“దేశ క్రీడా సంప్రదాయాల కొనసాగింపులో ఈశాన్యం-మణిపూర్ గణనీయ ‌కృషి”;
“సాంస్కృతిక వైవిధ్యానికి కొత్త రంగులద్దిన ఈశాన్యం దేశ క్రీడా వైవిధ్యానికి కోత్తకోణం కూడా జోడించింది”;
“ఏ మేధోమథన శిబిరమైనా సమష్టి ఆలోచనలతో మొదలై.. పునశ్చరణ ద్వారా కొనసాగి.. సదాచరణతో సఫలమవుతుంది”;
“ప్రతి టోర్నమెంటుకూ తగిన క్రీడా మౌలిక వసతులు.. శిక్షణపై మీరు దృష్టి సారించాలి... అలాగే స్వల్ప-మధ్య-దీర్ఘకాలిక లక్ష్యాలనూ నిర్ణయించుకోవాలి”;
“క్రీడా మౌలిక సదుపాయాలకు సంబంధించి ₹400 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తున్నాయి”

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మణిపూర్‌లోని ఇంఫాల్‌లో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడా-యువజన వ్యవహారాలశాఖ మంత్రుల మేధోమథన శిబిరాన్ని ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు.

   దేశం కోసం పతకాలు సాధించడం ద్వారా ఈశాన్య భారత క్రీడాకారులు మన త్రివర్ణ పతాకానికి మరింత ప్రతిష్ట సంపాదించి పెట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అటువంటి ప్రాంతంలోని మణిపూర్‌లో నేడు ఈ మేధోమథన శిబిరం నిర్వహిస్తుండటంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఆడే “సగోల్ కంగ్‌జాయ్, థాంగ్-టా, యుబి లక్పి, ముక్నా, హియాంగ్ తన్నాబా” వంటి సంప్రదాయ క్రీడల గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఇవన్నీ దేనికదే ఎంతో ఆకర్షణీయమైనవని ఆయన వ్యాఖ్యానించారు. “దేశ క్రీడా సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈశాన్య భారతంతోపాటు మణిపూర్ కూడా గణనీయంగా ‌కృషి చేశాయి” అని శ్రీ మోదీ గుర్తుచేశారు. దేశీయ క్రీడల గురించి మరింత వివరిస్తూ- మణిపూర్‌ వాసులు ఆడే ‘ఊ-లవాబీ’ కబడ్డీని పోలి ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ‘హియాంగ్ తన్నాబా’ కేరళలో నిర్వహించే పడవ పందాలను గుర్తుకు తెస్తుందని పేర్కొన్నారు. ఇక పోలో క్రీడతో మణిపూర్‌కుగల చారిత్రక అనుబంధాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తంమీద ఈశాన్య భారతం దేశ సాంస్కృతిక వైవిధ్యానికి కొత్త రంగులు అద్దడమేగాక మన క్రీడా వైవిధ్యానికి కొత్త కోణాలనూ జోడిస్తుందని వ్యాఖ్యానించారు. ‘మేధోమథన శిబిరం’ ముగిసేసరికి దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాశాఖ మంత్రులకు అభ్యసన అనుభవం కలుగుతుందని ప్రధానమంత్రి ఆశాభావం వెలిబుచ్చారు.

   “ఏ మేధోమథన శిబిరమైనా సమష్టి ఆలోచనలతో మొదలై, పునశ్చరణ ద్వారా కొనసాగి, సదాచరణతో సఫలమవుతుంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. అదే సమయంలో భవిష్యత్‌ లక్ష్యాలపైనా చర్చించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడంతోపాటు మునుపటి సమావేశాల నిర్ణయాలను సమీక్షించాలని సూచించారు. ఈ నేపథయంలో గుజరాత్‌లోని కెవాడియాలో  2022 నాటి సమావేశాన్ని, అందులో తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. క్రీడారంగం మెరుగు దిశగా సముచిత క్రీడా పర్యావరణ వ్యవస్థ సృష్టి లక్ష్యంగా అనేక కీలకాంశాలపై చర్చించి, ఒక అంగీకారానికి రావడాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అలాగే క్రీడా రంగంలో కేంద్ర-రాష్ట్రాల భాగస్వామ్యం పెంపొందించే అంశాన్ని కూడా స్పృశిస్తూ ఇప్పటిదాకా సాధించిన ప్రగతిని ప్రముఖంగా వివరించారు. విధానాలు-కార్యక్రమాల స్థాయికే పరిమితం కాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధి, గత సంవత్సర క్రీడా విజయాలపైనా ఈ సమీక్ష సాగాలని ఆయన స్పష్టం చేశారు.

   భారత క్రీడాకారుల గత సంవత్సర ప్రతిభా పాటవాలను, విజయాలను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. అనేక పోటీల్లో... ముఖ్యంగా అంతర్జాతీయ క్రీడలలో మనవాళ్లు విశేష ప్రతిభ ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు. ఈ విజయాలను ప్రోత్సహిస్తూ ఆటగాళ్లకు మరింత సహాయ సహకారాలు అందించాల్సి ఉందని ఆయన నొక్కి చెప్పారు. రాబోయే స్క్వాష్ ప్రపంచ కప్, హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా యూత్-జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌ షిప్ వంటి పోటీలకు క్రీడాకారులు సంసిద్ధం అవుతున్నారని, అదే సమయంలో  క్రీడా మంత్రిత్వశాఖతోపాటు దాని విభాగాల సన్నద్ధతకు ఈ పోటీలు పరీక్ష పెడతాయని ప్రధాని వ్యాఖ్యానించారు. క్రీడా పోటీల విషయంలో సంబంధిత మంత్రిత్వశాఖలు విభిన్న విధానంతో కృషిచేయాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఫుట్‌బాల్, హాకీ వంటి క్రీడలలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వ్యక్తిగతం నిలువరించే (మార్కింగ్‌) వ్యూహాల మధ్య   సారూప్యంతో ప్రతి మ్యాచ్‌ కోసం ప్రత్యేక మార్కింగ్‌ వ్యూహం రచించాల్సిన అవసరాన్ని అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. “ప్రతి టోర్నమెంటుకూ తగిన క్రీడా, మౌలిక వసతులతోపాటు శిక్షణపైనా మీరు దృష్టి సారించాలి. అదేవిధంగా స్వల్ప-మధ్య-దీర్ఘకాలిక లక్ష్యాలనూ మీరు నిర్దేశించుకోవాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

   వ్యక్తిగత దృఢత్వం సాధించడం ఆటగాళ్ల చేతిలోని పనే అయినా, దాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారానే అత్యుత్య ప్రతిభా ప్రదర్శనకు వీలుంటుందని ప్రధాని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా స్థానిక స్థాయిలో (దేశీయంగా) వారు మరిన్ని పోటీలు, టోర్నమెంట్లలో పాల్గొనేలా చూడాలని, తద్వారా వారు విశేష అనుభవం సంపాదించగలరని పేర్కొన్నారు. దేశంలో ఏ మూలనైనా క్రీడా ప్రతిభను విస్మరించరాదని రాష్ట్రాల క్రీడా మంత్రులకు శ్రీ మోదీ సూచించారు. ఆ మేరకు ప్రతిభగల ప్రతి క్రీడాకారుడికీ నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యతని గుర్తుచేశారు. ఈ విషయంలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా ‘క్రీడా భారతం’ (ఖేలో ఇండియా) కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ- దీనిద్వారా జిల్లాల స్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాలు కచ్చితంగా మెరుగయ్యాయని పేర్కొన్నారు. ఈ మెరుగుదలను సమితుల స్థాయికి చేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఈ దిశగా ప్రైవేట్ రంగంసహా భాగస్వాములందరి సహకారం కూడా ముఖ్యమన్నారు. జాతీయ యవజనోత్సవాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దడంపై పునరాలోచన చేయాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాల్లో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు మొక్కుబడి తంతుగా మారకూడదని ఆయన అన్నారు. “ఇలాంటి కృషి సర్వతోముఖంగా ఉంటేనే మన దేశం ప్రసిద్ధ క్రీడా భారతంగా నిలదొక్కుకోగలదు” అని ప్రధాని స్పష్టం చేశారు.

   శాన్య భారతంలో క్రీడారంగ ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఈ ప్రాంతం దేశానికెంతో స్ఫూర్తిదాయకంగా రూపొందిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ మేరకు క్రీడా మౌలిక సదుపాయాలకు సంబంధించి ₹400 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు నేడు ఈశాన్య రాష్ట్రాల ప్రగతికి కొత్త దిశను నిర్దేశిస్తున్నాయని ఆయన చెప్పారు. భవిష్యత్తులో దేశ యువతకు కొత్త అవకాశాలు కల్పించే ఇంఫాల్‌ జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం, దీని ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ‘క్రీడా భారతం’ కార్యక్రమం, ‘టాప్స్‌’ పథకం ద్వారా కృషి వగైరాలను ప్రధానమంత్రి ఉదాహరించారు. ఈశాన్య ప్రాంతంలోని ప్రతి జిల్లాలో కనీసం 2 ఖేలో ఇండియా కేంద్రాలు, ప్రతి రాష్ట్రంలో ఖేలో ఇండియా నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఈ విధంగా సాగుతున్న బహుముఖ కృషి క్రీడా లోకంలో నవ భారతానికి పునాదిగా మారి, దేశానికి కొత్త గుర్తింపు తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తదనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో ఈ తరహా కృషిని భాగస్వాములంతా వేగిరపరచాలని, ఈ విషయంలో మేధోమథన శిబిరం కీలకపాత్ర పోషించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

నేపథ్యం

   దేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ నుంచి 100 మంది ప్రత్యేక ఆహ్వానితులు రెండు రోజులపాటు సాగే ఈ విశిష్ట   మేధోమథన శిబిరంలో పాల్గొంటున్నారు. దేశాన్ని దృఢంగా తీర్చిదిద్దడంతోపాటు నవ భారతాన్ని ప్రపంచంలో అతిపెద్ద క్రీడాశక్తిగా రూపొందించడంపై తమ అభిప్రాయాలు-ఆలోచనలను వీరు కలబోసుకుంటారు. మరోవైపు వ్యక్తిత్వ వికాసం, దేశ నిర్మాణ లక్ష్యాల కోసం కృషి... అంటే- వివిధ ప్రగతి కార్యకలాపాలలో భాగస్వామ్యం ద్వారా యువతలో వ్యక్తిత్వ వికాసం సాధించడంపైనా ఈ శిబిరం చర్చిస్తుంది.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government