మహోదయులారా,
మీడియా మిత్రులారా,
నమస్కారం.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రప్రథమంగా నా మిత్రుడు, అధ్యక్షుడు రమఫోసాను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు సందర్భంగా అనేక సానుకూల ఫలితాలు రావడం నాకు ఆనందంగా ఉంది.
బ్రిక్స్ సమావేశాల 15వ వార్షికోత్సవం సందర్భంగా బ్రిక్స్ వేదికను విస్తరించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నాం. బ్రిక్స్ సభ్యత్వ విస్తరణకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని నేను నిన్ననే ప్రస్తావించాను. బ్రిక్స్ లో కొత్త సభ్యులను చేర్చడం వల్ల సంస్థ మరింత బలోపేతం అవుతుందని, మనందరి ఉమ్మడి ప్రయత్నాలకు మరింత ఉత్తేజం కలుగుతుందని భారతదేశం ఎల్లప్పుడూ విశ్వసిస్తోంది. అలాగే ఈ చర్య బహుముఖీన ప్రపంచ వ్యవస్థపై ప్రపంచ దేశాల విశ్వాసాన్ని కూడా పటిష్ఠం చేస్తుంది. విస్తరణకు సంబంధించిన సిద్ధాంతాలు, ప్రమాణాలు, అర్హతలు, విధివిధానాలపై కూడా మా బృందాలు ఒక అంగీకారానికి రావడం కూడా నాకు ఆనందకరంగా ఉంది. వీటన్నిటి ఫలితంగా బ్రిక్స్ లో చేరాలని మేం అర్జెంటీనా, ఈజిప్టు, ఇరాన్, సౌదీ అరేబియా, ఇథియోపియా, యుఏఇలను నేడు మేం ఆహ్వానించాం. ఆ దేశాలకు చెందిన నాయకులు, ప్రజలను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ దేశాలన్నింటితో కలిసి బ్రిక్స్ లో మరింత సహకారం, ఉత్తేజం, శక్తి కలిగించగలమని నేను విశ్వసిస్తున్నాను.
ఈ దేశాలన్నింటితోనూ భారతదేశానికి చారిత్రకంగా లోతైన బంధం ఉంది. బ్రిక్స్ సహకారంతో ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త కోణాలు కూడా ఆవిష్కరించగలుగుతాం. బ్రిక్స్ లో చేరాలని ఆసక్తి వ్యక్తం చేసిన దేశాలను భాగస్వాములుగా ఆహ్వానించే విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకు భారతదేశం సాధిస్తుందని నేను హామీ ఇస్తున్నాను.
మిత్రులారా,
విస్తరణ, ఆధునీకరణతో అంతర్జాతీయ వ్యవస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలన్న సందేశం కూడా బ్రిక్స్ ఇవ్వగలుగుతుంది. అలాగే 20వ శతాబ్దిలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు కూడా సంస్కరీకరించుకునేందుకు ఈ చొరవ ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
మిత్రులారా,
నా మిత్రుడు రమఫోసా ఇప్పుడే చంద్రయాన్ విజయంపై భారతదేశాన్ని అభినందించారు. ప్రతీ ఒక్కరూ ఇలా శుభాకాంక్షలు అందిస్తుంటే నిన్నటి నుంచి నేను ఇదే తరహా అనుభూతి పొందుతున్నాను. ఇది ఒక జాతి విజయం కాదు, యావత్ మానవాళి విజయం అని ప్రపంచం యావత్తు ఈ విజయాన్ని అభినందిస్తోంది. ఇది మా అందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా యావత్ ప్రపంచానికి చెందిన శాస్ర్తవేత్తలను నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
నిన్న సాయంత్రమే భారతదేశం చంద్రయాన్ ను చంద్రమండలం దక్షిణ ధృవంపై విజయవంతంగా దింపగలిగింది. ఇది భారతదేశానికే కాకుండా మొత్తం ప్రపంచ సమాజానికి ఒక విశిష్టమైన మైలురాయి. భారతదేశం చేరుకున్న ఈ గమ్యాన్ని చేరేందుకు గతంలో ఎవరూ ప్రయత్నించలేదు. ఈ ప్రయత్నం విజయవంతం అయింది. సైన్స్ నేను అత్యంత క్లిష్టమైన ప్రదేశానికి మనని చేర్చగలిగింది. ఇది సైన్స్ కు, శాస్ర్తవేత్తలకు ఒక పెద్ద విజయం.
ఈ చారిత్రక సందర్భంలో నన్ను, భారతదేశాన్ని, భారత శాస్ర్తవేత్తలను, ప్రపంచ శాస్తవేత్తలను అభినందిస్తూ సందేశాలు ముంచెత్తుతున్నాయి. నా తరఫున, నా దేశవాసుల తరఫున, నా శాస్ర్తవేత్తలందరి తరఫున మీ అందరికీ బహిరంగంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
ధన్యవాదాలు.