంలో భారత్‌లో ఇలాంటి అద్భుతం ఇదే తొలిసారి. ఈ చారిత్రక విజయం రూపంలో భారత ప్రజలిచ్చిన దీవెనలను ప్రజాస్వామ్య విజయంగా పరిగణించాలి. ఇది యావత్ ప్రజాస్వామ్య ప్రపంచ విజయం... ఈ విజయోత్సాహం నడుమ పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే నా మిత్రులైన మీ అందరితో గడిపే అవకాశం వచ్చినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.
శ్రేష్టులారా!
ప్రస్తుత 21వ శతాబ్దాన్ని ‘సాంకేతికాబ్దం’గా అభివర్ణించవచ్చు. మానవాళి జీవితంలో నేడు సాంకేతిక పరిజ్ఞాన ప్రభావానికి లోనుకాని అంశమంటూ ఏదీలేదు. అయితే, ఒకవైపు చంద్రమండలంపై మానవుడు పాదం మోపే సాహసానికి ఊతమిచ్చిన సాంకేతికత మరోవైపు సైబర్ భద్రత వంటి సవాళ్లు కూడా విసురుతోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికీ అందేవిధంగా, ప్రతి వ్యక్తి సామర్థ్యాన్నీ సద్వినియోగం చేసుకునే దిశగా మనమంతా సమష్టిగా కృషి చేయాలి. అలాగే సామాజిక అసమానతల నిర్మూలన, మానవ శక్తుల విస్తరణ కోసం వాటిని వినియోగించేలా చూడాలి. ఇది మన ఆకాంక్ష మాత్రమే కాదు... బృహత్తర కర్తవ్యం కూడా కావాలి. ఇది సాధ్యం కావాలంటే సాంకేతికతలో గుత్తాధిపత్యాన్ని ప్రజా వినియోగ హితంగా మార్చాలి. సాంకేతికతను విధ్వంసకారకం కాకుండా మనం సృజనాత్మకంగా రూపొందించగలిగితేనే సమ్మిళిత సమాజానికి పునాది వేయగలం. కాబట్టే, భారత్ మానవ కేంద్రక విధానంతో పౌరుల మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేస్తోంది. ఈ క్రమంలో కృత్రిమ మేధ (ఎఐ) సాంకేతికతపై తొలిసారిగా జాతీయ వ్యూహం రూపొందించిన కొన్నిదేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. దీని ఆధారంగా ఈ ఏడాదిలోనే మేము ‘‘అందరి కోసం కృత్రిమ మేధ’’ మంత్రం స్ఫూర్తితో ‘ఎఐ మిషన్’కు శ్రీకారం చుట్టాం. అలాగే ‘ఎఐ’ కోసం ప్రపంచ భాగస్వామ్య కూటమి’ వ్యవస్థాపక సభ్య హోదాతోపాటు అగ్రగామి నాయకత్వ దేశంగా అన్ని దేశాల మధ్య సహకారాన్ని మేం ప్రోత్సహిస్తున్నాం. గత సంవత్సరం భారత్ జి-20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించిన సందర్భంగా ‘ఎఐ’ రంగంలో అంతర్జాతీయ పాలన వ్యవస్థ ప్రాముఖ్యాన్ని మేం నొక్కిచెప్పాం.
మాననీయులారా!
ఇంధన రంగంలో భారత్ విధానానికి ‘లభ్యత, అందుబాటు, సరళత, ఆమోదయోగ్యత’ అనే నాలుగు సూత్రాలు ప్రాతిపదికగా ఉంటాయి. ‘కాప్’ సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ గడువుకు ముందే నెరవేర్చిన తొలి దేశం భారత్ మాత్రమేనని చెప్పగలను. అలాగే 2070 నాటికి నికర శూన్య ఉద్గార స్థాయి లక్ష్య సాధనపై మా నిబద్ధతను సాకారం చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాం. భవిష్యత్ కాలాన్ని హరిత శకంగా మార్చేందుకు మనం సమష్టిగా శ్రమించాలి. ఈ దిశగా భారత్ ఇప్పటికే ‘మిషన్ లైఫ్’... అంటే- ‘పర్యావరణం కోసం జీవనశైలి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా జూన్ 5న పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో ‘‘భూమాత కోసం ఓ మొక్క’’ నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. ప్రతి ఒక్కరూ తమ తల్లిని ప్రేమిస్తారు... అదే పవిత్ర భావనతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం వ్యక్తిగత శ్రద్ధతో, ప్రపంచ పట్ల కర్తవ్య నిబద్ధతతో ఒక ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలి. ఈ మేరకు మీరంతా ఇందులో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. దీనికి సంబంధించిన వివరాలను నా బృందం మీతో పంచుకుంటుంది.
గౌరవనీయులారా!
మా దేశాన్ని 2047నాటికి వికసిత భారత్‌గా రూపొందించాలన్నది మా దృఢ సంకల్పం. ఈ దిశగా దేశ ప్రగతి ప్రయాణంలో సమాజంలోని ఏ వర్గాన్నీ వెనుకబడనీయబోమన్నది మా వాగ్దానం. అంతర్జాతీయ సహకారం విషయంలో కూడా ఈ సూత్రం ఎంతో కీలకం. దక్షిణార్ధ గోళ దేశాలు నేడు ప్రపంచ అనిశ్చితి, ఉద్రిక్తతల భారాన్ని మోస్తున్నాయి. ఆయా దేశాల ప్రాధాన్యాలు, ఆందోళనలను ప్రపంచ వేదిక ముందుంచడాన్ని భారత్ తన బాధ్యతగా భావిస్తోంది. ఆ మేరకు మా కృషిలో ఆఫ్రికా దేశాలకు అధిక ప్రాముఖ్యమిచ్చాం. తదనుగుణంగా జి-20కి భారత్ అధ్యక్షత కింద ఆఫ్రికా సమాఖ్యకు కూటమిలో శాశ్వత సభ్యత్వం కల్పించడం మాకెంతో గర్వకారణం. ఈ నేపథ్యంలో అన్ని ఆఫ్రికా దేశాల ఆర్థిక, సామాజిక ప్రగతితోపాటు సుస్థిరత-భద్రతలకు ఇప్పటికే అందిస్తున్న సహకారాన్ని భారత్ భవిష్యత్తులోనూ కొనసాగిస్తుంది.
ప్రపంచ శ్రేష్టులారా!
అన్ని దేశాల ప్రాథమ్యాల మధ్య లోతైన సమన్వయాన్ని నేటి సమావేశం ప్రతిబింబించింది. ఈ అంశాలన్నిటిపైనా జి-7తో మా సంప్రదింపులు, సహకారాన్ని కొనసాగిస్తాం.
అనేకానేక ధన్యవాదాలు!