ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మణిపూర్ సంగై పండుగ సందర్భంగా వేడుకలు నిర్వహించుకుంటున్న రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. రాష్ట్రంలో గొప్ప పండుగగా పేరుపొందిన ఈ వేడుకలు మణిపూర్‌ను ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడంలో తోడ్పడతాయని ఆయన అన్నారు. మణిపూర్‌కు ప్రత్యేకమైన రాష్ట్ర జంతువు ‘సంగై’ (నుదురు-కొమ్ముల దుప్పి) పేరిట ఈ పండుగకు ఆ పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడంపై మణిపూర్ ప్రజలను ప్రధాని అభినందించారు. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ల విరామం తర్వాత ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నందున భారీ ఏర్పాట్లు చేయడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. “మణిపూర్ సంగై వేడుకలు రాష్ట్ర ప్రజల స్ఫూర్తిని, అభిరుచిని ప్రతిబింబిస్తాయి” అన్నారు. ఈ పండుగ నిర్వహణ కోసం మణిపూర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ చేసిన కృషితోపాటు ఆయన సమగ్ర దృక్పథాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
అపార ప్రకృతి సౌందర్యంతోపాటు సుసంపన్న సాంస్కృతిక, జీవవైవిధ్యాలకు మణిపూర్ నెలవని ప్రధాని అన్నారు. దేశంలోని పర్యాటకులు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా ఈ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా కోరుకుంటారని పేర్కొన్నారు. వివిధ మణిమాణిక్యాలతో కూడిన సొగసైన రత్నమాల వంటి ఈ రాష్ట్రం ఒక సూక్ష్మ భారతదేశాన్ని కళ్లకు కడుతుందని ఆయన కొనియాడారు.
ప్రస్తుత అమృతకాలంలో పయనిస్తున్న భారతదేశం ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నదని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. సంగై వేడుక ఇతివృత్తం గురించి వివరిస్తూ- ఇది ‘ఐక్యతా ఉత్సవం’ అని ఆయన అభివర్ణించారు. ఈ పండుగను విజయవంతంగా నిర్వహించడం రాబోయే రోజుల్లో దేశానికి మరింత శక్తిని, ప్రేరణను ఇస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. “సంగై మణిపూర్ రాష్ట్ర జంతువు మాత్రమే కాదు.. భారతదేశ విశ్వాసాలు, నమ్మకాల్లో దానికొక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉత్సవం భారతదేశపు జీవవైవిధ్యాన్ని ప్రస్ఫుటం చేస్తుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అంతేగాక ఇది ప్రకృతితో భారతీయ సాంస్కృతిక-ఆధ్యాత్మిక అనుంబంధాన్ని కూడా స్పష్టం చేస్తుందని ఆయన అన్నారు. అలాగే సుస్థిర జీవనశైలితో ముడిపడిన సామాజిక చైతన్యానికి ప్రేరణనిస్తుందని తెలిపారు. “ప్రకృతితోపాటు వృక్ష-జంతుజాలాన్ని మన పండుగలు, వేడుకలలో భాగం చేసుకుంటే వాటితో సహజీవనం మన జీవితంలో సహజ భాగమవుతుంది” అని ప్రధానమంత్రి ఉద్బోధించారు.
ఈ ఉత్సవాలను రాజధానికే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం ద్వారా ‘ఐక్యతా ఉత్సవం’ స్ఫూర్తిని మరింత విస్తృతం చేయడం హర్షణీయమని ప్రధానమంత్రి అన్నారు. నాగాలాండ్ సరిహద్దు నుంచి మయన్మార్ సరిహద్దు వరకూ దాదాపు 14 ప్రదేశాలలో పండుగ సంబంధిత విభిన్న మనోభావాలు, వర్ణాలను చూడవచ్చని శ్రీ మోదీ అన్నారు. ఈ వేడుకల నిర్వహణలో చూపిన చొరవ ప్రశంసనీయమని కొనియాడుతూ- “మనం ఇలాంటి వేడుకలతో మరింత ఎక్కువ మందిని అనుసంధానిస్తే దాని పూర్తి సామర్థ్యం ముందుకొస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
చివరగా- మన దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న పండుగలు, జాతరల సంప్రదాయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇది మన సంస్కృతిని సుసంపన్నం చేయడమేగాక స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధికీ దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సంగై వేడుకల వంటి కార్యక్రమాలు పెట్టుబడిదారులకు, పరిశ్రమలకు కూడా ప్రధాన ఆకర్షణ కాగలవన్నారు. “భవిష్యత్తులో ఈ పండుగ రాష్ట్రంలో మరింత ఆనందానికి, అభివృద్ధికి శక్తిమంతమైన మాధ్యమంగా మారుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను” అని ప్రధాని అన్నారు.